నా జీవితంలో అలాంటి విపత్తును చూడలేదు: సీఎం చంద్రబాబు
x

నా జీవితంలో అలాంటి విపత్తును చూడలేదు: సీఎం చంద్రబాబు

పిల్లల కోసం నీళ్లడిగితే ఇవ్వలేని పరిస్థితి చూశా. ఓ పక్క క్లౌడ్‌ బరస్ట్‌.. మరోవైపు బుడమేరు వరద. విపత్తులను హ్యాండిల్‌ చేయడంలో కొత్త ఒరవడిని సృష్టించాం.


తన జీవితంలో ఇలాంటి ఘోర విపత్తును చూడ లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజులుగా మంచినీళ్లు లేవని, పిల్లల కోసం నీళ్లు పంపించగలరా అని వరద బాధితులు అడిగితే ఓ సీఎంగా మంచినీళ్లు పంపించలేని పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో తిరిగానని, వరద బాధితులను కూడా కలిశానని చెప్పారు. ఆ సమయంలో బాధితులు మాటలు వింటుంటే చాలా బాధేసిందన్నారు.

రోజుల తరబడి వరదల్లోనే అధికారులు, మంత్రులతో పాటు తాను కూడా తిరిగానన్నారు. బాధితులు పెద్ద కోరికలు అడగలేదని, తాగడానికి నీళ్లు అడిగారని, అది కూడా పిల్లల కోసం మంచినీళ్లు కావాలని, వాటిని పంపించాలని అడిగారని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. వెంటనే మంచి నీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అధికారులను పంపించి లక్షలాది వాటర్‌ బాటిళ్లను సేకరించి పంచామని చెప్పారు. వరద బాధితులకు కోటికి పైగా వాటర్‌ బాటిళ్లను పంచామన్నారు. విజయవాడ వాసులు ఎదుర్కొన్న వరదల విపత్తును తన జీవితంలో ఇంతవరకూ చూడలేదని చంద్రబాబు చెప్పారు. ఓవైపు ఒకేచోట కుండపోతగా కురుస్తున్న వర్షం (క్లౌడ్‌ బరస్ట్‌), మరోవైపు బుడమేరుకు కనివినీ ఎరుగని వరద ప్రవాహం వచ్చిందన్నారు. బుడమేరు వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామన్నారు. అధికార యంత్రాంగం బుడమేరు గండ్లను పూర్చడానికి పగలూరాత్రి కష్టపడి పని చేశారని అన్నారు. రోజుల తరబడి వరదల్లో తిరుగుతూ బాధితులకు మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశామన్నారు.

అంతేకాకుండా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టామన్నారు. విపత్తులను హ్యాండిల్‌ చేయడంలో కొత్త ఒరవడిని సృష్టించామన్నారు. రాత్రింబవళ్లు దీని కోసం కష్టపడి పని చేశామన్నారు. రోజుల తరబడి తాను కలెక్టరేట్‌ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు వరద సాయంపై పర్యవేక్షణ చేస్తూ ముందుకెళ్లామన్నారు. బాధితులకు 1. 14 కోట్ల వాటర్‌ బాటిళ్లు, 37 లక్షల మిల్క్‌ బాటిళ్లు, 47 లక్షల బిస్కెట్‌ ప్యాకెట్లు
5 లక్షల కోడి గుడ్లు, 3.50 లక్షల క్యాండిల్స్, 2.30 లక్షల మ్యాచ్‌ బాక్సులు, 1.15 కోట్ల ఆహార ప్యాకెట్లు, 5 వేల క్వింటాళ్ల కూరగాయలు అందించామని చెప్పారు. అంతేకాకుండా ముంపునకు గురైన ప్రాంతాల్లో రోడ్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా అగ్నిమాపక శాఖ సిబ్బందిని రంగంలోకి దింపామన్నారు. దాదాపుగా 75 వేల ఇళ్లను, 330 కిలోమీటర్ల మేర రోడ్లను ఫైర్‌ డిపార్ట్‌ మెంట్‌ సిబ్బంది క్లీన్‌ చేసిందన్నారు. వరదలకు వచ్చి చేరిన చెత్తను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దాదాపు 20 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను శానిటేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ సిబ్బంది తొలగించిందన్నారు. వరద బాధితులకు ఆధుని టెక్నాలజీని ఉపయోగించి వరదల్లో బాధితులకు సాయం చేసేందుకు పని చేశామన్నారు. డ్రోన్లను, ఫైరింజన్లను, ప్రొక్లెయిన్లను ఉపయోగించి బాధితులను ఆదుకున్నామన్నారు.
రికార్డు స్థాయిలో విరాళాలు
వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు వచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా దాతలకు పాదాభివందనాలు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇంత పెద్ద స్థాయిలో ఆదుకునేందుకు ముందుకు రావడం చాలా సంతోషమన్నారు. తొలిసారిగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు 400 కోట్ల రూపాయలు దాతలు విరాళం అందిందన్నారు. దాతల దాన గుణాన్ని మెచ్చుకున్నారు. వరద బాధితుల పరిస్థితి చూసి స్పందించి విరాళం పంపిన దాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. మానవతా దక్ఫథంతో స్పందించారన్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉండి కూడా వీల్‌ చైర్‌పై వచ్చి సాయం అందించారని కొనియాడారు. అమెరికా నుంచి ఫోన్‌ చేసి ఇక్కడ ఉంటున్న వారిని స్వయంగా పంపించి చెక్కులు అందజేశారని తెలిపారు.
వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చిన స్కూలు పిల్లలను చూసి ముచ్చటేసిందన్నారు. కిడ్డీ బ్యాంకును పగులగొట్టి అందులో వారు దాచుకున్న ఐదు, పది రూపాయలను తెచ్చిచ్చారని అన్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. సంఘటితంగా ముందుకు వస్తే విపత్తులను ఎదుర్కోవచ్చనే విషయాన్ని దాతలు చాటిచెప్పారని, వారికి ధన్యవాదాలు చెప్పారు. వరదల్లో నష్ట పోయిన ప్రజలకు ఎన్ని విధాలుగా దుకోవాలో చేతల్లో చేసి చూపించామన్నారు. ఇప్పటి వరకు రూ. 602 కోట్లు బాధితులకు విడుదల చేశామన్నారు. ఇందులో రూ. 400 కోట్లు దాతలు ఇచ్చినవే అన్నారు. మొత్తం నష్టం రూ. 6,800 కోట్ల మేర జరిగిందన్నారు. ఇళ్లు మునిగిన వారికి రూ. 25వేలు, మొదటి అంతస్తులో ఉన్న వారికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు.
Read More
Next Story