పెన్షన్ కోసం వెళితే ప్రాణాలు పోతున్నాయి!
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ప్రాణాలు తీస్తోంది. ఎందుకిలా జరుగుతోంది. కారకులు ఎవరు?
పెన్షన్ దారులతో ప్రభుత్వం, ప్రతిపక్షం ఆటలాడుకుంటున్నాయి. వారి రాజకీయ లబ్ధి కోసం పెన్షన్ దారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మండుటెండలో బ్యాంకుల వద్దకు వెళ్లి వడగాల్పులకు తట్టుకోలేక మూడు రోజుల్లో ఏడుగురు వృద్ధులు చనిపోయినట్లు ప్రభుత్వం చెబుతోంది. మొదులే అనారోగ్యంతో బాధ పడేవారు, వయసు పైబడటంతో వచ్చే ఇబ్బందులతో బాధ పడేవారు వడగాలులకు గురైతే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఒక్క రోజు ఎండలో వడ దెబ్బకు గురైతే వృద్ధులైన వారు కనీసం నెల రోజులు కోలుకునే పరిస్థితి ఉండదు. ఇదంతా ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఒకటికి పదిసార్లు చెబుతున్న ప్రభుత్వం, వృద్ధులు ఎండకు బ్యాంకుల వద్దకు వచ్చి పగిగాపులు కాయడం వల్ల ఎదురయ్యే పరిణామాలు తెలియవంటే ఎవరు నమ్ముతారు?
కట్ చేస్తున్న బ్యాంకులు
ఏప్రిల్ నెలలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగింది. ఈ కార్యక్రమం ఆలస్యం అవుతున్నందు వల్ల నేరుగా పెన్షన్ దారుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీబీటీ పద్ధతి ద్వారా వారి ఖాతాల్లో నగదును జమ చేసింది. పెన్షన్ దారుల ఖాతాల్లో నగదును జమ చేసే ముందు పూర్తి నగదు మొత్తాన్ని పెన్షన్ దారులకు చెల్లించాలని బ్యాంకుల అధికారులకు ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో బ్యాంకుల వారు లబ్ధి దారుల పాస్ పుస్తకం మనుగడలో లేదని, దానిని పునరుద్దరించేందుకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్(మినిమమ్ బ్యాలెన్స్) ఉండాలని, మరి కొంత మొత్తం డబ్బును కట్ చేస్తున్నారు. ఇలా దాదాపు 60 శాతం మంది పెన్షన్ దారులకు మే నెల పెన్షన్ రూ. 2వేలు మాత్రమే చేతికి వచ్చింది.
ఏటీఎంల వద్ద పడిగాపులు
పెన్షన్ దారుల్లో చాలా మందికి ఏటీఎం కార్డులు లేవు. ఒక వేళ ఉన్నా నడవ లేని స్థితిలో ఉన్న ముసలి వాళ్లు ఏటీఎంల వద్దకు వెళ్లి ఎలా నగదును తీసుకోవాలో తెలియదు. దీంతో డబ్బును తీసుకునేందుకు ఎవరైనా ఎటీఎంల వద్దకు వస్తే వారి సహాయంతో ఏటీఎంల నుంచి పెన్షన్ నగదును తీసుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. మే 2, 3వ తేదీల్లో బ్యాంకుల వద్ద పెన్షన్ డబ్బును తీసుకునేందుకు వచ్చిన వృద్ధులతో బాగా రద్దీ పెరిగింది. బ్యాంకుల్లో పాన్, అధార్ కార్డుల అనుసంధానం లేక పోవడం వల్ల కొన్ని ఖాతాల నుంచి నగదును విత్‌డ్రా చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. మరి కొంత మంది జగనన్న కాలనీలు నిర్మించే కాంట్రాక్టర్ల బ్యాంకుల ఖాతాలకు పెన్షన్ దారుల ఖాతాలు అనుసంధానమై ఉండటం వల్ల పెన్షన్ నగదు వారి ఖాతాల్లోకి చేరింది. జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టే వారు ఎక్కడ ఉంటారో, వారిని వెతికి పట్టుకోవాలో తెలియడం లేదు.
ప్రభుత్వం,ప్రతిపక్షం పరస్పర విమర్శలు
ప్రతిపక్షం పెన్షన్ దారులకు వాలంటీర్ల ద్వారా డబ్బును ఇవ్వొద్దని చెప్పినందుకు, ప్రతిపక్ష నాయకులే కారణమని నిరూపించేందుకు ప్రభుత్వం కూడా పెన్షన్ దారుల చావులకు కారణమైంది. పెన్షన్ దారుల ఖాతాల్లో పడిన సొమ్మును పూర్తిగా వారికి చెల్లించాలని బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడంలోను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు నెల రోజుల పాటు సమయం ఉన్నా పెన్షన్ పంపిణీని సరైన మార్గంలో నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని, కావాలనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ సొమ్మును సకాలంలో వారి ఇంటి వద్దకే వెళ్లి ఇస్తుంటే ఓర్వ లేక ప్రతిపక్ష నాయకులు, సిటిజన్ ఫర్ డెమోక్రెసీ సంస్థ కలిసి పెన్షన్ దారులకు కష్టాలు తెచ్చారని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపిస్తోంది.
వెల్లువెత్తుతున్న విమర్శలు
పెన్షన్‌ల పంపిణీ విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం పెన్షన్ దారుల కష్టాలకు కారణం కావడం రాజకీయ లబ్ధిలో భాగమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 65,49,864 మంది పెన్షన్ దారులు ఉన్నారు. మే నెల 1వ తేదీనే 64,13,200 మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇది డీబీటీ పద్దతి ద్వారా పంపిణీ జరిగినట్లు వెల్లడించింది. పెన్షనర్ల కోసం ప్రభుత్వం రూ. 1,945.39 కోట్లు నిధులు విడుదల చేసింది. 74,399 మంది పెన్షనర్ల బ్యాంకుల ఖాతాలు పని చేయడం(ఇన్ యాక్టివ్‌గా ఉన్నాయని) లేదని ప్రభుత్వం వెల్లడించింది. వీరందరికీ ఇంటి వద్దనే పెన్షన్‌లు పంపిణీ చేసే విధంగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
Next Story