ఎస్సీ, ఎస్టీ లపై పెరుగుతున్న నేరాలు
టెక్నాలజీ పెరిగింది. అన్ని కులా వారు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కుల వృత్తులు చిన్నగా వదులుతున్నారు. అయినా వివక్ష తగ్గలేదు.
పాలకులు ఒకవైపు అందరూ సమానమని, మనిషి అన్న తరువాత మానవత్వం ఉంటే చాలని చెబుతున్నారు. అయినా కుల విభేదాలు రూపుమాపటంలో మాత్రం వెనుకబాటు తనాన్ని చూపుతున్నారు. ఎందుకని? ప్రస్తుత ఆధునిక సమాజంలో కులాలతో సంబంధం లేకుండా ఎంతో గొప్పగా దేశ సంపదలో భాగస్వాములు అవుతున్నారు. అణగారిన వర్గాలుగా భావిస్తున్న ఎస్సీ, ఎస్టీల నుంచి ఎంతో మంది ధీరోదాత్తులుగా ఎదిగారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినా కుల వివక్ష పోలేదు. ఎస్సీని ఎస్టీలు అంటరాని వారుగా చూస్తున్నారు. గోచీ కూడా లేకుండా బతికిన వారు మమ్మల్ని హీనులుగా చూస్తారా? అంటూ ఎస్సీల్లో ఎంతో మంది ఎస్టీలను ప్రశ్నిస్తున్నారు. కులం పేరుతో ఒకరిని ఒకరు ద్వేషించుకునే సమాజం లేకుండా పోవాలనే ఆలోచన ప్రభుత్వాలు చేస్తే తప్ప ప్రజల నుంచి చైతన్యం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన ఇతర నేరాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీలపై 2023తో పోలిస్తే 2024లో ఇతర నేరాలు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంటే హత్యలు, అత్యాచారాలు, దాడులు, అల్లర్ల వంటి సంఘటనలు కాస్త తగ్గినా కుల వివక్ష, అంతరాలు పెరిగాయి. ఇతర నేరాలంటే ప్రభుత్వం సరైన సమాధానం ఏమి చెప్పదలుచుకున్నదో కాని అట్రాసిటీ కేసుల సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య బీసీలపై కూడా పెరుగుతూనే ఉంది. అయితే వారికి అట్రాసిటీ చట్టం వర్తించదు కాబట్టి బయటకు రావటం లేదు. 2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని బీసీ కులాలను కులం పేరుతో పిలిస్తే కేసులు నమోదు చేయొచ్చని జీవోలు ఇచ్చింది. ఉదాహరణకు ఒరేయ్.. చాకలోడా అన్నా నేరంగానే పరిగణించాల్సి వుంటుంది. (రజక, నాయీబ్రాహ్మణ, దాసరి వాళ్లకు సంబంధించి కులం పేరుతో పిలిస్తే నేరమేనని జీవోలు ప్రభుత్వం ఇచ్చింది.)
అట్రాసిటీ నేరాలకూ అదుపు లేకుండా పోయింది
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి చట్టం ఉన్నందున ఆ చట్టం కింద కేసులు నమోదు కావడంతో అసలు విషయం బయటకు వస్తోంది. 2023లో వివక్షకు సంబంధించిన నేరాలు ఎస్సీ, ఎస్టీలపై 1,637 ఉండగా, 2024లో ఈ నేరాలు 1,787కు పెరిగాయి. అంటే 9.16శాతం నేరాలు పెరిగాయి. మనం ఏ యుగంలో ఉన్నాము. ఇంకా వివక్ష ఏమిటి? కేసులు ఏమిటి? ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయనే అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. వాటి కంటే ఇతర నేరాలు పెరిగినట్లు చెప్పారే తప్ప సాధారణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాలు జరగటం లేదని మాత్రం చెప్పలేక పోతున్నారు. 2023లో అట్రాసిటీ నేరాలు 2,479 జరగగా 2024లో ఆ నేరాలు 2,356 జరిగాయి. అంటే గతంలో కంటే 5శాతం అట్రాసిటీ కేసులు తగ్గినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అగ్రకులస్తుడైతే కొట్టేవారా?
చాలా చోట్ల ఇంకా కులం పేరుతో ధూషించడమే కాకుండా కొట్టి హింసిస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తెలిపారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో పై దాడి కుల వివక్షతోనే దాడి జరిగిందని, అదే అగ్రకులానికి చెందిన వాడైతే ఈ దాడి జరిగేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. దాడులు చేయడం, ఆ తరువాత పోలీసులు అరెస్ట్ లు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఈ వివక్షకు మూలాలు ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఆ మూలాలను తుదముట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇటువంటి దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో హోం మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి మరోసారి అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.