ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, తనిఖీలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతీ పౌరుడికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే అంశాన్ని తనిఖీ చేస్తానని సీఎం అన్నారు. బుధవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయి సహా రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని.. పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతనెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్ బ్యాక్ వివరాలను సీఎం పరిశీలించారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. దీపావళి పండుగ తర్వాత కూడా సూపర్ జీఎస్టీ ద్వారా పన్నుల తగ్గింపు, తద్వారా ధరలు తగ్గిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల కలిగే లబ్ధిని స్లైడ్స్ ద్వారా సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని సీఎం సూచించారు.
వివిధ శాఖలు అందించే ప్రభుత్వ సేవలపై టెక్నాలజీ డేటా ఆడిటింగ్ ద్వారా సంతృప్త స్థాయిని అంచనా వేస్తామని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అధికారులు ఇచ్చే సమాచారానికి పొంతన ఉండాలని సీఎం అన్నారు. సామాన్యుడికి మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ అన్న విధానంతో సమర్ధవంతంగా ప్రజలకు సేవలందిస్తామని అన్నారు. దీనిపై నవంబరు మొదటి వారంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరును మదింపు చేస్తామని సీఎం అన్నారు. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా వేర్వేరు ఘటనల్ని సమన్వయంతో పర్యవేక్షించటంతో పాటు త్వరితగతిన బాధితులకు స్వాంతన కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ చలానాల పేరిట వాహనదారులను ఇబ్బందులు పెట్టవద్దని సీఎం సూచించారు.
పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్మిస్తుంటే ..ప్రైవేటు పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు. పీపీపీ ద్వారా వచ్చే మెడికల్ కాలేజీల్లో పేద విద్యార్ధులకు అదనంగా మరిన్ని సీట్లు అందుబాటులోకి రావటంతో పాటు పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం కూడా లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు కూడా కొందరు కుట్రలు చేశారని.. సకాలంలో సాంకేతికత వినియోగించి వారి బండారం బయట పెట్టామన్నారు. ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేసి తిరిగి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.