
ఈ దొంగ పోలీసుల నుంచి ఎలా పరార్ అయ్యాడో తెలిస్తే...!
అంతర్ రాష్ట్ర నేరస్తుడు. 80 కేసుల్లో నిందితుడి పట్ల పోలీసుల తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బత్తుల ప్రభాకర్, అలియాస్ కృష్ణయ్య, బిట్టు, రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వడ్డపల్లి గ్రామానికి చెందిన 35 ఏళ్ల నేరస్థుడు. అతడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 80 దొంగతనాలు, దోపిడీల కేసుల్లో నిందితుడు. ఇంజినీరింగ్ కాలేజీలు, హాస్పిటళ్లను టార్గెట్ చేసి దోపిడీలు చేసేవాడు. పొరుగు రాష్ట్రాల్లో ఆయుధాల స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి.
అరెస్టు వివరాలు
2025 మార్చిలో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ (ఎన్టీఆర్ కమిషనరేట్)లో రిజిస్టర్ అయిన దోపిడీ కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లోని ప్రిజమ్ పబ్ కాల్పుల కేసులో కీలక వ్యక్తి. 2025 ఫిబ్రవరిలో హైదరాబాద్ గచిబౌలి పబ్‌లో పోలీసులపై దేశీ పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని గాయపరిచాడు. అప్పుడు అతని నుంచి బీహార్ లో కొనుగోలు చేసిన రెండు దేశీ తుపాకులు, 23 బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేశారు. చేసుకున్నారు.
2022లో విశాఖపట్నం పోలీసులు దొంగతనం కేసులో అరెస్టు చేసినప్పుడు కూడా కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా పారిపోయాడు.
పారిపోయిన ఘటన
2025 సెప్టెంబరు 23 సోమవారం రాత్రి మరో సారి తప్పించుకుని పారిపోయాడు. విజయవాడ కోర్టులో హాజరు పరిచిన తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తిరిగి తరలిస్తుండగా, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద పోలీసులు అల్పాహారం తీసుకోవడం కోసం ఆగారు. మూత్ర విసర్జన చేయాలని చెప్పి సంకెళ్లు తీసేయించుకుని పొలాల్లోకి పారిపోయాడు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు. ప్రభాకర్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు, రూ. 50,000 నగదు బహుమతి ప్రకటించారు.
అతడి ఆచూకీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నారు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, హైవేలపై నిఘా పెంచారు.
విచిత్రం ఏమిటో తెలుసా?
ఈ నిందితుడిని కోర్టుకు తీసుకెళ్లి తీసుకురావడానికి పోలీస్ అధికారులు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ను పంపించారు. తప్పించుకుని నిందితుడు పరారైన తరువాత అతనని వెతకటానికి పది మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్లతో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదండీ ఏపీ పోలీస్ పనితీరు.
నిందితుడు పారిపోయేటప్పుడు పోలీసుల చేతిలో ఉండాల్సిన తుపాకీలు కారులో ఉన్నాయి. టిఫిన్ చేద్దామని వెళుతున్న పోలీసుల చెవుల్లో సెల్ ఫోన్ లు ఉన్నాయి. ఇంకేముంది నిందితునికి మంచి అవకాశం లభించింది. పైగా యువకుడు కావడంతో వాడు తీసిన పరుగు రెప్పపాటులో మాయమయ్యాడని ఆ హోటల్ లోని వారు చెబుతుంటే ఆశ్చర్య పడాల్సిందే. హోం మంత్రిత్వ శాఖ మన పోలీసులకు మంచి శిక్షణ ఇస్తోందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.