నేనే దత్తత తీసుకుంటా
x

నేనే దత్తత తీసుకుంటా

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులకు కలెక్టర్‌ ఆదర్శంగా నిలిచారు.


ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఎంపీ కానీ, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులు కానీ దత్తత తీసుకునేందుకు ముందుకు రాలేదు. స్థానిక నాయకులైతే అలాంటి ఆలోచనలు కూడా చేయలేదు. కానీ ఆ జిల్లా కలెక్టర్‌ చేశారు. ఆ కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఆ కుటుంబం బాగోగులు చూసుకునేందుకు, వృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ముందకొచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్కడికక్కడే సీఎం చంద్రబాబు ఎదురుగా స్పాట్‌లో తీసుకున్న ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రే ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ షాక్‌లో నుంచి తేరుకున్న సీఎం ఆ కలెక్టర్‌ను వెరీ గుడ్‌ అమ్మా అంటూ అభినందించారు. రెండో రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఎన్టీఆర్‌ భరోసా కింద పెన్షన్‌ల పంపిణీ కోసం సీఎం చంద్రబాబు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటన చేపట్టారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజక వర్గం మలకపల్లి నివాసి సానమాండ్ర పోశిబాబును తన కాన్వాయ్‌ కారులో ఎక్కించుకుని వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను కలిసి పెన్షన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా చర్మకారుడైన పోశిబాబు తయారు చేసిన డప్పులు, వివిధ రకాల డ్రమ్ములు, చెప్పులను సీఎం పరిశీలించారు. వాటి తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. డప్పును కూడా సీఎం వాయించారు.
వారి బాగోగులు, కష్టాలు, సమస్యలు తెలుసుకున్నారు. మీ కుటుంబం బాగుపడాలంటే ఏమి చేయాలని సీఎం పోశిబాబును అడిగారు. తమకు ఇల్లు లేదని, కట్టుకోవడం మద్యలోనే ఆగిపోయిందని, ఐటీఐ చేసిన తన కుమారుడుకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలని, తన జీవనోపాధికి ఒక కొట్టు పెట్టించాలని సీఎంను పోశిబాబు కోరారు.
పోశిబాబు కుటుంబాన్ని పీ4 కింద దత్తత తీసుకునే ఏర్పాటు చేయడం, ఇల్లు కట్టించడం, పిల్లోడికి జాబ్, పోశిబాబుకు షాపు ఏర్పాటు వంటి ఏర్పాట్లన్ని మనం చేయాలని, అక్కడ నుంచి హ్యాండ్‌ హోల్డింగ్‌ పెరిగే విధంగా, అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు పోశిబాబుకు షాపు పెట్టించాలని, ఇలా ఈ కుటుంబం ఆర్థికంగా వృద్ధిలోకి రావడానికి ఏమి కావాలో అన్నీ వర్కవుట్‌ చేయాలని పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్‌ పి ప్రశాంతిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు మాటలు పూర్తి కాగానే.. క్షణం ఆలస్యం చేయకుండా పోశిబాబు కుటుంబాన్ని తాను దత్తత తీసుకుంటాని కలెక్టర్‌ ప్రశాంతి సీఎంకు చెప్పడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.
కలెక్టర్‌ నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేయని సీఎం ఆ కలెక్టర్‌ సమాధానానికి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని కలెక్టర్‌ ప్రశాంతిని వెరీ గుడ్‌ అమ్మా అంటూ సీఎం చంద్రబాబు అభినందించారు. కలెక్టరే మీ కుటుంబాన్ని అడాప్ట్‌ చేసుకుంది. మీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ది కావడానికి ఏమి చేయాలో అన్నీ చర్యలు కలెక్టర్‌ చూసుకుంటూరు అంటూ సీఎం చంద్రబాబు పోశిబాబుకు హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ పి ప్రశాంతి 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. గతంలో ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా కూడా పని చేశారు. ఆమె భర్త డిల్లీరావు కూడా ఐఏఎస్‌ అధికారే. ఎన్టీఆర్‌ జిల్లాకు తొలి కలెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉన్నారు.
Read More
Next Story