కోనసీమలో భారీ పేలుడు..ఆరుగురు సజీవ దహనం
x

కోనసీమలో భారీ పేలుడు..ఆరుగురు సజీవ దహనం

ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం గోకులపాడు గ్రామంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. భారీ పేలుడు ధాటికి ఆరుగురు కార్మికులు అక్కడిక్కడే మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం ఉదయం సమయంలో సిబ్బంది బాణాసంచాలు తయారు చేస్తుండగా, ఒక్కసారిగా పేలుడు జరిగి మంటలు ఎగసిపడ్డాయి. ఘటన సమయంలో సుమారు 40 మంది కార్మికులు యూనిట్‌లో పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో షెడ్ గోడలు కూలిపోయాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దుర్ఘటనలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలినవారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రామచంద్రపురం ఆర్‌డీవో అఖిల ఘటనాస్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు.

జిల్లా కలెక్టర్ స్పందన

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తక్షణమే స్పందించారు. వారం క్రితమే ఈ బాణాసంచా యూనిట్‌ను స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి, అన్ని రక్షణ చర్యలు పాటించారని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, అగ్నిప్రమాద నివారణ పరికరాలు సరిగ్గా వాడబడ్డాయా లేదా అనే అంశాన్ని విచారిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలు తేలుస్తామని హామీ ఇచ్చారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఆయన మాట్లాడి, ప్రమాద వివరాలు, క్షతగాత్రుల పరిస్థితి, వైద్య సహాయం, సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తగిన సహాయం అందించాలని, ఘటనాస్థలికి అధికారులు వెంటనే చేరుకోవాలని ఆదేశించారు. హోం మంత్రి అనిత కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు.

Read More
Next Story