ఆర్‌వో సంతకం ఉంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కించాల్సిందే
ఫారం నెం:13ఎలో అధికారి సంతకం చూసి ఆర్‌వో పోస్టల్ బ్యాలెట్‌ను ఓటరుకు ఇచ్చారు. దీంతో ఆ ఓటు తప్పకుండా చెల్లుతుందని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే ఉద్యోగులు, దివ్యాంగులు, వృద్ధులు (85) ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. సంబంధిత అధికారి ఉద్యోగికి ఫారం నెం13ఎ ఇచ్చి దానిపై సంతకం చేసి ఉంటే ఆ ఓటు చెల్లుతుందని, ఆ ఫారంపై స్టాంప్, అధికారి పేరు లేకపోయినా పరవాలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ ఓటింగ్ పూర్తయిన తరువాత ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ప్రకటించారు. అయితే అధికారి ముద్ర లేకుండా ఇచ్చిన ఫారం నెంబరు 13ఎ చెల్లదని వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రదాన అధికారి మొదట ఇచ్చిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే గురువారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు స్టాంప్ లేకపోయినా ఆర్‌వో సంతకం చేసి ఉంటే ఓటును లెక్కించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. రాష్ట్రంలో మొత్తం 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా అందులో 4, 97, 620 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.