డిగ్రీ పూర్తికి 70 ఏళ్ళు.. పీహెచ్‌డీ కల ఎప్పటికి నెరవేరేనో!
54 ఏళ్ల క్రితం డిగ్రీ చేయాలని కల. ఆర్థిక సమస్యలతో ఆగిన చదువు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో నెరవేరిన కల. ఇప్పుడు బతికి ఉండగానే పీహెచ్ డీ చేయాలని తపన.
ఆమెకు చిన్నప్పట్నుంచి చదువంటే ప్రాణం. కానీ ఇంట్లో పరిస్థితులు అందుకు సహకరించలేదు. నాన్న దగ్గర ఆమెను పై చదువులు చదివించే స్థోమతు లేదు. అందువల్ల పదో తరగతితోనే ఆ కోరికను చంపుకోవలసి వచ్చింది. జీవితంలో ఎప్పటికైనా డిగ్రీ చేయాలన్నది ఆమె కల. ఆమె స్వప్నం సాకారం కావడానికి 54 ఏళ్లు వేచి చూసింది. తమ పిల్లలందరినీ బాగా చదివించింది. వాళ్లని ప్రయోజకులను చేసింది. ఆ తర్వాత తాను కొత్తగా చదువు మొదలు పెట్టింది. ఏడు పదుల వయసులో తన కలను సాకారం చేసుకుంది. డిగ్రీ పట్టా కొట్టింది. తాను డిగ్రీతో ఆపనని, ఎంఏ, పీహెచ్‌డీ కూడా చేస్తానని రెండో స్వప్నాన్ని కంటోందామె. డబ్బయ్యేళ్ల ఆ వృద్ధ విద్యార్థిని పేరు ఇందిర.. ఊరు విశాఖ!
సుసర్ల ఇందిర అమ్మానాన్నలకు పదకొండు మంది సంతానం. ఆరుగురు ఆడ పిల్లలు, ఐదుగురు మగపిల్లలు. రైల్వేలో చిరుద్యోగం చేసే ఇందిర తండ్రి లింగమూర్తికి ఇంతమందిని ఈడ్చుకు రావడం కష్టంగా ఉండేది. అందుకే మగపిల్లలను అతికష్టమ్మీద ఎస్సెస్ఎల్సీ వరకే చదివించారు. ఇందిరను టెన్త్ కే పరిమితం చేశారు. ‘నాన్నా.. నేనింకా చదువుకుంటాను' అని ఇందిర అంటే 'నా వల్ల కాదమ్మా.. టెన్త్ చాల్లే' అన్నారు. దీంతో బీఏ డిగ్రీ చేయాలనుకున్న ఆమె కోరిక నెరవేరలేదు. 1970లో టెన్త్ పాసైన ఆమెకు 1978లో ఎడపిల్లి హనుమంతరావుతో పెళ్లయింది. ఆపై పిల్లలు, వారి చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ బాధ్యతలు ఆమె చదువుకు బ్రేకులు వేశాయి.
అలా 2017కి అన్ని బాధ్యతలు తీరే సరికి ఆమెకు 66 ఏళ్లు వచ్చేశాయి. తనలో సజీవంగా ఉన్న డిగ్రీ చదువు కోసం కొత్తగా ప్రయత్నించారు. 2018లో ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెన్స్ కోర్సులో ఎంట్రన్స్ రాశారు. 2019లో బీఏ (బీవీకే కాలేజీ)లో చేరారు. 65 ఏళ్ల వయసులో 17 ఏళ్ల అమ్మాయిలా పుస్తకాలు చేతబట్టుకుని చదువు కోవడానికి వెళ్లేవారు. అక్కడ పాఠాలు చెప్పే లెక్చరర్లు ఆమెకంటే 20-25 ఏళ్ల చిన్నవారే. అయినప్పటికీ ఆమె వాళ్లు పాఠాలు చెప్పడానికి వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ సార్! అంటూ అందరితో పాటే లేచి నిలబడేవారు.
