
మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లి, దండ్రులకూ శిక్ష తప్పదు
మైనర్లు డ్రైవింగ్ చేయకూడదని మోటారు వాహనాల చట్టం చెబుతోంది.
మైనర్లు అంటే 18 ఏళ్ళలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, మైనర్లు డ్రైవింగ్ చేయకూడదని మోటారు వాహనాల చట్టం చెబుతోంది. అయితే చట్టాన్ని మనదేశంలో ఎంతమంది పట్టించుకుంటారు ? అందుకనే యధేచ్చగా పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా బండ్లు డ్రైవ్ చేసేస్తుంటారు. అందుకనే కేంద్రప్రభుత్వం మోటారువాహనాల చట్టాన్ని చాలాకాలం క్రితమే కఠినతరంచేసింది. అయినాసరే పిల్లలూ వినటంలేదు, తల్లి, దండ్రులూ పట్టించుకోవటంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణలో మోటారువాహన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే వాహనాలు నడుపుతున్న మైనర్లు 2100 మందిని పట్టుకున్నారు. వాహనాలు డ్రైవ్ చేస్తు పట్టుబడిన కారణంగా వాళ్ళ తల్లి, దండ్రులకు కూడా పెద్ద శిక్షలు పడ్డాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే మైనర్ డ్రైవింగ్ ను కంట్రోల్ చేయటంకోసమే రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన డ్రైవ్ మొదలుపెట్టారు ఏప్రిల్ 5వ తేదీన. ఈనెల 3వ తేదీవరకు జరిగిన స్పెషల్ డ్రైవ్ లో 2100 మైనర్లతో పాటు వాళ్ళ తల్లి, దండ్రుల మీద కూడా కేసులు బుక్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేంద్రం కఠినతరంచేసిన మోటారువాహనాల చట్టం ప్రకారం వాహనాలు డ్రైవ్ చేస్తు మైనర్లు దొరికితే వాళ్ళతో పాటు వాళ్ళ తల్లి, దండ్రులపైన కూడా కేసులు నమోదుచేసి జైళ్ళకు పంపుతారు. ఈవిషయాన్ని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు చాలాకాలంగా ప్రచారంచేస్తున్నాయి. అయినా మైనర్లే కాదు వాళ్ళ తల్లి, దండ్రులు కూడా లెక్కచేయటంలేదు.
అందుకనే మైనర్ డ్రైవింగ్ ను కంట్రోల్ చేయటంలో భాగంగానే సంబంధిత అధికారులు కొరడాఝుళిపించారు. పట్టుబడిన మైనర్లతో పాటు వాళ్ళ తల్లి, దండ్రులను కూడా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్(టీటీఐ)కి అధికారులు పిలిపించారు. అక్కడ మైనర్లతో పాటు తల్లి, దండ్రులకు ట్రాఫిక్ చట్టంపైన, ఉల్లంఘిస్తే పడే జరిమానాలు, శిక్షలపైన హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డేవిస్ ఫుల్లుగా క్లాసులు తీసుకున్నారు. క్లాసులు పూర్తయిన తర్వాత మైనర్లు, తల్లి, దండ్రుల మీద కేసులు నమోదుచేసి అందరినీ కోర్టులో ప్రవేశపెట్టారు.
వీళ్ళందరినీ విచారించిన కోర్టు మైనర్లకు సామాజిక సేవను శిక్షగా విధించి, వాళ్ళ, తల్లి, దండ్రులకు భారీ జరిమానాలు విధించారు. మోటారువాహనాల చట్టం ప్రకారం వాహనాలు డ్రైవ్ చేసిన మైనర్ల తల్లి, దండ్రులకు మూడేళ్ళు శిక్షపడే అవకాశముంది. అలాగే మైనారిటి తీరకుండానే వాహనాలు నడుపుతు పట్టుబడిన పిల్లలకు మైనారిటి తీరిన తర్వాత 7 ఏళ్ళ వరకు లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవ్వకుండా ఆర్టీఏ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మామూలుగా అయితే 18 ఏళ్ళు నిండిన వారికి ముందు లెర్నింగ్ లైసెన్స్ మూడు మాసాల తర్వాత టెస్ట్ లో పాసైతే పూర్తిస్ధాయి డ్రైవింగ్ లైసెన్స్ ఇఛ్చేస్తారు. మైనర్ డ్రైవింగ్ లో పట్టుబడిన వారికి మాత్రం ఏడేళ్ళ గ్యాప్ అంటే 25 ఏళ్ళు నిండేవరకు లెర్నింగ్ లేదా పూర్తిస్ధాయి డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వటంలేదు. ఇప్పటికైనా మైనర్ల డ్రైవింగ్ కారణంగా ఏమవుతుందో తల్లి, దండ్రులు తెలుసుకుంటే మంచింది.