
జగన్ పునాది వేస్తే, చంద్రబాబు అమ్మేస్తున్నాడా?
ఆంధ్రాలో రగిలిన మెడికల్ కాలేజీల చిచ్చు, నిజానిజాలేమిటీ?
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై వివాదం రాజుకుంది. టీడీపీ, వైసీపీలు తమ విధానం రైటంటే తమది రైటంటూ తారసిల్లాయి. పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నాయి.

వైద్య విద్యను పేదల పరం చేసేందుకు తాము ప్రయత్నం చేస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని కుట్ర పన్నుతోందని వైసీపీ ఆరోపించింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని వైఎస్ జగన్ చేసిన తప్పుల్ని సరిదిద్ది వైద్య విద్యను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని టీడీపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తమ ప్రభుత్వం వస్తే టీడీపీ పిలిచిన టెండర్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ తరహా బెదిరింపులు మానుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
అసలింతకీ ఏమిటీ వివాదం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే ఉద్దేశంతో 17 కొత్త కాలేజీల పనులు ప్రారంభించారు. ఇందుకు సుమారు ₹8,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ (Public Private Partnership) మోడల్‌లోకి మళ్లిస్తామని ప్రకటించింది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.
రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలకు టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు ప్రారంభించాలని పేర్కొంది. మిగిలిన పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలలపై త్వరలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీపీపీ విధానాన్ని అనుసరించడం ద్వారా నిధుల సమీకరణ వేగంగా జరిగి, ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
GO 107, GO 108 ఆదేశాల ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల సంఖ్యను పెంచి, MBBS విద్యార్థులకు సంవత్సర ఫీజు “రూ.12 లక్షల నుండి రూ. 20 లక్షల”కు పెంచారు. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్య విద్య ఖర్చు దాదాపు రూ. 1 కోటికి చేరుతుందని రిటైర్డ్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ పి. రామారావు అన్నారు. సగటున రూ. 500 కోట్లతో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 17 కొత్త వైద్య కళాశాలల్లో 10 కాలేజీలను 66 సంవత్సరాల పాటు నామమాత్ర ఫీజుకు ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలని ప్రతిపాదించారని చెప్పారు.
వైసీపీ వాదన ఇలా...
చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని వైసీపీ తోసిపుచ్చింది. “మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లు రద్దు చేస్తాం. మళ్లీ ప్రభుత్వ పరం చేస్తాం” అన్నారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్. "మెడికల్ కాలేజీలు పేదల కోసం మాత్రమే తలపెట్టాం. వాటిని కార్పొరేట్లకు అప్పగించడం అన్యాయం. వైసీపీ ప్రభుత్వం కాలంలో 17 కాలేజీల నిర్మాణం ప్రారంభమైంది. దీనివల్ల 4,500కి పైగా కొత్త సీట్లు వస్తాయని, ఇది “ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్” తయారు చేయాలన్న లక్ష్యానికి అనుగుణం" అని జగన్ చెప్పారు.
ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నిర్మాణాలను కార్పొరేట్లకు అప్పగించడం రాష్ట్ర ఆస్తుల దోపిడీ అని వైసీపీ అభిప్రాయపడింది. ఆ పార్టీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్ ఓ అడుగు ముందుకేసి – “ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి, అవి మీ (చంద్రబాబు) అబ్బ జాగీరు కాదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
టీడీపీ ఏమంటోందంటే...
వైసీపీ వాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు. “ప్రాజెక్టులు ఆగిపోకుండా పూర్తి చేయాలంటే పీపీపీ మోడల్ తప్ప వేరే మార్గం లేదు” అన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రారంభించిన పనులు సగం దాటక ముందే నిలిచిపోయాయని, వాస్తవానికి ఆర్థిక లోటు కారణంగా రాష్ట్రం ఒక్కదానితో ఇన్ని కాలేజీలను పూర్తి చేయలేదని అన్నారు.
