
H-1B visa- అమెరికాలోని ఇండియన్ స్టూడెంట్స్ కి, ఉద్యోగులకి ఊరట
ఇండియా నుంచి హెచ్ 1బీకి దరఖాస్తు చేస్తే లక్ష డాలర్లు కట్టాల్సిందే
అమెరికా స్టూడెంట్ వీసా, హెచ్ 1 బీ వీసా ఫీజులపై ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాస్తంత కనికరించినట్టు చూపారు. హెచ్-1బీ వీసా ఫీజు విషయంపై స్పష్టత ఇచ్చారు. అమెరికాలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు, హెచ్ 1 బీ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారికి లక్ష డాలర్ల ఫీజు నిబంధన వర్తించదని ప్రకటించారు. వీసా ఫీజు చెల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం, వలస సేవల సర్వీస్ (USCIS) కీలక ప్రకటన చేసింది. హెచ్1బీ వీసా (H-1B Visa) కోసం పెంచిన లక్ష డాలర్ల ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేసింది.
దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలు తమ పిల్లలు అమెరికా విశ్వవిద్యాలయంలో డిగ్రీ సాధించాలని కలలు కనేవి. దానికోసం ఏళ్ల తరబడి రూపాయి రూపాయి కూడబెట్టి వెచ్చించేవి. కొన్ని సందర్భాలలో అప్పులూ చేసేవి. ఆ ఖర్చును “భవిష్యత్తుకు పెట్టుబడి”గా భావించేవారు. అయితే ఇప్పుడు ఆ నమ్మకానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల పెద్ద షాక్ వచ్చింది.
H-1B వర్క్ వీసాలకు $100,000 ఫీజు, విదేశీ విద్యార్థులపై కఠిన పర్యవేక్షణ, ఇమిగ్రేషన్‌పై దాడులు వంటివి విద్యార్థులను, వారి కుటుంబాలను ఆలోచనలో పడేశాయి. అవి ఎంతగా అంటే ఇక “అమెరికా వెళ్ళను..” అనేంతగా భయపెట్టాయి. 2025 జూలై–ఆగస్టులో విద్యార్థి వీసాలతో అమెరికాకు వెళ్లిన భారతీయుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 45% తగ్గింది. ఇప్పుడు అమెరికా మాత్రమే కాదు, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వైపు విద్యార్థులు చూస్తున్నారు. కొందరు భారత విశ్వవిద్యాలయాలే మంచివన్న ఆలోచనలో పడ్డారు.
H-1B వీసా ఫీజు $100,000గా నిర్ణయించడం పెద్ద కలకలం రేపింది. భారత విద్యార్థుల్లో చాలామంది STEM (Science, Tech, Engineering, Math) కోర్సుల్లో ఉన్నా భవిష్యత్తుపై భయపడుతున్నారు.
వీసా ఫీజు పెంపుపై యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్టులో సవాలు చేసింది. “ఈ వీసా ఫీజు చట్టవిరుద్ధం, కంపెనీలను అధిక ఖర్చు లేక ఉద్యోగాల కోత మధ్య ఎంచుకునే స్థితికి నెడుతుంది” అని వాదించింది. భారతదేశంలోని నాస్కామ్ కూడా హెచ్చరించింది. “ఈ నిర్ణయం అమెరికా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, ఉద్యోగ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.” అని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో యూఎస్‌సీఐఎస్ ప్రకటన కాస్తంత ఊరటనే చెప్పాలి. అమెరికాలో చదువుకొని, ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Next Story