ఇళ్లు లేని పేదలను 15 రోజుల్లో గుర్తించండి
x

ఇళ్లు లేని పేదలను 15 రోజుల్లో గుర్తించండి

వచ్చే ఏడాది మార్చి కల్లా 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.


రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలను 15 రోజుల్లో గుర్తించాలని, ఆ మేరకు సర్వేను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంక్రాంతి కల్లా మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు. పెద్ద కుటుంబాలకు ఉమ్మడి ఇళ్లు నిర్మించే యోచన చేయాలన్నారు. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు ఇవ్వాలని చెప్పారు.

పీఎంఏవై(అర్బన్‌)బీఎల్సీ, పీఎంఏవై (గ్రామీణ్‌), పీఎం జన్మాన్‌ కింద మొత్తం 18,59,504 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో ఇప్పటికి 9,51,351 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది కాలంలోనే 2.81 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వచ్చే నెలలో ఇంకో 19 వేల ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2,013.50 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిన మొత్తం 4,305 లేఅవుట్లలో... రహదారులు, డ్రైనేజీల వంటి మౌలిక వసతుల కోసం రూ.3,296.58 కోట్ల వ్యయం కానుంది. కుప్పం నియోజకవర్గంలో 4,647 మంది గృహ నిర్మాణ లబ్దిదారులకు రూ.16.37 కోట్లు చెల్లించగా, రాష్ట్రంలోని 2,73,709 మంది లబ్దిదారులకు రూ.919.29 కోట్లు త్వరలో చెల్లించనుంది. పీఎం జన్మాన్‌ కింద నిర్మించిన 15,753 ఇళ్లకు రూ.100 కోట్లు, పీఎంఏవై గ్రామీణ్‌ కింద నిర్మించిన 15,582 ఇళ్లకు రూ.75 కోట్ల నిధులు మంజూరు చేయనుంది. మరోవైపు పీఎంఏవై అర్బన్‌ కింద ఇళ్లు మంజూరైనప్పటికీ 1,84,510 మంది లబ్దిదారులు ఇంకా గృహ నిర్మాణం చేపట్టలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
2018లో 104 పట్టణ స్థానిక సంస్థల్లో 4,54,706 టిడ్కో ఇళ్లకు టెండర్లు పిలవగా, వీటిలో ప్రస్తుతం 1,77,546 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో 300 చ.అ. విస్తీర్ణం కలిగిన 45,848 ఇళ్లు, 365 చ.అ. విస్తీర్ణం ఉన్న 12,550 ఇళ్లు, 430 చ.అ. విస్తీర్ణం ఉన్న 25,172 ఇళ్లు... మొత్తం 83,570 ఇళ్లను లబ్దిదారులకు ప్రభుత్వం అందించింది. మరో 84,094 టిడ్కో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
Read More
Next Story