
అధికారం టీడీపీ దగ్గరుంటే..జనం జగన్ దగ్గరున్నారు
రాజకీయాల్లో డ్రామాలు, నాటకాలు సీఎం చంద్రబాబుకే చెల్లు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.
అధికారం టీడీపీ వద్ద ఉంటే, జనం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాప్తాడులో హత్యకు గురైన వైసీపీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే జగన్ మీద విమర్శలు ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో డ్రామాలు, నాటకాలు ఆడాలంటే చంద్రబాబు నాయుడికి మించిన వారు లేరని, చంద్రబాబు సంస్కారం ఏంటో అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసన్నారు.
జగన్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ప్రయాణించిన హెలికాప్టర్ మీదకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలే ప్రజలను పంపారని మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఇవేం మాటలు అంటూ ప్రశ్నించారు. హెలికాప్టర్ వద్దకు ప్రజలు వెళ్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మామ ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచి, క్యాంపులు పెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, కానీ తమ నాయకుడు వైఎస్ జగన్ అలా కాదని, జగన్ అభిమన్యుడు కాదని, అర్జునుడు వంటి నాయకుడని, చంద్రబాబు కుట్రలను తీచ్చి చెండాడుతాడని మాట్లాడారు.