టీడీపీని వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది?
అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీని, బీజేపీని, జనసేనను జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొంటారు, మాట్లాడేందుకు సమయం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షమైన టీడీపీని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఎలా ఎదుర్కొంటుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉండటం, వైఎస్‌ఆర్‌సీపీకి తక్కువ సంఖ్యలో ఉండటంతో అధికార పక్ష దాడిని వైఎస్‌ఆర్‌సీపీ ఎదుర్కొని నిలబడుతుందనేది చర్చగా మారింది.
ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న కూటమి భాగస్వాములైన టీడీపీకి 135 మంది సభ్యులు ఉండగా, జనసేనకు 21, బీజేపీకి 8 మంది సభ్యులు ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి కేవలం 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కలిపి 164 సభ్యులు ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కంటే 153 మంది సభ్యులు అధికంగా ఉన్నారు.
ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. శాసన సభ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేయనున్నారు. తర్వాత గవర్నర్ ప్రసంగంపై చర్చ చేయనున్నారు. ఈ సమావేశాల్లోనే ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వచ్చే ఐదు మాసాలకు అవసరమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వీటితో పాటుగా శ్వేత పత్రాల విడుదలకు కూడా అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్, మైనింగ్ రంగాలపై నాలుగు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్కిన శాంతి భద్రతలు, ఎక్సైజ్, ఆర్థిక రంగాలకు సంబంధించి మూడు శ్వేత పత్రాలను ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టి చర్చ జరపాలని భావిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు వైఎస్‌ఆర్‌సీపీ దూరంగా ఉంటుందని అధికార పక్షం భావించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన తొలి సమావేశాల్లో జగన్ ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్లి పోవడం, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారి ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వెళ్లి పోవడం, రెండో రోజు జరిగిన సమావేశానికి జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పాల్గొనక పోవడంతో ఈ సారి సమావేశాలకు కూడా జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటారని అధికార పక్షంతో పాటు రాజకీయ వర్గాలు కూడా భావించాయి. కానీ అంచనాలను తారు మారు చేస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానుంది. వినుకొండ పర్యటనలో స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వమే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రభుత్వ పాలన తీరును అడ్డుకొని తీరుతామని, దీని కోసం అసెంబ్లీ సమావేశాలలో పాల్గొని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో అధికార పక్షానికి ఒక్క సారిగా షాక్ తగిలినటై్టందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
జగన్‌ను, ఆయన పార్టీ ఎమ్మెల్యేలను సమావేశాల్లో ఎలా కట్టడి చేఆయలనే దానిపై అధికార పక్షం కసరత్తు చేస్తోంది. జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న సంఘటనలు, టీడీపీ శ్రేణులపై అరాచకాలు జరిగాయని వీటిని ప్రస్తావించడంతో పాటు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుందనే దానిపైన, మూడు శ్వేత పత్రాలను ప్రవేశపెట్టి వాటి పై జరిగే చర్చల ద్వారా వైఎస్‌ఆర్‌సీపీని ఇరుకున పెట్టాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ పాలన తీరుపైన ప్రస్తావించడం, సీఎం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న హింసపై ప్రధాన అంశంగా ప్రస్తావన చేయాలని వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం.
అధికార పక్షంతో పోల్చితే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో పెద్దగా వాగ్దాటి ఉన్న వారు లేరు. 11 మంది సభ్యులున్నా ప్రభుత్వాన్ని నిలువరించే బాధ్యంతా జగన్‌పైనే పడే అవకాశం ఉందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా ఆయనకు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేంత వాగ్దాటి లేదని, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి పరిస్థితి కూడా అంతేననే టాక్ ఆ పార్టీలో సాగుతోంది. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, బద్వేలు ఎమ్మెల్యే దాసరిç Üుధ, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిలు అధికార పక్షాన్ని ఎలా నిలువరిస్తారనేది చూడాలనే టాక్ నడుస్తోంది. మొత్తమ్మీద ఈ సారి ఎన్నికైన 11 ఎమ్మెల్యేల్లో వాగ్దాటి కలిగి ఉండి, అన్ని అంశాలపై అవగాహనతో మాట్లాడే వారు తక్కువ ఉండటం జగన్‌కు ఒక మైనస్‌గానే భావించొచ్చు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో ప్రజలకు ఉపయోగ పడిన విధంగా చర్చలు సాగింది లేదు. అధికా పక్షం ప్రతిపక్షాన్ని నోరెత్తకుండా చేయడం, మాట్లాడేందుకు సమయం కూడా కేటాయించక పోవడం, రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం వంటి కార్యక్రమాలతోనే సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ సారి కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండవనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Next Story