ఫేక్ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని, రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అంటూ పరోక్షంగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఫేక్ పార్టీ అని, నేరాలు నమ్ముకున్న పార్టీ అని, అలాంటి పార్టీ ఎరువుల విషయంలో విషప్రచారం చేస్తోందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయంలో మాట్లాడుతూ సకాలంలో రైతులకు యూరియా, ఇతర ఎవురులను అందిడమే తమ లక్ష్యమని చెప్పొకొచ్చారు.
కృష్ణా జిల్లాలో యూరియా లారీని అడ్డుకొని ఓ వైసీపీ నేత వివాదం సృష్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా, ఇతర ఎరువుల కోసం రైతులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే యూరియా దారి మళ్లింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కొందరు యూరియాను దారిమళ్లిస్తున్నారని మండిపడ్డారు. అలా దారిమళ్లించిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
రైతులు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో కొద్ది రోజుల్లో 2.71లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లల్లో సగటున 36.71లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఆంధ్రప్రదేశ్‌లో వాడాలనుకుంటున్నట్లు చెప్పారు. మరో వైపు గత పది రోజుల్లో 25వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఆంధ్రప్రదేశ్ రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. వచ్చే పది రోజుల్లో మరో 44,580 మెట్రిక్ టన్నుల యూరియా కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఏరైతుకు ఎంత యూరియా కావాలో ఆధార్ ఆధారంగా పంపిణీ చేస్తామని, అయితే ఎరువుల అక్రమాలకు పాల్పడితే మాత్రం వారిపై చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారని ఎవరు చెప్పారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ సమర్థతను పెంచేందుకు కొన్ని సర్వీసులను మాత్రమే ఔట్‌సోర్సింగ్ చేస్తారని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ నెపంతో కొంత మంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ. 12వేలు కోట్లు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.