
జగన్ అక్రమాలను బయటకు తెస్తా
ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సరిగ్గా పదవీ విరమణ రోజు పోస్టింగ్ ఇచ్చింది.
మాజీ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ మీద ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవంటూనే.. జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాలన్నింటిని ఖచ్చితంగా బయటకు తెస్తానని వెల్లడించారు. మరో వైపు కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలోని కోడికత్తి శ్రీను కుటుంబాన్ని ఆదివారం ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్లల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అరాచకాలను ఒక్కొక్కటిగా బయటకు తెస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లల్లో కోడికత్తి శ్రీను వంటి జగన్ బాధితులు వందలు, వేల సంఖ్యలో ఉన్నారని విమర్శించారు. తన వంతుగా వారందరికీ సాయం చేసి వారి కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఇలాంటి బాధితులందరి సహాయంతో జగన్‌మోహన్‌రెడ్డి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలను బయటపెడతానని, తాను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. అంతేకాకుండా తాను అందరికీ అందుబాటులో ఉంటానని, జగన్ గురించి ఏమి చెప్పాలనుకున్నా 7816020048 వాట్సాప్ నంబరుకు సమాచారం పంపొచ్చని సూచించారు. తప్పకుండా కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలన్నారు. టెర్రరిస్టులపై పెట్టే కేసులు కోడికత్తి శ్రీను మీద పెట్టారని, జగన్ తన అధికారాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. కోడికత్తి శ్రీనుకి ఆరేళ్ల పాటు బెయిల్ రాకుండా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఉపయోగించారని, అన్యాయంగా కోడికత్తి శ్రీను జీవితాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
ఏబీ వెంకటేశ్వరరావు తన రాజీయ ప్రవేశం గురించి కూడా వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పాలిటిక్స్‌లోకి రావడం ఎప్పటికైనా అవసరమని తనకు అనిపించిందని, అందువల్ల తాను నేటి నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. సండూర్ పవన్‌తో మోదలైన జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం నేడు కోట్లకు పడగలెత్తిందని, కేవలం రూ. 25 కోట్లతో కొనుగోలు చేసిన సెకెండ్ హ్యాండ్ సండూర్ పవన్ ప్రాజెక్టు జగన్ అధికారంలోకి రాగానే వందల కోట్లు అనుమానాస్పద డబ్బు విదేశాల నుంచి వచ్చిందని విమర్శలు గుప్పించారు. ఈ డబ్బంతా ప్రజలదే అని, జగన్ కష్టపడి సంపాదించిన డబ్బు కాదన్నారు. జగన్‌తో పాటు అతని అనుచరులు అక్రమంగా దోచుకున్న సొమ్మును చట్టపరంగా, న్యాయపరంగా బయటకు కక్కేలా పోరాటం చేయాలని, జగన్ అక్రమాస్తుల కేసులన్నీ లాజికల్ కంక్లూషన్‌కు రావాలన్నారు. తన రాజకీయ ప్రవేశం, జగన్ మీద పోరాటం కొత్త అధ్యాయమంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
Next Story