అర్జీలకు పెరిగిన డిమాండ్
x

అర్జీలకు పెరిగిన డిమాండ్

ఎపిలో అర్జీలకు డిమాండ్ పెరిగింది. రాజకీయ పార్టీలు అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టాయి. ఎప్పుడూ లేనిది ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలైంది.


గ్రీవెన్స్... ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో చేపట్టాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014కు ముందు ఆంధ్రప్రదేశ్ లో చేపట్టారు. ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. 2014లో జిల్లా కలెక్టర్ కార్యాలయాలే కాకుండా మండల స్థాయిలోనూ అధికారులు అర్జీలు స్వీకరించేలా ఆదేశాలు అందాయి. ప్రతి సోమవారం అర్జీల స్వీకరణ దినంగా నిర్ణయించి అధికారులందరూ అర్జీదారులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా స్పందన అనే పేరుతో అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో ప్రజల నుంచి ఒక్కరోజు కూడా నేరుగా అర్జీలు స్వీకరించలేదు. మొదట్లో కొద్ది రోజులు క్యాంపు కార్యాలయం వద్ద సీఎం ఆఫీస్ అధికారులు అర్జీలు తీసుకున్నారు. సెక్యూరిటీ కారణాలు చెబుతూ అక్కడ అర్జీలు తీసుకునే కార్యక్రమానికి స్వస్తి చెప్పారు.

టీడీపీ కార్యాలయంలో...

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 15 రోజులకు ఒకసారి ముందుగానే షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. రోజూ ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు ఒకరు కలిసి అర్జీలు తీసుకుంటున్నారు. అర్జీలు స్వీకరించినప్పుడే సమస్యను విని అర్థం చేసుకున్న తరువాత సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ఫోన్ లు చేస్తున్నారు. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉంది. అసలు ఇంతకు ముందుకు ఎప్పుడైనా సమస్య ద్రుష్టికి వచ్చిందా లేదా? అనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకోవడమే కాకుండా సమస్యను అధికారులకు చెప్పి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రధానంగా పార్టీ కార్యకర్తలు ఇచ్చే అర్జీలు తీసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇదో వినూత్న ప్రయోగమని చెప్పొచ్చు. పైగా చంద్రబాబునాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదని, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా వ్యవహరించేందుకు ఒక లైజనింగ్ సిస్టంను తయారు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులంటే ప్రజలపై నమ్మకం పోయిందని, దీని ద్వారా ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో పలు మార్లు చంద్రబాబు నాయకులతో అన్నారు.

లోకేష్ ప్రజా దర్బార్...

విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట మంగళగిరి నియోజకవర్గం వరకే పరిమిత మయ్యారు. పైగా విద్యాశాఖకు సంబంధించిన అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే లోకేష్ ముఖ్యమంత్రి కుమారుడు కావడం, ముఖ్యమంత్రి నివాసంలోనే లోకేష్ కూడా నివాసం ఉండటం వల్ల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే లోకేష్ తన చాంబర్లో అర్జీలు స్వీకరిస్తున్నారు. మంగళగిరి వాసులే కాకుండా రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా వారి అర్జీలు కూడా తీసుకుని సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు కావడం, పార్టీకి ప్రధాన కార్యదర్శి కావడం వల్ల ఆయనకు ఉండే ప్రయారిటీ ఉంటుంది. అధికారులు కూడా లోకేష్ నుంచి ఏదైనా సమస్య పరిష్కారం కోసం అర్జీ వచ్చిందంటే వెంటనే స్పందిస్తున్నారు.

జనసేన పార్టీ కార్యాలయంలో...

జనసేన పార్టీ కార్యాలయంలో కూడా అర్జీలు స్వీకరించే కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడే అర్జీలు తీసుకుంటున్నారు. అయితే పార్టీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ముగ్గురు ఎమ్మెల్యేలు, అప్పుడప్పుడు మంత్రులు అర్జీలు తీసుకుంటున్నారు. నెల రోజుల షెడ్యూల్ ను జనసేన పార్టీ ముందుగానే ప్రకటించి మీడియాకు కూడా సమాచారం అందిస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో ఉంటే ఎక్కడంటే అక్కడ ఒక కుర్చీ వేసుకుని కూర్చుని ఒక్కొక్కరితో క్షుణ్ణంగా మాట్లాడి సమస్యను అర్థం చేసుకుని విజయవాడ లేదా చుట్టుపక్కల గ్రామాల వారైతే సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని అధికారుల వద్దకు అప్పటికప్పుడే పంపిస్తున్నారు. తన కూతురును ఒక యువకుడు మాయమాటలు చెప్పి తీసుకుపోయాడని, ఎక్కడున్నారో ఫోన్ సమాచారం కూడా లేదని విజయవాడకు చెందిన ఓ మహిళ అర్జీ ఇవ్వడంతో వెంటనే విజయవాడలోని సంబంధిత సీఐతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ యువతిని వారి తల్లి ఇంటికి చేర్చారు. పలు రాష్ట్రాల్లో తిరిగి జమ్ము కాశ్మీర్ కు చేరారు. అక్కడ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు జమ్ము పోలీసుల సహకారంతో యువతిని తీసుకు రాగలిగారు. తిరుపతి నగరంలోని ఒక కాలనీలో కొందరు కుర్రవాళ్లు యువతులు, వ్రుద్ధులను వేధిస్తున్నారని కంప్లైంట్ పోస్టు ద్వారా అందటంతో దానిని తీసుకుని పరిశీలించి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా తిరుపతి ఎస్పీకి సమాచారం అందించి వారి ఆట కట్టించారు. మహిళా వేధింపుల కేసులు ఎక్కువగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతున్నాయి. భూ సంబంధిత కేసులు ముఖ్యమంత్రికి చేరుతున్నాయి. సాయం కావాలనే అర్జీలు లోకేష్ వద్దకు ఎక్కువగా వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. జనసేన పార్టీ కార్యాలయంలో అర్జీలు తీసుకునే కార్యక్రమానికి ‘జనవాణి’గా పేరు పెట్టారు.

