Telephone Tapping|ఇపుడు అడ్డుకోకపోతే ప్రభాకరరావును ఇండియాకు రప్పించలేరా ?
x

Telephone Tapping|ఇపుడు అడ్డుకోకపోతే ప్రభాకరరావును ఇండియాకు రప్పించలేరా ?

టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో కీలకపాత్రదారి ప్రభాకరరావు(Prabhakar Rao) రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.


ఇపుడిదే అంశం తెలంగాణాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో కీలకపాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీ ప్రభాకరరావు(Prabhakar Rao) తనను రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఏర్పడగానే వెలుగుచూసిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశం ఎంతటి సంచలమైందో అందరికీ తెలిసిందే. ట్యాపింగ్ అంశంలో మొదటికేసు నమోదు కాగానే మార్చిలో కీలకపాత్రదారి టీ ప్రభాకరరావు అమెరికా(America)కు పారిపోయారు. అప్పుడు అమెరికాకు వెళ్ళిపోయిన ప్రభాకర్ మళ్ళీ ఇండియాకు తిరిగిరాలేదు. ఇంతకీ ప్రభాకర్ ఎవరంటే బీఆర్ఎస్(BRS Government) హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ఈయన ఆదేశాల ప్రకారమే తాము వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అరెస్టయి రిమాండులో ఉన్న అనేకమంది పోలీసు అధికారులు అంగీకరించారు.

తాము ఫోన్ ట్యాపింగుకు పాల్పడ్డామని అంగీకరించిన అధికారులందరు ఏకవాక్యంగా చెప్పింది ఏమిటంటే తమకు అందరికీ ఆదేశాలిచ్చి ట్యాపింగ్ చేయించింది ప్రభాకరరావే అని. వీళ్ళకు ఆదేశాలిచ్చి ట్యాపింగ్ చేయించింది ప్రభాకరరావు సరే, మరి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫుకు ఆదేశాలిచ్చి ట్యాపింగ్ చేయించింది ఎవరు ? ఈ విషయం బయటపడాలంటే ప్రభాకరరావు ఇండియాకు రావాలి, ట్యాపింగ్ ఆరోపణలను విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ముందు విచారణకు హాజరవ్వాలి. ప్రభాకరరావు విచారణకు హాజరైతే తెలంగాణా రాజకీయాల్లో ఎన్ని సంచలనాలు రేగుతాయో ఎవరి ఊహకు అందటంలేదు. అందుకే అందరు ట్యాపింగ్ దర్యాప్తును ఆసక్తిగా ఫాలో అవుతున్నది.

ఇపుడు అసలు విషయానికి వస్తే ప్రభాకరరావు అమెరికా నుండి రానని భీష్మించుకుని కూర్చున్నారు. ముందేమో బీపీకి వైద్యం చేయించుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత క్యాన్సర్ కు వైద్యం చేయించుకుంటున్నట్లు చెప్పారు. ఆ తర్వాత గ్రీన్ కార్డు హోల్డర్ అయిపోయారు. ఇపుడేమో అమెరికాలో రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్ గా ప్రభాకర్ ను ఇండియాకు రప్పించాలంటేనే బోలెడంత తతంగం ఉంటుంది. ఈ విషయంలో సిట్ అధికారులు సీబీఐ(CBI) ఉన్నతాధికారుల సహాయం తీసుకున్నారు. సీబీఐ ఉన్నతాధికారులేమో అమెరికాలోని ఇంటర్ పోల్(Interpol) అధికారుల సాయాన్ని కోరారు. గ్రీన్ కార్డు హోల్డరైన ప్రభాకర్ ను ఇండియాకు తరలించటం చాలా కష్టమని ఇంటర్ పోల్ అధికారులు చెప్పేశారు. ప్రభాకర్ ను అమెరికా నుండి బయటకు పంపాలంటే అక్కడి కోర్టుల అనుమతి తీసుకోవాల్సుంటుంది. కోర్టులో అంశాలు అంత తొందరగా తేలేవి కావు.

ఈ నేపధ్యంలో రాజకీయ శరణార్ధి గుర్తింపుకు ప్రభాకరరావు దరఖాస్తు పెట్టుకోవటం తెలంగాణా ప్రభుత్వానికి పెద్ద షాకనే చెప్పాలి. ఒకవేళ అమెరికా ప్రభుత్వం గనుక ప్రభాకరరావుకు రాజకీయ శరణార్ధి గుర్తింపును ఇస్తే ఇక మాజీ చీఫ్ ఇండియాకు రావటం చాలా చాలా కష్టమనే అనుకోవాలి. తనను తెలంగాణా ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తోంది కాబట్టి తనను రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని ప్రభాకరరావు పెట్టుకున్న దరఖాస్తు అమెరికా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఈ సమయంలో దరఖాస్తును అడ్డుకోకపోతే మాజీ చీఫ్ ను రాజకీయ శరణార్ధిగా అమెరికా ప్రభుత్వం గుర్తించే అవకాశముంది.

అదే జరిగితే ఇక ప్రభాకర్ అమెరికా నుండి ఇండియాకు రారని అర్ధమైపోతోంది. ఎవరో చాలా బలమైన వ్యక్తే అమెరికాలో ప్రభాకరరావుకు సాయం చేస్తున్నారు. ఆ బలమైన వ్యక్తి ఎవరో గుర్తించి అడ్డుకోకపోతే ప్రభాకర్ శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోతారు. అదే జరిగితే టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ముందుకు జరగదు. దర్యాప్తు ముందుకు జరగకపోతే ట్యాపింగ్ లో అసలు సూత్రదారు ఎవరనే విషయం ఎప్పటికీ ఆధారాలతో సహా బయటపడదు. మంత్రుల ఆరోపణల ప్రకారం ట్యాపింగ్ అసలు సూత్రదారులు కేసీఆర్(KCR), కేటీఆరే(KTR). కాని ఆరోపణలు కాకుండా ఆధారాలుంటేనే ఎవరిపైన అయినా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకపోతే ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు.

Read More
Next Story