కూటమి అధికారంలోకి వస్తే వారికి గడ్డుకాలమేనా?
x

కూటమి అధికారంలోకి వస్తే వారికి గడ్డుకాలమేనా?

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తారా? మారుస్తారా?


ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలక అంశాలుగా మారిన వాటిల్లో వలంటీర్ల వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ చుట్టూ కొన్ని నెలలు రాజకీయాలు తిరిగాయి. అధికార పక్షమైన వైఎస్‌ఆర్‌సీపీ వీరికి అనుకూలంగాను, తెలుగుదేశం, జనసేనలు ఈ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలుగా ఉపయోగించుకోవడానికి తాము వ్యతిరేకమనే బహిరంగంగానే వ్యాఖలు చేశారు. ఎన్నికల సమయంలో వీరిని విధుల నుంచి పక్కన పెట్టాలనే వాదోప వాదాలు కోర్టుల వరకు చేరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో వలంటీర్లలను దూరం పెట్టాలని కొంత మంది ఎన్నికల సంఘంతో పాటు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో వారిని ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు దూరం పెట్టాలనే నిర్ణయాన్ని వెల్లడించింది.

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తెరపైకి తెచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.75లక్షల మంది వలంటీర్లను ఏర్పాటు చేసింది. వీరికి నెలకు రూ. 5వేలు చొప్పున గౌరవ వేతనంగా చెల్లించాలని నిర్ణయించింది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే దీనిని తెరపైకి తెచ్చింది. నాటి నుంచి ఎన్నికల ముందు వరకు వీరు సేవలు అందిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల సమీపించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థ కాస్తా వివాదస్పద అంశంగా మారింది. వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ద్వారా గౌరవ వేతనం తీసుకునే వలంటీర్లు సంక్షేమ పథకాల పంపిణీ సమయాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాల పంపిణీలో దూరంగా ఉండాలని ఆదేశించింది. దీంతో పాటుగా వలంటీర్ల ఫోన్లు, ట్యాబులు, ఇతర పరికరాలను కూడా ఇచ్చేయాలని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నంత వరకు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.
ఒక వేళ కూటమి గెలిచి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా, తొలి నుంచి వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించానే కోపంతో రద్దు చేస్తారా అనేది తాజాగా అటు రాజకీయ వర్గాలు, ఇటు వలంటీర్లలోను చర్చగా మారింది. తాము వలంటీర్లకు, ఆ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికిచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచుతామని, రూ. 5వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామని ప్రతిపక్ష నేతలు, చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారంలో హామీలిచ్చారు. ఇది కొంత వరకు వలంటీర్లను సానుకూల పరిచినా.. చంద్రబాబు కొనసాగిస్తారనే నమ్మకం సన్నగిల్లిందనే ఆందోళనలు వారి మనసుల్లో నెలకొన్నాయనే చర్చ ఉంది.
ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో కొంత మంది వలంటీర్ల వ్యవహారంపైన విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వలంటీర్లు మాకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు. సుమారు 65వే మంది వరకు రాజీనామాలు చేశారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు దాదాపు 929 మంది వలంటీర్లను తొలగించారు. అయితే వలంటీర్ల రాజీనామాల వెనుక వైఎస్‌ఆర్‌సీపీ నేతల ప్రోద్బలం ఉందనే విమర్శలు వినిపించాయి. కావాలనే వారి చేత రాజీనామాలు చేయించి తమకు అనుకూలంగా పని చేయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా రాజీనామాలు చేసిన వలంటీర్లు అధికార పక్షమైన వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రూ. 10 నుంచి రూ. 30వేల వరకు తీసుకొని స్థానిక అధికార పక్ష నేతల కనుసన్నుల్లో ఎన్నికల సమయంలో పని చేశారనే విమర్శలు కొంత మంది వలంటీర్లపైన ఉన్నాయి. అలా చేయించే వాతావరణాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు క్రియేట్‌ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే ఇలాంటి వారందరికీ కష్టమనే స్థానికుల్లో టాక్‌ నడుస్తోంది. ఎక్కడక్కడైతే అధికార పక్షానికి అనుకూలంగా పని చేశారో అలాంటి వలంటర్లీను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని చర్చ ఆ పార్టీలో వినిపిస్తోంది. ఒక వేళ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇప్పటి వరకు అధికార పక్షమైన వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారికి బదులుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వారికి ప్రాధాన్యత ఇచ్చి వలంటీర్లుగా తీసుకునే అవకాశం ఉందనే టాక్‌ కూడా ఆ పార్టీలో ఉంది.
Read More
Next Story