
అమరావతిలో ఇద్దరు రైతులకు భూ సేకరణ నోటీస్
అమరావతి భూ సేకరణ వివాదం, ప్రభుత్వ విధానాలు, రైతుల హక్కుల మధ్య సంఘర్షణ.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాజెక్టు సందర్భంగా భూ సేకరణ ప్రక్రియలు మరోసారి వివాదాస్పదం అవుతున్నాయి. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా ఈనెల 8న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రైతులు పసుపులేటి జమలయ్య, కలపాల శరత్ కుమార్‌లకు చెందిన భూమిని భూ సేకరణ చట్టం, 2013లోని సెక్షన్ 11(1) మరియు రూల్ 19(1) కింద సేకరించేందుకు ప్రాథమిక ప్రకటన జారీ అయింది. ఈ చర్య అమరావతి నగర అభివృద్ధి ప్రాజెక్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ నిర్ణయం రైతుల హక్కులు, పారదర్శకత, చట్టపరమైన ప్రక్రియలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇద్దరు రైతుల భూ సేకరణ వివరాలు
ప్రకటన ప్రకారం సర్వే నంబర్ 225-1లో మొత్తం 4.60 ఎకరాల భూమి ఉండగా, అందులో పసుపులేటి జమలయ్య నుంచి 40 సెంట్లు, కలపాల శరత్ కుమార్ నుంచి 30 సెంట్ల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములు అమరావతి రాజధాని నగర ప్రాజెక్టు కోసం అవసరమైనవిగా గుంటూరు కలెక్టర్ గుర్తించారు. కలెక్టర్ జారీ చేసిన ఆర్ సి నెం: 01/2026/సిఆర్డీఏ (అడ్మిన్) మందడం-1 ప్రకారం, భూ సేకరణ, పునరావాస, పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత చట్టం (ఫారం 6ఎ) కింద ఈ ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ చట్టం రైతులకు సముచిత పరిహారం, పునరావాస సౌకర్యాలు, అభ్యంతరాలు వ్యక్తీకరించే అవకాశం కల్పిస్తుంది. అయితే ప్రక్రియలోని వేగం, సందర్భం వివాదాలకు దారితీస్తున్నాయి.
వివాదం బ్యాక్‌గ్రౌండ్
ఈ భూములు ఇటీవల క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్డీఏ) ద్వారా జీవీ ఎస్టేట్స్ అండ్ హోటల్స్ (GV Estates and Hotels). ప్రైవేట్ డెవలపర్‌కు భూమిని కేటాయించినట్లు ఏపీసీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. ఈ భూమి సీడ్ యాక్సెస్ రోడ్ (ఈ3) సమీపంలో ఉంది. అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ భూమిని ప్రభుత్వం గుర్తించింది. భూ సమీకరణ పథకంలో చేరని రైతుల భూములను స్వాధీనం చేసుకోవడంలో భాగంగా భూ సేకరణకు నిర్ణయం తీసుకున్నారు. రైతులు ఈ కేటాయింపును వ్యతిరేకిస్తూ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), వరల్డ్ బ్యాంక్‌లకు ఫిర్యాదు చేశారు. ఇందులో బలవంతపు భూ సమీకరణ, భయాందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల అనుమతి లేకుండా ఈ చర్య తీసుకోవడంతో వివాదం మొదలైంది. రైతులు తమ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. ముఖ్యంగా రైతులు భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం కింద తమ భూమిని అందించలేదు. దీంతో ప్రభుత్వం భూ సేకరణ మార్గాన్ని ఎంచుకుంది. ఈ ప్రత్యామ్నాయ విధానం రైతుల సమ్మతి లేకుండా భూమిని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే ఇది చట్టపరమైన, నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ప్రభుత్వ విధానాలు, రైతుల హక్కులు
అమరావతి ప్రాజెక్టు నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియలు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు, రైతుల జీవనోపాధి మధ్య సమతుల్యతను పరీక్షిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అమరావతిని ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు భూ సేకరణను అవసరమైన చర్యగా చూస్తోంది. భూ సమీకరణ పథకం విఫలమైన సందర్భాల్లో భూ సేకరణ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మరోవైపు రైతులు తమ భూమిని బలవంతంగా కోల్పోతున్నామని, పరిహారం, పునరావాస సౌకర్యాలు సరిపోవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో "అందితే జుట్టు, అందకుంటే కాళ్లు" అనే సామెతను గుర్తు చేస్తూ ప్రభుత్వ విధానాలలో లోపాలను సూచిస్తున్నాయి. ఎందుకంటే ఇది సమ్మతి ఆధారిత సమీకరణకు బదులు బలవంతపు సేకరణకు మార్గం సుగమం చేస్తుంది.
