హైడ్రాలో అయోమయం ?
x

హైడ్రాలో అయోమయం ?

కూల్చివేతలకు సంబంధించి హైడ్రా ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపించిందో లేకపోతే అయోమయం పెరిగిపోతోందో అర్ధంకావటంలేదు.


కూల్చివేతలకు సంబంధించి హైడ్రా ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపించిందో లేకపోతే అయోమయం పెరిగిపోతోందో అర్ధంకావటంలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏ మర్రి రాజశేఖరరెడ్డికి చెందిన విద్యాసంస్ధలకు రెవిన్యు శాఖ నోటీసులు జారీచేసింది. చెరువులు, కాల్వలు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలితే వాటన్నింటినీ హైడ్రా కూల్చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుమారు 20 అక్రమ నిర్మాణాలను హౌడ్రా కూల్చేసింది. తాజాగా మర్రికి చెందిన విద్యాసంస్ధలు కూడా చెరువును ఆక్రమించి నిర్మించిందే కాబట్టి కూల్చివేతల నోటీసులను రెవిన్యుశాఖ ఉన్నతాధికారులు జారీచేయటం వివాదంగా మారింది.

ఇప్పుడు విషయం ఏమిటంటే చెరువులు, కుంటలను ఆక్రమించి లేదా బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్లో నిర్మించిన ఆక్రమణల్లో విద్యాసంస్ధలుంటే కూల్చివేతకు కొంత సమయం ఇవ్వాలని డిసైడ్ చేసినట్లు హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ మీడియాతో చెప్పారు. చెప్పినట్లుగానే సలకం చెరువును ఆక్రమించి నిర్మించిన ఫాతిమా ఓవైసీ విద్యాసంస్ధలను కూల్చేవిషయంలో హైడ్రా కొంత గడువును ఇచ్చింది. మిగిలిన ఆక్రమణల్లాగ విద్యాసంస్ధలను కూడా కూల్చేస్తే దాని ప్రభావం వేలాదిమంది విద్యార్ధుల భవిష్యత్తుపైన పడుతుందని రంగనాధ్ అభిప్రాయపడ్డారు. అక్రమనిర్మాణం పేరుతో స్కూలు లేదా కాలేజీని ఇప్పటికిప్పుడు కూల్చేస్తే అందులో చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్తు దెబ్బతింటుని హైడ్రా కమీషనర్ గ్రహించారు.

ఎలాగంటే ఒక విద్యాసంస్ధలో చదువుతున్న విద్యార్ధులను మరో విద్యాసంస్ధలోకి మార్చటం అంత తేలికకాదు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూలు లేదా కాలేజీని కూల్చేస్తే అందులో చదువుతున్న వేలాదిమంది విద్యార్ధులను మరే విద్యాసంస్ధలోనూ అడ్మిషన్లు దొరకదని అందరికీ తెలిసిందే. పదిమంది లేకపోతే ఇరవైమంది విద్యార్ధులను చేర్చవచ్చేమో కానీ ఒకేసారి వేలాదిమంది విద్యార్ధులను ఇతర విద్యాసంస్ధల్లో చేర్పించటం సాధ్యంకాదు. విద్యాసంస్ధను కూల్చేసి విద్యార్ధులను రోడ్డుమీద పడేసిన అపఖ్యాతి ప్రభుత్వంపై పడుతుంది. అందుకనే ఫాతిమా విద్యాసంస్ధలు, అనురాగ్ యూనివర్సిటి, మల్లారెడ్డి గ్రూపు విద్యాసంస్ధలకు ఇదే విషయాన్ని కమీషనర్ నోటీసుల్లో స్పష్టంచేశారు.

