‘అవన్నీ తప్పుడు ఆరోపణలే’.. స్పందించిన విజయసాయిరెడ్డి
తనపై వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ఒక ఆదివాసీ అధికారినికి సంబంధం అంటగట్టిన ఎవరినీ వదిలి పెట్టనను హెచ్చరించారు.
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనకు దేవాదాయశాఖ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే శాంతి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, భర్తు విదేశాల్లో ఉండగా శాంతి గర్భం దాల్చడానికి విజయసాయిరెడ్డే కారణమంటూ కొన్ని రోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇవి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. అంతేకాకుండా విజయసాయిరెడ్డికి ఆమెతోనే కాక మరికొందరితో కూడా సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం జోరుగానే సాగింది. ఈ మేరకు తన భార్య గర్భానికి విజయసాయిరెడ్డే కారణమంటూ శాంతి భర్త సుభాష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరారు. అప్పటి నుంచి విజయసాయి రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ఈరోజు ఆయన తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని వాటిని తిప్పికొట్టారు. ఇదంతా తనపై బురద జల్లడానికి టీడీపీ చేస్తున్న కుట్రేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రజలు అంతా చూస్తున్నారు
‘‘కూటమి రాక్షస పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నేను తాటాకు చప్పుళ్లకు భయపడను. అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా భయపడను. ఐదేళ్ల తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. అందులో సందేహం లేదు. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి బాధ్యులను ఎట్టిపరిస్థుల్లో వదిలిపెట్టను. నా ప్రతిష్ట దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెకు నాకు లేని సంబంధాన్ని అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలతో ప్రజల్లో మా పరువు తీయాలని చూస్తున్నారు. ఇలాంటి అసత్య కథనాలను ప్రసారం చేసిన వారితోనే క్షమాపణలు చెప్పిస్తా. అందులో సందేహం అక్కర్లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కష్టపడి పైకొచ్చా
‘చిన్న కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసే మనిషిని కాదు. అలాంటి అవసరం కూడా నాకు లేదు. రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, వంశీకృష్ణ తరహా వ్యక్తిని అసలే కాదు. అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తా. మహిళా కమిషన్లకు కూడా ఫిర్యాదు చేస్తా. వంశీకృష్ణను వదిలే ప్రసక్తే లేదు. పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. అసత్య కథనాలు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తా. రామోజీరావునే ధైర్యంగా ఎదుర్కొన్నాను. వంశీపై పరువు నష్టం దావా వేస్తా’’ అని వ్యాఖ్యానించారు.
నేనూ ఛానెల్ పెడతా
‘‘పొట్టకోస్తే అక్షరం ముక్కరాని వాళ్లే ఛానళ్లు పెడుతున్నారు. అలాంటిది నేను పెట్టలేనా. త్వరలోనే ఒక ఛానల్ పెడతా. ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలను బయటపెడతా. అధికారంలోకి వచ్చి నెల కూడా కాకముందే కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. బుద్దిలేని ఎండోమెంట్ కమిషనర్‌కు ఎంక్వయిరీ చేయమని లేఖ ఇస్తే దానిని మీడియాకు ఎలా ఇస్తారు. ఇదంతా నాకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రే. ధైర్యంగా ఎందుర్కొంటా. నాపై కోపంతో ఓ మహిళ గురించి కూడా తప్పుడు ప్రసారాలు చేయడం సహించారాని తప్పిదం. దానిపై కూడా పోరాడతాం’’ అని ఆయన చెప్పుకొచ్చారు.