భర్త రెండు పెగ్గులు, భార్య ఐస్‌క్రీమ్..వైరల్ గా అయ్యన్న వ్యాఖ్యలు
x

భర్త రెండు పెగ్గులు, భార్య ఐస్‌క్రీమ్..వైరల్ గా అయ్యన్న వ్యాఖ్యలు

విశాఖపట్నం పర్యాటక అభివృద్ధి గురించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


విశాఖలో టూరిజం అభివృద్ధికి స్వేచ్ఛా వాతావరణం అవసరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రత్యేకించి విశాఖపట్నం పర్యాటక రంగ అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భర్త సరదాగా రెండు పెగ్గులు వేసేలా, భార్య ఐస్‌క్రీమ్ తినేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించినప్పుడే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది" అని ఆయన అన్నారు. విశాఖలో నెరెడ్కో నిర్వహించిన విశాఖ ప్రోపర్టీ ఫెస్ట్ 2025 లో స్పీకర్ మాట్లాడుతూ పర్యాటకులకు సౌకర్యవంతమైన, సరదాగా గడపగలిగే వాతావరణం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, చర్చనీయాంశంగానూ మారాయి.

గోవా మోడల్ అమలు చేయాలని స్పీకర్ సూచన

విశాఖపట్నంను గోవా లాంటి 'ఫ్రీ జోన్'గా మార్చాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. కుటుంబాలతో కలిసి వచ్చే పర్యాటకులు సముద్రతీరాల్లో సరదాగా గడపాలని, అక్కడ రాత్రి 10 గంటల తర్వాత పోలీసులు కేసులు పెట్టకూడదని ఆయన చెప్పారు. కేసులు పెడితే పర్యాటకులు ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. బీచ్‌లలో స్వేచ్ఛగా గడపాలి అని సూచించారు. ప్రస్తుత నిబంధనలు పర్యాటకులను భయపెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం సముద్రతీరాలు, హిల్ స్టేషన్లు పర్యాటక కేంద్రాలుగా మారాలంటే, గోవా లాంటి సౌకర్యాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. విశాఖపట్నంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం, హోటళ్లు, రోడ్లు, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు పెంచడం ముఖ్యమన్నారు. ప్రస్తుతం పర్యాటకులు వచ్చినా, స్థానిక నిబంధనలు వల్ల సరదా లేకపోవడం సమస్య అని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీమ్‌లు, చర్చలు జోరుగా సాగుతున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలు సరదాగా చెప్పినవేనని, పర్యాటక స్వేచ్ఛ గురించి మాట్లాడినట్టుగానే అర్థం చేసుకోవాలని కొంత మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ సంఘటన రాష్ట్రంలో పర్యాటక విషయంలో కొత్త చర్చలకు దారితీసిందనే చర్చ కూడా వినిపిస్తోంది.

Read More
Next Story