వయసు రీత్యా ఆమెకు కాలేజీలో ముందు బెంచిలో కూర్చోబెట్టే వారు. పరీక్షలు నెల రోజుల ముందు నుంచి రాత్రి 10-12 గంటల వరకు, తెల్లవారుజామున 4-6 వరకు చదివేవారు. కొన్నిసార్లు నడుము నొప్పితో కూర్చుని చదవలేక, పడుకుని చదివేవారు. ఆ సమయంలో సరస్వతి దేవిని క్షమించమని వేడుకునే వారు. ఇలా మూడేళ్లు పరీక్షలు రాశారు. అక్టోబర్ 12న వచ్చిన ఫలితాల్లో ఆమె సెకండ్ క్లాస్లో బీఏ పాసయ్యారు. దీంతో ఇందిర ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
నా కలకు 54 ఏళ్లు..
'నేను 1970లో టెన్త్ పాసయ్యాను. ఇంట్లో పరిస్థితుల వల్ల నాన్న నన్ను ఇంటర్ కూడా చదివించలేనన్నారు. దీంతో ఎప్పుడైనా, ఎలాగైనా డిగ్రీ చేయాలని సంకల్పం పెట్టుకున్నాను. మా పిల్లలను బాగా చదివించాను. వారు ప్రయోజకులై మంచి స్థాయిలో ఉన్నారు. నా పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీరే దాకా వేచి ఉన్నాను. ఆ తర్వాత నా భర్త హనుమంతరావు సహకారంతో డిగ్రీ చదువు పూర్తి చేశాను. నా కల నెరవేర్చుకోవడానికి 54 ఏళ్లు పట్టింది. నా ఆనందానికి అవధుల్లేవు. మా కాలేజీలో నేనే పెద్ద వయస్కురాలిని. సాటి విద్యార్థులు మామ్మ గారూ.. అని అంటుంటే నా మనసు ఉప్పొంగిపోయేది. నాకు పాఠాలు చెప్పే లెక్చరర్లు నా దీవెనలు తీసుకుంటుంటే గర్వంగా ఫీలయ్యేదాన్ని. ఇటీవలే నా డిగ్రీ పట్టాను కూడా తీసుకున్నాను. ఆ మధుర క్షణాలు నాకెంతో ఆనందాన్ని, తృప్తినీ ఇచ్చాయి. ఇప్పుడు నా చదువును ఇక్కడితే ఆపను. ఎంఏ కూడా చేస్తాను. ప్రాణం పోయేలోగా పీహెచ్ కూడా చేయాలనుంది. అదీ పూర్తి చేస్తానన్న నమ్మకమూ ఉంది. ఆపై ఆ పైవాడి దయ. 54 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఉన్నత చదువులు కొనసాగించడం చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. ఈ వయసులో నా చదువు ఉద్యోగం, సద్యోగం కోసం కాదు.. జ్ఞానం, విజ్ఞానాన్ని పెంచుకోవడానికే' అని ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి'తో చెప్పారు ఇందిర.
అన్నయ్యకు నా పట్టా అంకితం..
నాలాగే మా పెద్దన్నయ్య సుసర్ల సీతారామశర్మ (90)కు కూడా చదువంటే చాలా ఇష్టం. 50 ఏళ్ల తర్వాత నేను డిగ్రీ చదువుతున్నానంటే ఉప్పొంగిపోయాడు. డిగ్రీ పూర్తి చేసి ఆ పట్టా నాకు చూపించు చెల్లెమ్మా! అన్నాడు. అందుకే ఆ పట్టాతో ఈరోజో రేపో విశాఖ చంద్రనగర్లో ఉన్న అన్నయ్య దగ్గరకు వెళ్లి చూపిస్తాను' అని ఇందిర సంతోషంగా చెప్పారు.
కళ్ల జోడు అవసరం లేకుండానే..
ఇక ఇందిరకు ఇంత వయసొచ్చినా కళ్లజోడు అవసరం రాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె ఇప్పటికీ పుస్తకాలు, పత్రికలు నేరుగానే చదువుతారు. కళ్ల జోడు లేకుండానే పరీక్షలన్నీ రాశారు. వినికిడీ సమస్యా లేదు. 'మా అమ్మ ఏం పెట్టి పెంచిందో గాని నాకు చిన్నప్పట్నుంచీ జ్ఞాపక శక్తి ఎక్కువే.., అదే లేటు వయసులోనూ తన చదువుకు బాగా ఉపయోగపడింది' అని చెబుతారు ఇందిర.