నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. నాపైన అక్రమ కేసులు పెట్టారు. ఒకే విధమైన కేసులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాపై కేసులు పెట్టారు. అందులో భాగంగా నన్ను రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు. నాకు ఆరోగ్యం బాగలేదు. గుండె జబ్బు, పక్షవాతం, బీపీ వంటి రుగ్మతలతో సతమతమవుతున్నాను. దయచేసి నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని నా పై నమోదు చేసిన అక్రమ కేసులను కొట్టి వేయాలని కోరుతున్నా. అంటూ విజయవాడ కోర్టులో శనివారం పోసాని కృష్ణమురళి న్యాయాధికారిని కోరారు. కానీ పోసాని విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. మరో వైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో చుక్కెదురైంది. రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతులు జారీ చేస్తూ తీర్పు వెలువరించింది. బెయిల్ పిటీషన్‌ను సోమవారానికి వాయిదా వేసింది.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి కేసులో శనివారం మరో మలుపు చోటు చేసుకుంది. విజయవాడ సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించినా.. విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో మాత్రం పోసానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు మీద విచారణ చేపట్టిన కోరు.. పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని, విజయవాడకు చెందిన జనసేన నాయకుడు బాడిత శంకర్ భవానిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో భవానిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ మీద ప్రత్యేక వాహనంలో పోలీసులు విజయవాడకు శనివారం తీసుకొచ్చారు. దీని మీద విచారణ చేపట్టిన పోసానికి రిమాండ్ విధించింది. దీంతో పోసానిని మళ్లీ కర్నూలు జైలుకు తరలించారు. విచారణ సమయంలో పోసాని తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకున్నారు. ఒకే విధమైన కేసులు పెట్టి తనను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను తిప్పుతున్నారని, ఇవన్నీ అక్రమ కేసులే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, గుండె జబ్బులు, పక్షవాతం వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, వీటిని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు.
ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు మీద ఆదోని అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాదులు జీవన్ సింగ్, సువర్ణరెడ్డిలు పోసాని తరపున వాదనలు వినిపించారు. పోలీసుల తరపున ఏపీపీ మహేశ్వరి వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో, కావాలనే పోసాని మీద కేసులు పెట్టారని పోసాని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను దూషించిన సందర్భంలో తీవ్రమైన పదజాలం ఉపయోగించారని, పోసాని మాటలు బాధితుల ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నాయని ఏపీపీ మహేశ్వరి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తరుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.