నేను తప్పు చేయను..ఎవ్వరిని చేయనివ్వను
x

నేను తప్పు చేయను..ఎవ్వరిని చేయనివ్వను

అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.


నేను వేంకటేశ్వర స్వామి భక్తుడిని.. వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను తప్పు చేయను.. ఎవ్వరినీ తప్పు చేయనివ్వను అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో రూ.260 కోట్లతో చేపట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని టీటీడీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిలోని వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పనులు రెండు దశల్లో పూర్తి కానున్నాయి. మొదటి దశలో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రూ.120 కోట్లతో రెండోదశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.

వేంకటేశ్వరుని కృపతోనే రాజధానికి అమరావతి నామకరణం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘దేవతల రాజధాని అమరావతే.. మనకూ రాజధానిగా ఉంటుంది. కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో 2019లో అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాం. కృష్ణానది ఒడ్డున ఆలయం నిర్మించేందుకు 25 ఎకరాలను కేటాయించాం. రాజధానికి అమరావతి అనే నామకరణం కూడా ఆ స్వామి కృపతోనే చేశాం. ఒక పవిత్ర కార్యం సంకల్పిస్తే దానికి ఇక్కడి ప్రజలు సహకరించారు. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారు. రైతులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం విధ్వంసం తప్పా ఒక్కమంచి పనీ చేయలేదు. రైతులు మంచి సంకల్పంతో భూమి ఇస్తే ఐదేళ్లు వారికి నరకం చూపించారు. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేశారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మంచి మనసుతో చేసే పనికి దేవుని ఆశీస్సులు
నేను వేంకటేశ్వర స్వామి భక్తుడిని. మా ఇంటి దైవం ఆ స్వామియే. మా ఇంటి నుంచి చూస్తే శేషాచల పర్వతం కనిపిస్తుంది. చిన్నతనం నుంచి స్వామి ఆలయం చూస్తూ పెరిగాను. స్వామికి అప్రతిష్ట కలిగించే ఏ పనీ చేయను... ఎవరినీ చేయనివ్వను. తప్పులు చేస్తే వేంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. ఈ జన్మలోనే శిక్షిస్తాడు. స్వామి వారు తన పవిత్రను తానే కాపాడుకుంటున్నారు. ముఖ్యమంత్రిని అనే హోదాతో కాకుండా నేను తిరుమలకు కేవలం భక్తి భావంతోనే వెళ్తాను. సామాన్య భక్తుడిగా క్యూలైన్లో వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటాను. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుడితే నేను స్విమ్స్‌లో ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాను. నాడు వేంకటేశ్వరుని సేవలో పాల్గొనేందుకు వెళ్తుంటే 23 క్లైమోర్ మైన్స్‌ను నక్సలైట్లు పేల్చారు. స్వామి వారే నాకు ప్రాణభిక్ష పెట్టారు. శ్రీవారి సేవకులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నేడు స్వచ్ఛందంగా వేలమంది తిరుమలకు వచ్చి సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఆలయాల నిర్మాణాన్ని చేపడుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తాం. ఆలయ నిర్మాణాలకు భక్తులు కూడా ముందుకొచ్చి సహకరించాలి. ముంబయిలో రేమాండ్స్ సంస్థ రూ.100 కోట్లతో స్వామి ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తోంది. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఆ స్వామి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, రైతులు, భక్తులు, పాల్గొన్నారు.
Read More
Next Story