
వారు తప్పు చేస్తే మీరే బాధ్యులు
గతంలో కూడా ఇదే రకమైన ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యేలు, మరి కొంత మంది నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఆ బాధ్యత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులపైనే పడుతుందని స్పష్టం చేస్తూ, వారిని కట్టుబాటుల్లోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ, ప్రభుత్వ ఇమేజ్‌కు దెబ్బ తగలకుండా ఎమ్మెల్యేల తీరును నివారించాలని హెచ్చరించారు.
మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో చర్చలు జరిపిన సందర్భంగా చంద్రబాబు... ఎమ్మెల్యేల చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి హాని కలిగిస్తున్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ప్రశ్నిస్తూ, ఇన్‌చార్జ్ మంత్రులు తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలను వెంటనే పిలిచి హెచ్చరించాలని, కౌన్సెలింగ్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తనలు సహించేది లేదని, చట్టవిరుద్ధ చర్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గతంలోను ఇలాంటి ఆదేశాలే సీఎం చంద్రబాబు జారీ చేశారు. ఆగస్టు 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుచిత చర్యలు, పెరోల్ సిఫార్సులు, ఇతర వివాదాల్లో చిక్కుకున్న సంఘటనలు ఈ చర్చకు దారితీశాయి. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. గుంటూరు ఈస్ట్, అనంతపురం అర్బన్, అమదలవాలస, శ్రీశైలం, నెల్లూరు రూరల్, గూడూరు మొదలైన నియోజకవర్గాల ఎమ్మెల్యేల విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
ఇక, అక్టోబర్ 3న జరిగిన మరో సమావేశంలో కూడా చంద్రబాబు ఈ అంశాన్ని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలు, ప్రవర్తనలపై ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, క్రమశిక్షణ కాపాడాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోతే ప్రభుత్వ పనులకు ఆటంకం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తెదేపా, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలపై కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు.

