ఆరోగ్యం బాగలేదు..సిట్‌కు హాజరు కాలేను
x

ఆరోగ్యం బాగలేదు..సిట్‌కు హాజరు కాలేను

లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి నారాయణస్వామికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.


సిట్‌ విచారణకు మాజీ మంత్రి నారాయణ స్వామి డుమ్మా కొట్టారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, దీని వల్ల తాను ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ విచారణకు సోమవారం హాజరు కాలేనని సిట్‌ అధికారులకు మాజీ మంత్రి నారాయణస్వామి సమాచారం పంపించారు. ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేసిన కే నారాయణస్వామికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)అధికారులు ఇది వరకు నోటీసులు జారీ చేశారు.

నారాయణస్వామి ప్రమేయం లేకుండానే వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన సిట్‌ అధికారులు, నారాయణస్వామి నాడు ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేసినందుకు వల్ల లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి సాక్షిగా నారాయణస్వామి నుంచి స్టేట్‌మెంట్‌ ఇవ్వాలి నోటీసుల్లో సిట్‌ అధికారులు పేర్కొన్నారు. జూలై 21న సోమవారం ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం విజయవాడ సిట్‌ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనకు ఆరోగ్యం బాగలేనందు వల్ల సోమవారం విచారణకు హాజరు కాలేనని రిప్లై ఇచ్చారు. అయితే దీనిపై సిట్‌ అధికారులు ఎలా రియాక్ట్‌ అవుతారనేది తెలియాల్సి ఉంది.

మరో వైపు ఈ మద్యం కుంభ కోణం కేసులో 49 మందిని నిందితులుగా చేర్చిన సిట్‌ అధికారులు దాదాపు 200 మందికిపై సాక్షులను విచారించారు. రాజ్‌కసిరెడ్డిని ఏ–1గాను, ఎంపీ మిథున్‌రెడ్డిని ఏ–4గాను, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఏ–5గాను, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను ఏ–33గాను చేర్చిన సిట్‌ అధికారులు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ అధికారి కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. సిట్‌ అదికారులకు నారాయణస్వామి ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు, అవి మలుపు తిప్పనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story