ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన రూ.33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్-బెంగుళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై మార్గాల్లో హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ కు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుపతిని కలుపుతూ చెన్నై- బెంగుళూరు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఉండేలా చూడాలన్నారు. మరోవైపు ఖరగ్ పూర్ నుంచి చెన్నై వరకూ డెడికేటెడ్ రైలు రవాణా కారిడార్ పైనా సమీక్షలో సీఎం దిశానిర్దేశం చేశారు.
కొత్తగా 1564 కిలోమీటర్ల కొత్త మార్గాలకు సంబంధించిన పనులపై కూడా సీఎం ఈ సమీక్షలో చర్చించారు. ఏపీని లాజిస్టిక్స్ కారిడార్ గా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నామని ప్రస్తుతం ఉత్తర-దక్షిణ భారత్ ల మధ్య కనెక్టివిటీ దిశగా పనులు జరిగాయని ఇక తూర్పు నుంచి పశ్చిమ రాష్ట్రాలను అనుసంధానించే ప్రాజెక్టులు కూడా చేపట్టాల్సి ఉందని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచనలు జారీ చేశారు. నడికుడి- శ్రీకాళహస్తి మార్గంలో తదుపరి పనులు చేపట్టేందుకు అవసరమైన రూ.27 కోట్ల నిధుల్ని తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కోటిపల్లి -నర్సాపూర్ మార్గంలో కాకినాడ- కోటిపల్లి- అమలాపురం మార్గంలో రైలు సర్వీసు నడపాలని సూచించారు. అమరావతి, గన్నవరంలో నూతన రైల్వే కోచింగ్ టెర్మినళ్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని రైల్వే శాఖ చేసిన ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. వీటితో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ రైల్వే కోచింగ్ టెర్మినళ్లను విస్తరిస్తున్నట్టు అధికారులు వివరించారు. గుంటూరు- గుంతకల్ డబ్లింగ్ పనులు వేగంగా చేపట్టాలని... కాజీపేట- విజయవాడ మధ్య మూడో లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
రాష్ట్రంలో ఐకానిక్ రైల్వే స్టేషన్లు
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతిలను ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నూతనంగా నిర్మించనున్న అమరావతి రైల్వే స్టేషన్ ను కూడా వినూత్నంగా నిర్మాణం చేపట్టాలన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ రీ-డెవలప్మెంట్ పనులు వేగంగా చేపట్టాలని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికుల సౌలభ్యం కోసం స్కైవాక్ నిర్మించాలని సీఎం సూచించారు. విశాఖలో జ్ఞానాపురం వైపు అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటాయని సీఎం అన్నారు. ప్రస్తుతం మూడు స్టేషన్లతో పాటు నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు రైల్వే అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 73 స్టేషన్లను అమృత్ స్టేషన్ల కింద ఆధునీకరిస్తున్నామని రైల్వే అధికారులు వివరించారు. 373 చోట్ల రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి కూడా ప్రతిపాదించామని వెల్లడించారు.
ఈ డిసెంబరు నాటికి రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొత్తవలస- కిరండోల్, కొత్తవలస -విజయనగరం, దువ్వాడ, సింహాచలం మార్గాల్లో అభివృద్ధి పనులు, కొత్త మార్గాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలని సీఎం సూచించారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని సీఎం పేర్కోన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. రూ.271 కోట్లతో స్టేషన్ అప్ గ్రేడేషన్ పనులు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వివరించారు. పుష్కరాల నాటికి వివిధ ప్రాంతాల నుంచి 1012 ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని సీఎంకు తెలిపారు. ఈ సమీక్షకు రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు కోస్తా రైల్వే జీఎం ఇతర రైల్వే అధికారులు హాజరయ్యారు.