
అమరావతి వస్తున్న‘ ప్రధాని మోదీ సార్’ కు రాయల సీమ వాసి విజ్ఞప్తి
రావలిసింది అమరావతికి కాదు, బిజెపి ‘రాయలసీమ డిక్లరేషన్’ అమలుకు శ్రీకారం చుట్టేందుకు రాయలసీమ రావాలి అని ప్రధాని మోదీకి బహిరంగ విజ్ఞప్తి
-తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి
మీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎపుడో 2018 ఫిబ్రవరిలో ప్రకటించి, తప్పక అమలు చేస్తామన్న 'రాయలసీమ డిక్లరేషన్' (Rayalaseema Declaration) అమలు చేయడానికి మా రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడు వస్తారు, మోదీ సార్.
విభజన చట్టంలో ఉన్న మా 'కడప ఉక్కు పరిశ్రమ' శంకుస్థాపనకు ఎప్పుడు వస్తారు, మోదీ సార్..
రాయలసీమ ప్రాంతానికి 'బుంధేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ' ఎప్పుడు మంజూరు చేస్తారు, మోదీ సార్...
అంతర్ రాష్ట్ర జలవివాధాలను వెంటనే పరిష్కరించాల్సిన విభజన చట్టంలో ఉన్న సమస్యలు ఎప్పుడు పరిస్కరిస్తారు, మోదీ సార్..
12సంవత్సరాలు కావస్తున్నా విభజన హామీలను మా రాయలసీమ ప్రాంతంలో ఎందుకు ఇంతవరకు అమలు చేయడం లేదు, మోదీ సార్...
మీ చెప్పు చేతల్లో ఉన్న ఏపి ప్రధాన పార్టీలయిన తెలుగుదేశం, జనసేన మా రాయలసీమ ప్రాంతానికి జరుగుతూనే ఉన్న అన్యాయము గురించి మీకు ప్రత్యేకంగా ఏ రోజు వివరించలేదు. వివరిస్తారన్న నమ్మకం కూడా లేదు మాకు. కాబట్టి మా రాయలసీమ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైవుతున్నది. ఇపుడు, మీ పుణ్యమా అని కర్ణాటక రాష్ట్రంలో "అప్పర్ భద్ర జాతీయ ప్రాజెక్టు" నిర్మాణంతో త్వరలో ఎడారి కాబోతోంది, మోదీ సార్..
ఇప్పటికైనా మా రాయలసీమ ప్రాంతంలో ఉన్న జనాలను కాపాడటానికి కృష్ణా, తుంగభద్ర నదులతో పశ్చిమ ప్రాంతంలో ఉన్న వేదవతి, పెన్నా, చిత్రావతి నదులను జాతీయ వరద కాలువ నిర్మాణంతో అనుసంధానం చేయాలని రాయలసీమ ప్రాంత ప్రజల తరుపున కోరుతున్నాను.
మీ విధానమేమిటో అర్థం కావడం లేదు, మోదీ సార్
కాలుష్యం పెరిగిపోయిన దేశ రాజధాని లో ఢిల్లీలో మూడు రోజులు ఉంటే జబ్బులు వస్తాయ మీ మంత్రి నితిన్ గడ్కరీ భయపెడుతున్నాడు. మరలాంటపుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మరోసారి అభివృద్ధి కేంద్రీకరణకు మీ కేంద్రం ఎందుకు సహకరిస్తోంది, మోదీ సార్.
ఢిల్లీ ముంబై కాలుష్యం విషయంలో రెడ్ జోన్ లో ఉన్నాయని, ఢిల్లీలో ఎక్కువ కాలం బతికితే, అయుష్షు సగం తగ్గుతుందని కేంద్ర ఉపరితలరవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. మరి అమరాతిని అమాంతం సైజ్ పెంచుకుంటూపోతున్నారు. పరిశ్రమలు, అక్కడే, విద్యాసంస్థలు అక్కడే, కార్యాలయాలు అక్కడే... ఇంత కేంద్రీకరిస్తే, కాలుష్యం పెరగదా. అమరావతి మరొక ఢిల్లీ ముంబై కాదా. ఇలాంటి ప్రమాదకరమయిన అభివృద్ధి కేంద్రీకరణకు సంకేతంగా నిలుస్తున్న అమరావతి నిర్మాణానికి మీరు రెండో శంకుస్థాపన చేసేందుకు రావడం న్యాయమా?
మీ బీజేపీ పార్టీ 2018లో మా కర్నూల్ లో అట్టహాసంగా చేసిన 'రాయలసీమ డిక్లరేషన్' గుర్తుందా. లేక చెత్త బుట్టలో వేసారా సార్,
రాయలసీమ డిక్లరేషన్ లో ఎమి చెప్పారో గుర్తుందా, మోదీ సార్.
కర్నూల్‌ను ఏపీ రాష్ట్రానికి రెండో రాజధాని చేయాలన్నారు. రాయలసీమలో హైకోర్టు, గవర్నర్ తాత్కాలిక విడిది, సీఎం నివాసం ఏర్పాటు చేయాలని, రాయలసీమలో అసెంబ్లీ భవనం ఏర్పాటు చేయాలని కూడా బిజెపి నేతలు కర్నూలులో సమావేశమై ఈ డిక్లరేషన్ చేశారు.
రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 2023లో ఎన్నికల ముందు కూడా నొక్కి చెప్పారు. అపుడామె ఎంత గొప్పగా మాట్లాడారంటే, రాయలసీమ వాసులమైనా మేమే కూడా అలా మాట్లాడలేము. “ఎన్టీ రామారావు తాను రాయలసీమ ముద్దు బిడ్డఅని, దత్త పుత్రుడిని ప్రకటించుకున్నారు. అలాంటి రాయలసీమ కర్మ భూమి అని.. ఇక్కడి నుంచే నేను బాధ్యతల నిర్వహణ మొదలు కావడం సంతోషంగా ఉంది,” అని పురందేశ్వరి బిజెపి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తూ అన్నారు.
మీరు గతంలో అమలు చేస్తామన్న రాయలసీమ డిక్లరేషన్ కు వెంటనే నిధులను మంజూరు చేయండి. దానిని అమలుచేసేందుకు ఇది మంచి తరుణం. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వ మీ చేతుల్లో ఉంది. అందువల్ల మీరు రావలసింది అమరావతి శంకుస్థాపనకు కాదు, రాయలసీమ డిక్లరేషన్ అమలు చేసేందుందుకు. రాయలసీమ డిక్లరేషన్ గురించి మీ అమరావతి పర్యటనలో ఒకసారి తిరగేస్తారని ఆశతో...
(తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్)