వైన్‌ షాపులకు భారీగా టిడిపి తమ్ముళ్ల దరఖాస్తులు
x

వైన్‌ షాపులకు భారీగా టిడిపి తమ్ముళ్ల దరఖాస్తులు

మద్యం దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,742 కోట్లకు పైన ఆదాయం వచ్చింది. చాలామంది టీడీపీ కార్యకర్తలు భారీగా దరఖాస్తులు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో వైన్‌ షాపులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. 9వ తేదీ ఆఖరుగా ప్రకటించినప్పుడు 40వేలకు పైన మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మరో రెండు రోజులు అంటే అక్టోబర్‌ 11తో ముగింపు అని గడువు పెంచగానే సగానికి పైన దరఖాస్తులు వచ్చాయి. అంటే శుశ్రవారం రాత్రి 7గంటలకు 87,116 దరఖాస్తులు వచ్చాయి. కేవలం రెండు రోజుల్లోనే వేలల్లో దరఖాస్తులు పెరగటానికి కారణాలపై ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది.

సీఎం ఏమి చెప్పారు?
తెలుగుదేశం పార్టీ వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పారు? ఎమ్మెల్యేలు చేస్తున్నది ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారనే చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మద్యం షాపుల జోలికి ఎమ్మెల్యేలు ఎవ్వరూ వెళ్లవద్దు. ఏదన్నా ఉంటే నేను మాట్లాడతాను. ఎలా కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే విషయం చర్చించాలి. నాకు ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఉంది. అంతే కాని వైన్‌ షాపుల గురించి ఆలోచించ వద్దని చెప్పారు.
ఎమ్మెల్యేలు చేసిందేమిటి?
ఎన్నికల సమయంలో తనను నమ్ముకుని తనతో పాటు ఊరూరా ముఖ్య కార్యకర్తలు తిరిగారు. నన్ను గెలిపించేందుకు పడరాని పాట్లు పడ్డారు. మా పరిస్థితి ఏమిటని వారు ఇప్పుడు అడుగుతున్నారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా అనుకున్నది చేయాల్సిందే. లేకుంటే నాతో పాటు నడిచేందుకు కార్యకర్తలు మిగలరు. ఇప్పుడు జగన్‌కు జరిగింది అదే. ఆ పరిస్థితి మాకు రాకూడదు అనుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. బ్రాంది షాపులకు డిపాజిట్లు చెల్లిచే విషయంలో ఎమ్మెల్యేలే చొరవ తీసుకున్నారు. వారే డబ్బులు ఇచ్చి పది మంది చేత షాపులకు దరఖాస్తులు చేయించారు.
షాపు వస్తే దాని ఆదాయం మీదే..
షాపు లాటరీలో వచ్చిందంటే దానిపై వచ్చే ఆదాయం మీదే. నాకొద్దు... కానీ ఎప్పుడూ నాకు నమ్మిన బంట్లుగా ఉండాలి. అందుకే మీకు ఆదాయం చూపిస్తున్నాను. అంటూ పలు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు చెప్పటం విశేషం. తనతో ఉండే ముఖ్యులైన పది మంది పేర్లతో ఒక షాపుకు దరఖాస్తు చేస్తే వారిలో ఒక్కరికైనా లాటరీ తగలకుండా ఉంటుందా అనే ధీమా వారిలో ఉంది.
ఇదే మీకు ఆదాయ వనరు...
ప్రభుత్వం నుంచి నామినేషన్‌ వర్కులు కూడా లేవు. ఎందుకంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. అందుకే నాతో ఉన్నారు కాబట్టి మీకు ఏదో ఒక ఆదాయ వనరు చూపించాలి. అందులో భాగంగానే మద్యం షాపులకు దరఖాస్తులు చేయాలని చెబుతున్నాను. మీరు దరఖాస్తు చేయండి. నేను డిపాజిట్‌ కడతాను. పోతే పోనివ్వండి. వచ్చినవే మనవి. ఒకరికి షాపు వస్తే ఐదు నుంచి పది మంది బతకొచ్చు, అంటూ పలువురు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు ఉద్భోద చేశారు. దీంతో కేవలం రెండు రోజుల్లో సుమారు 50వేల దరఖాస్తులు అదనంగా దాఖలయ్యాయి. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో టీడీపీ ముఖ్య కార్యకర్తలకు ఒక మంత్రి తానే డబ్బులు కట్టి షాపులకు దరఖాస్తులు వేయించినట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దానిని ఆ మంత్రి కూడా ఖండించలేదు. మంత్రే డబ్బులు కట్టారని, షాపులు వస్తే ఏడాది పొడవునా పది మంది బతకొచ్చని ఆ మంత్రి చెప్పినట్లు పలువురు ముఖ్య కార్యకర్తలు తమ సహచరులతో చెబుతున్నట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది.
కృష్ణా జిల్లా గుడివాడలోనూ ఇదే పరిస్థితి...