చట్టపరంగా భూ సేకరణ చట్టం రైతులకు అభ్యంతరాలు వ్యక్తీకరించే అవకాశం, న్యాయమైన పరిహారం అందించాలని నిర్దేశిస్తుంది. అయితే కోర్టు కేసు నడుస్తున్న సమయంలో నోటిఫికేషన్ జారీ చేయడం న్యాయస్థాన ప్రక్రియలకు అడ్డంకిగా మారవచ్చు. ఇలాంటి వివాదాలు అమరావతి ప్రాజెక్టులో సాధారణమవుతున్నాయి. ఇక్కడ రైతుల ఆందోళనలు ప్రభుత్వ విధానాలతో ఘర్షణ పడుతున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం భూ సేకరణ అవసరమే అయినప్పటికీ, పారదర్శకత, రైతుల సమ్మతి లేకుండా ముందుకు సాగడం దీర్ఘకాలిక సామాజిక ఉద్రిక్తతలకు దారితీయవచ్చు.
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూలింగ్ కింద భూములు ఇవ్వని రైతుల భూములు తీసుకునేందుకు భూ సేకరణ నోటీస్ ఇచ్చింది. మొత్తం 2,300 ఎకరాల భూమిని సుమారు 1,200 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇందులో రోడ్లు వేసే భూమి 325 ఎకరాల భూమికి మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ విషయంలో అప్పట్లో రైతులు కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ అక్విజిషన్ కింద భూములను 11 సంవత్సరాల తరువాత తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చినందున ఈలోపు వారికి జరిగిన నష్టం అందించాలని కోర్టు స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యాన్యుటీలు ఇవ్వలేక ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఉప సంహరించుకుందే తప్ప కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఆ రైతులకు పరిహారం ఇస్తేనే తిరిగి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే సీఆర్డీఏ కమిషనర్ ఇష్టానుసారం పనిచేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కమిషనర్ కన్నబాబుపై విచారించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇది రెండో నోటిఫికేషన్
ప్రస్తుతం పసుపులేటి జమలయ్య, కలపాల శరత్ కుమార్ ల భూమికి ల్యాండ్ అక్విజిషన్ నోటీఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఇద్దరు రైతుల భూములు ప్రభుత్వం తీసుకుని హోటల్ వారికి ఇవ్వనుంది.
వివాదాస్పద నోటిఫికేషన్
పసుపులేటి జమలయ్య, కలపాల శరత్ కుమార్ లకు చెందిన భూమి 70 సెంట్లు జీవీ ఎస్టేట్స్ అండ్ హోటల్స్ (GV Estates and Hotels)కు ఇంతకు ముందు సీఆర్డీఏ వారు రిజిష్టర్ చేశారు. రైతుల అనుమతి లేకుండా రిజిష్టర్ చేయడం ఒక తప్పయితే, ఇప్పుడు అదే భూమిని హోటల్ పేరుతో రిజిస్ట్రేషన్ ఉండగా అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి మరో తప్పు చేశారని ప్రముఖ న్యాయవాది మల్లెల శేషగిరి రావు పేర్కొన్నారు.
రైతుల హక్కులు గౌరవించరా?
ఈ వివాదం పరిష్కారం కోసం, ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరిపి, చట్టపరమైన ప్రక్రియలను పూర్తిగా పాటించాలి. అభ్యంతరాలు ముగిసిన తరువాత మాత్రమే స్వాధీనం చేసుకోవడం ద్వారా విశ్వాసాన్ని పునరుద్ధరించవచ్చు. రాజధాని అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే, రైతుల హక్కులను గౌరవించడం కీలకం. ఈ సంఘటన రాష్ట్రంలో భూ విధానాల పునర్విమర్శకు ఒక అవకాశంగా మారవచ్చు. అభివృద్ధి, న్యాయం మధ్య సమతుల్యత సాధించవచ్చు.

