నేను పదో తరగతి ఫెయిలయ్యా : మంత్రి నారాయణ
x

నేను పదో తరగతి ఫెయిలయ్యా : మంత్రి నారాయణ

నెల్లూరులో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్‌ మీటింగ్‌కు మంత్రి నారాయణ హాజరయ్యారు.


ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ సంస్థల అధిపతి పొంగూరు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన గురించి ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలను వెల్లడించారు. విద్యార్థులకు స్పూర్తినిచ్చేందుకు తన అనుభవాలను పంచుకున్నారు. తాను 1972లో 10వ తరగతిలో ఫెయిలయ్యానని చెప్పారు. తాను ఫెయిలైనందుకు కుంగిపోలేదన్నారు. ఫెయిల్‌ కావడంతో తనలో కసి పెరిగింది. తర్వాత చాలా కష్టపడ్డాను. బాగా చదివాను. దాంతో మెరిట్‌ విద్యార్థిగా మారాను. కష్టపడి చదివి ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌లలో ఫస్ట్‌ క్లాస్‌ తెచ్చుకున్నాను. అని ఒక సారి తన గత అనుభవాన్ని చెప్పొకొచ్చారు.

నెల్లూరు నగరంలో బీవీఎస్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో శనివారం జరిగిన పేరెంట్స్, టీచర్స్‌ మీటింగ్‌కు మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను పదో తరగతిలో ఎలా ఫెయిల్‌ అయ్యాను.. తర్వాత ఎలా కష్టపడి చదివాను.. మెరిట్‌ స్టూడెంట్‌గా ఎలా మారాననే విషయాలను పంచుకున్నారు. తన అనుభవాలను వివరిస్తూనే ఎలా కష్టపడి చదవాలో చెప్పారు. తాను ఒక టీచర్‌గా పని చేశానని, విద్యార్థుల్లో ఐక్యూ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. మర్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకుండా.. వారిని ప్రోత్సహించే విధంగా ఆలోచనలు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులను మెరికల్లా తయారు చేసేందుకు ఉపాధ్యాయులు కష్టపడాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై శ్రద్ధ పెట్టి దృష్టి పెడితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆకాంక్షించారు.
ఏపీలో 45094 పాఠశాలలు ఉన్నాయని, వీటిల్లో 36 లోల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాలో 2604 పాఠశాలల్లో బడి పండుగ జరుపుతున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో వసతులు, సమస్యలు వంటి అంశాలపై పేరెంట్స్‌తో చర్చించినట్లు తెలిపారు.
Read More
Next Story