ఆ అంశాల్లో అర్చకుల పాత్ర అపరిమితం.. అధికారుల పాత్ర పరిమితం
x

ఆ అంశాల్లో అర్చకుల పాత్ర అపరిమితం.. అధికారుల పాత్ర పరిమితం

దేవాలయాల్లో నిర్వహించే కొన్ని అంశాలలో అర్చకులకు అపరిమిత అధికారాలు కల్పిస్తూ, అధికారుల పాత్రను పరిమితం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


ఆంధ్రప్రదేశ్ లో అటు తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు, ఇటు విజయవాడలో కనక దుర్గమ్మ దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండూ ప్రసిద్ధి గాంచిన ఉత్సవాలే.దీంతో భక్త జనం భక్తి పారవశంతో మునిగి తేలుతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో భక్తి భావం పొంగిపొర్లుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించడం విశేషం. దేవాలయాల్లో నిర్వహించే యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు, ధూప, దీప నైవేద్యాలు వంటి సేవల్లో అధికారుల పాత్ర పరిమితం, అర్చకుల పాత్ర అపరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆలయాల్లో అర్చకులకు సర్వాధికారాలు కల్పించినట్టు అయింది.

ఇకపై దేవదాయ కమిషనర్‌తో సహా ఏ స్థాయి అధికారులైనా, జిల్లా అధికారులైన వైదిక విధుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపింది. యాగాలు, కుంభాభిషేకాలు, పూజలు, ఇతర సేవల్లో అధికారుల పాత్ర పరిమితం చేసింది. ఆధ్యాత్మిక విధులకు సంబంధించి ఏ విషయంలో అయినా సరే, తుది నిర్ణయం తీసుకునే అధికారం అర్చకులకే ఉంటుందని పేర్కొంది. అవసరమైతే దేవాలయాల పాలనా అధికారు(ఈఓ)లు వైదిక కమిటీలు వేసుకునే వెసులుబాటు కల్పించింది. అర్చకులకు, అధికారులకు ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే, పీఠాధిపతుల సలహాలు తీసుకోవచ్చని తెలిపింది. ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం అర్చకులు వైదిక విధులు నిర్వహించుకునేందుకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించింది.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మరో హామీని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని ఈ అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ టీడీపీ తన అధికారిక సామాజిక మాధ్యమంలో పేర్కొంది. రాష్ట్రంలోని దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో దేవాదాయ శాఖ కమిషనర్, రీజినల్‌ జాయింట్‌ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్‌ కమిషనర్, చివరకు ఈఓలు సైతం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆలయాల్లో అధికార, రాజకీయ జోక్యం మితిమీరి పోయింది. ఆలయాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల్లో ఆ పార్టీ నాయకులు జోక్యం చేసుకొని నిర్వహణను భ్రష్టు పట్టించారని విమర్శించారు. దీంతో ఎన్నికల ప్రచారంలో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. నేడు ఆ హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.
Read More
Next Story