విచారణకు మరోసారి పిలిచినా వస్తా
x

విచారణకు మరోసారి పిలిచినా వస్తా

మద్యం కుంభకోణంలో బిగ్‌బాస్‌ ఎవరో అనే విషయం రాజ్‌ కసిరెడ్డిని అడగాలని విజయసాయిరెడ్డి చెప్పారు.


మద్యం కుంభకోణం అంశానికి సంబంధించి పోలీసులు మరో సారి తనను పిలిచినా విచారణకు హాజరు అవుతారని మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణకు శుక్రవారం విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయంలో సిట్‌ బృందం దాదాపు 3 గంటల పాటు విజయసాయిరెడ్డిని విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్‌ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెపానన్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో తానెప్పుడు జోక్యం చేసుకోలేదని, అందువల్ల దాని గురించి తనకేమీ తెలియదన్నారు.

మద్యం విక్రయాలకు సంబంధించి కర్త, కర్మ, క్రియ అంతా రాజ్‌ కసిరెడ్డే అని చెప్పారు. అయితే రాజ్‌ కసిరెడ్డి మూడు కంపెనీలను ఏర్పాటు చేయడం, కొత్త బ్రాండ్లను తయారు చేయడం, వాటిని విక్రయించడం వంటి విషయాలు తనకు తెలియదన్నారు. దీనిలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర గురించి కూడా తనకు తెలియదన్నారు. ఇవే విషయాలను సిట్‌ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. మద్యానిక సంబంధించి హైదరాబాద్, అమరావతిలో జరిగిన సమావేశాలకు ఎవరెవరు వచ్చారు? జగన్‌ ఓఎస్‌డి కృష్ణమోహన్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి సమావేశాలకు వచ్చారా? అని సిట్‌ అధికారులు తనను అడిగారని, తనకు గుర్తు ఉన్నంత వరకు వారు సమావేశాలకు రాలేదనే సమాధానం చెప్పినట్లు తెలిపారు.

అయితే కిక్‌ బ్యాక్స్‌ గురించి అడిగారని, దాని గురించి తనకు తెలియదని చెప్పినట్లు తెలిపారు. అరబిందో నుంచి అప్పు కింద రూ. 100 కోట్లు ఇప్పించానని, వాటి వినియోగం గురించి తనకు తెలియదని సిట్‌ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. సిట్‌ అధికారులు తనను నాలుగు ప్రశ్నలు అడిగారని, తాను చెప్పిన సమాధానాలతో సిట్‌ అధికారులు సంతృప్తి చెంది ఉంటారని తాను భావిస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ఒక వేళ వారు సంతృప్తి చెందక పోతే మరో సారి విచారణకు రమ్మన్నా.. వచ్చేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

ప్రాంతీయ పార్టీలో వైసీపీ రెండో స్థానంలో ఉందన్నారు. అధికారంలో లేనప్పుడు అన్నీ తానై వైసీపీకి చూసుకున్నానని చెప్పారు. అయితే కొంత మంది జగన్‌ వద్ద తన గురించి వెన్నుపోటుదారుడు అని చెప్పారని, దీని వల్ల తాను పార్టీలో రెండో స్థానం నుంచి రెండు వేల స్థానానిక పడిపోయానన్నారు. ప్రజలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయాల్లోకి వస్తానన్నారు.
Read More
Next Story