తనకోసం కష్టపడి పనిచేసిన వారికి బ్రాంది షాపుల లైసెన్స్‌లు ఇప్పిస్తానని ముందుగానే కొందరు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చిన ట్లు ఆరోపణలు ఉన్నాయి. దానికి తగినట్లు తొమ్మిదో తేదీ నాటికి గుడివాడలో కనీసం షాపుకు రెండు దరఖాస్తులు కూడా దాఖలు కాలేదు. ప్రతి మండలానికి ఒక కార్యకర్తను ఏర్పాటు చేసి ఎవరు మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేస్తున్నారో వారి వివరాలు చెప్పాలని టీడీపీ నాయకులు కొందరు ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. రెండు రోజులు ఎక్సైజ్‌ శాఖ వారు దరఖాస్తులు తీసుకునే గడువు పొడిగించడంతో తన అనుచరులను రంగంలోకి దించిన ఎమ్మెల్యే వర్గీయులు 123 షాపులకు 2,810 దరఖాస్తులు దాఖలు చేశారు. ఈ వ్యవహారం మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి పోయినట్లు టీడీపీలోని కొందరు ముఖ్య నాయకులు చెప్పుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయని జిల్లాలో చర్చ జరుగుతోంది. 136 షాపులకు 3,178 దరఖాస్తులు దాఖలయ్యాయి. కర్నూలు జిల్లాలో99 షాపులకు 3,007 దరఖాస్తులు రావడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందని స్థానికులు అంటున్నారు.
డిపాజిట్‌ డబ్బులు పోయినా పరవాలేదు..
ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. సాదారణ వ్యక్తులు ఈ డిపాజిట్‌ పోగొట్టుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇష్ట పడరు. అయితే కొందరు ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో వేయిస్తున్నందున డిపాజిట్‌ డబ్బు సంగతి తర్వాత చూసుకుందాం. ముందు మనకు మద్యం షాపు రావాలంటూ కొందరి పేర్లపై డిపాజిట్లు కట్టి దరఖాస్తులు చేశారు. షాపు వస్తే గ్రామాల్లో ఆరు వాయిదాల్లో రెండేళ్లలో రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. స్థానికంగా ఉండే ఎక్సైజ్‌ వారిని మ్యానేజ్‌ చేసుకుంటే చాలు మనం లాభాల్లోకి వెళతాం. మీకు నేనున్నాను. రంగంలోకి దిగండని మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు కార్యకర్తలను ప్రోత్సహించినట్లు తెలిసింది. దీంతో ఒక విధంగా మద్యం సిండికేట్లు ఎక్కడో లేరు... ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనే ఉన్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
కూటమిలో గొడవలు
చాలా వరకు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో చాలా మంది జనసేన నాయకులు, కార్యకర్తలు మా పరిస్థితి ఏమిటని టీడీపీ వారిని అడుగుతున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి ఉత్పన్నమైందని, మీ విషయం తర్వాత చూద్దామంటూ తెలుగుదేశం పార్టీ వారు దాట వేత ధోరణిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఏజిల్లాలో ఎన్ని దరఖాస్తులు..
శ్రీ సత్యసాయి జిల్లాలో 87 షాపులు ఉండగా 1,399 దరఖాస్తులు వచ్చాయి. అలాగే తిరుపతి జిల్లాలో 227 షాపులకు 3,659 దరఖాస్తులు, బాపట్ల జిల్లాలో 117 షాపులకు 2,064 దరఖాస్తులు, అన్నమయ్య జిల్లాలో 111 షాపులు ఉండగా 2,106 దరఖాస్తులు వచ్చాయి. ప్రకాశంలో 171 షాపులు కాగా 3,397 దరఖాస్తులు, పల్నాడు జిల్లాలో 129 షాపులు ఉండగా 2,577 దరఖాస్తులు వచ్చాయి. నంద్యాల జిల్లాలో 105 షాపులు ఉండగా 2,155 దరఖాస్తులు, కాకినాడ జిల్లాలో 155 షాపులకు 3,204 దరఖాస్తులు వచ్చాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 182 షాపులు వుండగా 3,791 దరఖాస్తులు, చిత్తూరు జిల్లాలో 104 మద్యం దుకాణాలు ఉండగా 2,242 దరఖాస్తులు, అనంతపురం జిల్లాలో 136 దుకాణాలు ఉండగా 3,022 దరఖాస్తులు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 139 మద్యం దుకాణాలు ఉండగా 3,169 దరఖాస్తులు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 123 దుకాణాలు ఉండగా 2,810 దరఖాస్తులు, అనకాపల్లి జిల్లాలో 136 దుకాణాలు ఉండగా 3,178 దరఖాస్తులు, విశాఖపట్నం జిల్లాలో 155 దుకాణాలకు 3,890 దరఖాస్తులు, పార్వతీపురం మన్యం జిల్లాలో 52 దుకాణాలకు 1,375 దరఖాస్తులు అందాయి. శ్రీకాకుళం జిల్లాలో 158 దుకాణాలకు 4,551, అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు) 40 షాపులకు 1,179 దరఖాస్తులు వచ్చాయి. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 133 దుకాణాలకు 3,980 దరఖాస్తులు, కర్నూలు జిల్లాలో 99 షాపులకు 3,007 దరఖాస్తులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 175 దుకాణాలకు 5,362 దరకాస్తులు, తూర్పుగోదావరి జిల్లాలో 125 షాపులకు 4,289 దరఖాస్తులు, విజయనగరం జిల్లాలో 153 దుకాణాలకు 5,235 దరఖాస్తులు, గుంటూరు జిల్లాలో 127 దుకాణాలకు 4,372 దరఖాస్తులు, ఏలూరు జిల్లాలో 144 షాపులకు 5,339 దరఖాస్తులు, ఎన్‌టీఆర్‌ విజయవాడ జిల్లాలో 113 షాపులకు 5,764 దరఖాస్తులు అందాయి. మొత్తం మీద 3,396 మద్యం షాపులకు 87,116 దరఖాస్తులు వచ్చాయి.
Read More
Next Story