“మేము ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకొచ్చినా, పేదలకు అన్యాయం జరగదు. ప్రభుత్వ కోటా సీట్లు అలాగే ఉంటాయి. కాలేజీలు పేపర్ మీద కాకుండా నిజంగానే పూర్తి అవుతాయి” అని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా ప్రైవేట్ రంగం సహకారం తప్పనిసరి. వైసీపీ ప్రారంభించిన కాలేజీల పనులు పూర్తి కాలేదు. ప్రజలకు మేలు జరగాలంటే ప్రాజెక్టులు వేగంగా పూర్తికావాలి. పీపీపీ మోడల్‌లోనూ ప్రభుత్వ కోటా సీట్లు పేదలకే ఉంటాయి, ఉచిత వైద్య సదుపాయాలు కొనసాగుతాయి. వైసీపీ పాలనలో డబ్బులు వృథా అయ్యాయని ఆరోపించారు సీఎం చంద్రబాబు.
పేదలకు వైద్య విద్య చేరువ అవుతుందా?
ఆరోగ్య కార్యకర్తలు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలు, వైద్య నిపుణులు, వామపక్ష పార్టీలు- ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. PPP మోడల్ రాష్ట్రంలో ఆరోగ్య సేవలు, వైద్య విద్యకు గట్టి దెబ్బని హెచ్చరిస్తున్నాయి. PPP విధానంలో, ప్రభుత్వం 80% వ్యయాన్ని (రాష్ట్ర, కేంద్ర నిధుల ద్వారా) భరిస్తుంది, ప్రైవేట్ ఆపరేటర్ కేవలం 20% మాత్రమే ‘కంట్రిబ్యూట్ చేస్తారు. అది కూడా ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి సమకూర్చుకోవచ్చు. ఈ ఆర్థిక భారం విద్యార్థులు, రోగులపై పడుతుంది. పీపీపీ విధానం వల్ల ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేస్తుందని, మెరిట్ ఆధారిత ప్రవేశాలను బలహీనపరుస్తుందని, రిజర్వేషన్ సీట్లను తగ్గిస్తుందని, ప్రజా జవాబుదారీతనాన్ని క్షీణింపజేస్తుందని వాదిస్తున్నారు. పాఠ్యాంశాలు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య సేవల ప్రాధాన్యతలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని, ప్రజారోగ్య సేవ స్థానంలో ప్రయివేటు యాజమాన్యాల లాభాపేక్ష ఆధిపత్యం చెలాయిస్తుందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త మెడికల్ కాలేజీలలో సీట్ల వర్గీకరణ ఇలా...
• 50% సీట్లు → ‘General Category (Competent Authority)’
• 35% సీట్లు → ‘Self-Financing Category’
• 15% సీట్లు → ‘NRI Category’
Self-Financing, NRI కోటాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. రిజర్వేషన్ విధానం General Category సీట్లకు మాత్రమే వర్తించబోతుంది. ఈ పరిస్థితులను బట్టి ఫీజులు భారం అవుతాయనే వాదన ఉంది.

పీపీపీ మోడల్‌లో ప్రైవేట్ రంగం ప్రమేయం పెరగడం వల్ల సేవల ఖర్చు పెరగవచ్చు. ఈ నిర్ణయం మున్ముందు కీలక చర్చనీయాంశంగా మారనుంది. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమని వైసీపీ ప్రచారం చేస్తుండగా, టీడీపీ “ప్రాజెక్టులను పూర్తి చేయగల సామర్థ్యం మాకే ఉంది” అని చెబుతోంది.
మెడికల్ కాలేజీల వివాదం కేవలం నిర్మాణం గురించే కాదు, “పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు ఎంతవరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి? ఎంతవరకు కార్పొరేట్లకు వదలాలి?” అన్న మౌలిక ప్రశ్నను లేవనెత్తుతోంది. ఈ వివాదం ఫలితమే కాకుండా, దాని పరిష్కారం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ వైద్య విధానం, ప్రజా ఆరోగ్య దిశను నిర్ణయించనుంది.
Next Story