
ఆకుపై భారత రాజ్యాంగం
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయనగరం విద్యార్థులు అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు.
విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, దెందేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని అద్భుతమైన కళాఖండాన్నిసృష్టించారు. తొమ్మిదో తరగతి విద్యార్థినులు అప్పికొండ మేఘన, గుమ్మడి శశిప్రియ ఉపాధ్యాయుల సహకారంతో చామదుంప ఆకుపై భారత రాజముద్రను అత్యంత నైపుణ్యంతో ఆర్డ్ వేసి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కళాకృతిలో సింహస్తంభం, నాలుగు సింహాలు, సత్యమేవ జయతే అక్షరాలతో పాటు “Constitution Day” అనే ఆంగ్ల అక్షరాలు కళాత్మకంగా తీర్చిదిద్ది పలువురిని ఆశ్చర్యపరిచారు. సాధారణ చామదుంప ఆకును రాజ్యాంగ గౌరవ సూచికగా మలచడం విద్యార్థుల సృజనాత్మకతకు, రాజ్యాంగ పట్ల భక్తికి నిదర్శనంగా నిలిచింది. పాఠశాల పీడీ రవికుమార్, ఇన్‌ఛార్జి హెడ్‌మాస్టర్ కమలవాణి, ఇతర ఉపాధ్యాయులు ఈ విద్యార్థినులను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో రాజ్యాంగంగ పట్ల, రాజ్యాంగ విలువలు, పౌర బాధ్యతల పట్ల అపారమైన గౌరవం, అవగాహన పెరిగిందని కొనియాడారు. మరో వైపు ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా “అద్భుతం”, “గర్వంగా ఉంది” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న ఆకుపై చెక్కిన ఈ రాజముద్ర ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సృజనశీలతకు, దేశభక్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ రోజు అంటే నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం. 1949లో ఈ రోజున డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ అధికారికంగా అంగీకరించింది.