వచ్చే విద్యాసంవత్సరంలో ఎలాంటి అడ్మీషన్లు చేయవద్దని, అక్రమ నిర్మాణాలను యాజమాన్యాలే కూల్చేసుకోవాలని కూడా చెప్పారు. అలా చేయకపోతే అప్పుడు హైడ్రానే కూల్చివేతలు మొదలుపెడుతుందని కూడా నోటీసుల్లో స్పష్టంగా హైడ్రా హెచ్చరించింది. పై మూడు యాజమాన్యాలకు వర్తించిన కమీషనర్ నిర్ణయం మిగిలిన విద్యాసంస్ధలకు కూడా వర్తిస్తుందన్న విషయాన్ని రెవిన్యుశాఖ మరచిపోయినట్లుంది. అందుకనే మర్రికి చెందిన విద్యాసంస్ధలను కూల్చేవేస్తామని నోటీసులు జారీచేసింది. దుండిగల్ లోని చిన్న దామెరచెరువును ఆక్రమించి ఎంఎల్ఆర్ఐటి విద్యాసంస్ధలను మర్రి రాజశేఖర్ నిర్మించేశారు. ఆక్రమణ చేసిన భూమిలో ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ సంస్ధను కూడా మర్రి నిర్మించారు. మర్రి అంటే ఎవరో కాదు బీఆర్ఎస్ ఎంఎల్ఏ, మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డికి స్వయాన అల్లుడే. అంటే మామ, అల్లుళ్ళు ఇద్దరు బీఆర్ఎస్ ఎంఎల్ఏలే.

దామెరచెరువును ఆక్రమించిన మర్రి 8 ఎకరాల 24 గుంటల్లో కాలేజీలు నిర్మించేసుకున్నారు. ఏడురోజుల్లో నిర్మాణాలను తొలగించకపోతే తామే తొలగించాల్సుంటుందని రెవిన్యుశాఖ నోటీసుల్లో స్పష్టంచేసింది. ఆక్రమించిన చెరువు స్ధలంలో కాలేజీ భవనాలతో పాటు పరిపాలనా భవనాలు, వెహికల్ పార్కింగ్, పెద్దపెద్ద షెడ్లు కూడా నిర్మించేశారు. రెవిన్యుశాఖ నోటీసులు చూసిన తర్వాత హైడ్రాలో అయోమయం పెరిగిపోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే హైడ్రా పరిధిలో రెవిన్యూ, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు పనిచేస్తున్నారు. పై శాఖలు చేసే జాయింట్ ఇన్ స్పెక్షన్లో చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించినట్లు నిర్ధారణైతే వెంటనే హైడ్రా కూల్చివేతలకు దిగిపోతోంది.

అలాంటి హైడ్రా కమీషనర్ రంగనాధే విద్యాసంస్ధలకు కొంత గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి రంగనాధ్ నిర్ణయానికి విద్యార్ధుల తల్లి, దండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ పిల్లల విద్యాసంవత్సరం పాడవకుండా రంగనాధ్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రెవిన్యు ఉన్నతాధికారులు మర్రి విద్యాసంస్ధలను వారంలోపు కూల్చేస్తామని నోటీసులు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

అయితే ఇదే విషయమై విద్యాసంస్ధల యాజమాన్యాలు పల్లా రాజేశ్వరరెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి తదితరులు కోర్టులో కేసు వేశారు. పిటీషన్ను విచారించిన జస్టిస్ లక్ష్మణరెడ్డి హైడ్రాపై మండిపడ్డారు. విద్యాసంవత్సరం మధ్యలో భవనాలను కూల్చేయటం ఏమిటని నిలదీశారు. అలాగే భవనాలను ఏకపక్షంగా కూల్చేయటం కాకుండా పిటీషనర్ల దగ్గరున్న అన్నీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. కమీషనరేమో గడువిస్తానని చెబుతుంటే రెవిన్యు ఉన్నతాధికారులేమో వారంలోగా భవనాలను కూల్చేస్తామని చెప్పటంలో సమన్వయలోపం స్పష్టంగా కనబడుతోంది.

Read More
Next Story