
ఇండియా కూటమి రాజకీయాలు చేస్తోంది
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టి ఇండియా కూటమి రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, అందువల్ల ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ని కలిశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఉప రాష్ట్ర అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశాయన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా ఆయనకే ఉంటుందన్నారు. భారత దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్ గౌరవ, మర్యాదలను తీసుకొస్తారని ఆయన ఆకాంక్షించారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎంపికపై ఆయన స్పందించారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తెలుగు వ్యక్తి అనుకున్నప్పుడు గెలిచే అవకాశం ఉన్నప్పుడే అభ్యర్థిని పెట్టాలని కానీ గెలిచే అవకాశాలు లేనప్పుడు పెట్టడం అనవసరమని, గెలిచే అవకాశాలు లేకపోయినా అభ్యర్థిని పోటీ పెట్టి ఇండియా కూటమి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తాము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తాము ఎలా మద్దతు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.