
కోనసీమ కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా
ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కోనసీమ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడం మూలంగా కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బ తిన్న విషయం తన దృ వచ్చిందని, సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రయిన్ లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి పడుతోందనీ, ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బ తిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం... ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారని, అందువల్ల ఆ ప్రాంతాన్ని తాను స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. దసరా తరవాత అక్కడికి వెళ్ళి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తాను. రైతాంగంతోను, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తానని శనివారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.