ఏపీలో భారీ విషాదం..ఆరుగురు మృతి
x

ఏపీలో భారీ విషాదం..ఆరుగురు మృతి

అనకాపల్లి జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం భారీ విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మద్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. అత్యంత బాధాకరమైన ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మరో ఏడుగురు వ్యక్తులు క్షతగాత్రులుగా మారారి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తులను అత్యవసర వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి తరలించారు.

అయితే అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే సహాయక చర్యలకు దిగారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారితో పాటు తీవ్ర గాయాలపాలైన బాధితులంతా కాకినాడ సామర్లకోటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది. ఆరుగురు మృతులలో ఇప్పటి వరకు ముగ్గరిని గుర్తించారు, మృతులను నిర్మల, తాతబాయి, గోవింద్‌గా గుర్తించారు. వీరి వయసు 36 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ భారీ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ బాణసంచా తయారీ కేంద్రానికి మంచి పేరే ఉంది. పెళ్లిళ్లుకు, ఉత్సవాలు, జాతరలు, శుభకార్యాలు వంటి కార్యాల కోసం ప్రత్యేకంగా తారాజువ్వలు, బాంబులు వంటి బాణసంచా తయారు చేస్తుంటారు. అయితే ఆదివారం మ«ధ్యాహ్నం సమయంలో ఈ బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్క సారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడం వల్ల ఈ తయారీ కేంద్రం ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. మరో వైపు దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం స్పందించింది. అగ్నిమాపక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలానికి బయలుదేరారు. దుర్ఘటనై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Read More
Next Story