
వామ్మో..ఎంత గంజాయో చూడండి..ఎక్కడంటే
సీజ్ చేసిన 112 కిలోల గంజాయి విలువ రూ. 5.60 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున 112 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఈ కేసు వివరాలను వెల్లడించారు.
వాహన తనిఖీల్లో దొరికిన కేటుగాడు
ఈనెల 16వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో గన్నవరం ఎస్సై తన సిబ్బందితో కలిసి బి.బి.గూడెం అండర్‌పాస్ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒరిస్సా రిజిస్ట్రేషన్ (OD02 BC 3555) కలిగిన తెల్ల రంగు క్రెటా కారులో వస్తున్న వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు వాహనాన్ని నిలువరించి తనిఖీ చేయగా, కారులో ఒక్కోటి కేజీ చొప్పున ఉన్న 112 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీని విలువ సుమారు రూ. 5,60,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
పూణే నుంచి ఒరిస్సాకు..అక్కడి నుంచి స్మగ్లింగ్
పట్టుబడ్డ నిందితుడిని మహారాష్ట్రలోని పూణేకు చెందిన దీపక్ తుపే (39) గా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పూణేకు చెందిన వైష్ణవి లవన్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు, ఒరిస్సాలోని బలంగీర్ వెళ్లి అక్కడ రాజ్ కుమార్, సురాన్ కర్ణ అనే వ్యక్తుల వద్ద ఈ గంజాయిని కొనుగోలు చేసి పూణేకు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. నిందితుడిపై గన్నవరం పీఎస్ లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.
సిబ్బందికి రివార్డులు - ఎస్పీ ప్రశంసలు
అక్రమ రవాణాను చాకచక్యంగా పసిగట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించి, వారికి రివార్డులను అందజేశారు.
1972 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వండి
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, మాదకద్రవ్యాల విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉందని హెచ్చరించారు. గంజాయి రవాణా చేసేవారే కాకుండా, విక్రయించే వారు, సహకరించే వారిపై కూడా ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 'ఈగల్ టీం' 1972 హెల్ప్‌లైన్ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వి.వి. నాయుడు, సత్యనారాయణ, గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు శివ ప్రసాద్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

