
ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా
ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలను వదిలేస్తా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం పరిధిలోని ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు గురువారం ఆయన పర్యటనకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం కాకినాడ కలెక్టరేట్‌లో ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు, అధికారులతో సమావేశమైనారు. ఇటీవల ఉప్పాడలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనలకు స్పందిస్తూ, ఇచ్చిన హామీ మేరకు ఆయన కాకినాడకు చేరుకున్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల తీరప్రాంత మత్స్య సంపద నష్టపోతున్న సమస్యలపై వివరంగా చర్చించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు, సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, కాలుష్య నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రి స్పష్టమైన హామీలు ఇచ్చారు.
ఉప్పాడ తీరప్రాంతంలో 7 వేలకు పైగా కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి ఉన్నాయి. వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్యకారుడికి ఏటా రూ.20 వేల సహాయం అందిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే, సమీప పరిశ్రమలు (ముఖ్యంగా ఫార్మా యూనిట్లు) వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతోందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇటీవల 18 మత్స్యకారుల మరణాలకు, బోట్లకు సంబంధించిన బీమా, పరిహారాలు వంటి పలు అంశాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించారు.
అధికారులతో ఈ నెల 14న సమావేశం నిర్వహించి, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రూ.323 కోట్లతో ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఉప్పాడ-కొణపాక మధ్య తీరరక్షణ పనులు ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. పరిశ్రమల వ్యర్థాల శుద్ధీకరణపై మూడు విడతల్లో పరిశీలిస్తామని, మత్స్యకారులు ఎక్కడికైనా సమస్య చెబితే మూడు రోజుల్లో చేరుకుంటానని హామీ ఇచ్చారు. "వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో అక్కడికే బోటులో వెళ్లి పరిశీలిస్తాను. ప్రజలను వంచించాలని నాకు ఎప్పుడూ ఉండదు. ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తాను" అని ఆయన స్పష్టం చేశారు.