’హైదరాబాద్‌ను ఉన్నత విద్యకు చిరునామాగా నేనే మార్చా‘
x

’హైదరాబాద్‌ను ఉన్నత విద్యకు చిరునామాగా నేనే మార్చా‘

గండిపేటకు రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.


హైదరాబాద్ ను డెవలప్ చేసింది తానే అని తరచుగా చెప్పుకునే సీఎం చంద్రబాబు మరో సారి అదే ధోరణిలో మాట్లాడారు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గానే కాకుండా ఉన్నత విద్యకూ చిరునామాగా మార్చింది తానే అని చెప్పొకున్నారు. శనివారం హైదరాబాద్ గండిపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద పిల్లలకు, అనాథలకు కొండంత అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గండిపేటలో విద్యాసంస్థలను స్థాపించామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

గండిపేటతో అనుబంధం
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గండిపేటకు రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు ఇది పార్టీ ప్రధాన కార్యాలయమని, రాజకీయ నేతలకు శిక్షణ ఇచ్చే కేంద్రమని తెలిపారు. నేడు అదే ప్రాంగణంలో పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం గర్వంగా ఉందన్నారు. నాడు నాటిన చిన్న మొక్క నేడు మహావృక్షమై, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విద్యాసంస్థలను అద్భుతంగా నిర్వహిస్తున్న ఘనత నారా భువనేశ్వరిదేనని ఆయన కొనియాడారు.
విద్యార్థుల విజయాలు
ఎన్టీఆర్ విద్యాసంస్థల ఫలితాల పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి నలుగురు విద్యార్థులు గ్రూప్-1 పోస్టులకు ఎంపికవ్వడం, మరో 29 మంది ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం 1,641 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని, చిన్న పాఠశాలగా మొదలై నేడు డిగ్రీ కాలేజీ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి - భవిష్యత్తు విజన్
హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో తన వంతు కృషి ఉందని, ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌ను రాబోయే తరం సాంకేతికతలకు (Next Gen Technology) కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం వ్యాలీ, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్ , డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More
Next Story