బిజెపి వారధి...

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కూడా అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు చేపట్టారు. తమ పార్టీ తరపున ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు వారధి కో ఆర్డినేటర్ దిలీప్ సోమవారం ప్రకటించారు. ఏ రోజు ఎవరెవరు అర్జీలు తీసుకుంటారనే విషయాన్ని ముందుగానే ప్రకటిస్తామని, మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నామని చెప్పారు.

సంతోషంలో ప్రజలు

ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రజల నుంచి అర్జీలు పార్టీ రాష్ట్ర కార్యాలయాల్లో మంత్రులు, ముఖ్యమంత్రి తీసుకుంటుండంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. పైగా సమస్యలు కూడా దాదాపు పరిష్కారం అవుతున్నాయి. ప్రజలకు సమస్యలు పరిష్కరించే పాలకులు ఎంతో ముఖ్యమని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీ వారైనా సమస్యతో వస్తే వారి సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై సదాభిప్రాయం ఏర్పడేలా చేసుకోవచ్చు. తిరిగి ఆ ప్రజలు సమస్యలు పరిష్కరించే పార్టీవైపు మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు. భూ సమస్యలు జీవన్మరణ సమస్యలుగా ఉంటున్నాయి. అటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటంతో అర్జీదారుల ముఖాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. క్రైం సమస్యల పరిష్కారంవైపు పవన్ కళ్యాణ్ ఎక్కువ దృష్టి పెట్టకపోయినా ఆ విధమైన అర్జీలే ఎక్కువ వస్తున్నాయి. ప్రజలు ఎందుకు క్రైం సమస్యలను పవన్ కళ్యాణ్ వద్దకు తెస్తున్నారని ఆరా తీస్తే రాష్ట్రం నుంచి సుమారు 30వేల మంది బాలికలు, యువతులు మాయమయ్యారని కేంద్ర నివేదికలు చెబుతున్నాయని, వీరంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే మాయమయ్యారని చెప్పిన అంశాన్ని ప్రజలు బలంగా నమ్మారు. అందుకే ఆయన వద్దకు మహిళలు, యువతులు, బాలికల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

అర్జీలు కంప్యూటరీకరణ

ఎక్కువ సమయం పట్టే అర్జీలు, ప్రధాన మైన సమస్యతో వస్తున్న అర్జీలను తీసుకోవడంతో పాటు ప్రతి పార్టీ కార్యాలయంలోనూ కంప్యూటరైజ్ చేస్తున్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన యంత్రాంగం అర్జీల స్టేటస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసి అధికారులను అలర్ట్ చేస్తున్నారు. అర్జీలు కంప్యూటరైజ్ చేసి ఫాలో అప్ చేస్తున్నారని తెలియడంతో అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాల్లోనూ అర్జీలు తీసుకోవాలని, జిల్లాలో ఉండే మంత్రులు అందుబాటులో ఉంటే తప్పకుండా ఏదో ఒక సమయంలో పార్టీ ఆఫీస్ కు వెళ్లాలని సీఎం ఆదేశించినందున మంత్రులు జిల్లా కార్యాలయాలకు వెళుతున్నారు.

కలెక్టర్ల వద్ద ఇస్తున్న అర్జీలు ఇప్పటికే కంప్యూటరైజ్ అవుతున్నాయి. కింది స్థాయి అధికారులను కూడా సమస్య ఏ దశలో ఉందనే వివరాలు జిల్లా అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. గ్రీవెన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి చేసి చూపిస్తోంది. ఈ కార్యక్రమం కడవరకూ కొనసాగుతుందా? మధ్యలోనే ఆపేస్తారా? అనే అనుమానాలను కూడా కొందరు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ల వద్ద ఇచ్చిన అర్జీలకు దిక్కులేకుండా పోతోందని, అందుకే పార్టీ కార్యాలయాల్లో ఇస్తే స్పందన బాగుంటుందనే భావనతో వస్తున్నట్లు కొందరు అర్జీదారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన బత్తిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండేళ్లుగా పాస్ పుస్తకంలో పేరు తప్పుగా నమోదైందని కలెక్టర్ తో సహా ఎంతమందికి చెప్పినా పరిష్కారం కాలేదని, కంప్యూటర్ ఒక్కోసారి తీసుకోవడం లేదని తహశీల్దార్ అఫీస్ వారు తప్పించుకుంటున్నారని చెప్పారు. అందుకే టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాల్సి వస్తోందన్నారు.

Read More
Next Story