ఈ పథకాలను చంద్రబాబు ఎలా అమలు చేస్తారు?
x

ఈ పథకాలను చంద్రబాబు ఎలా అమలు చేస్తారు?

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి అప్పులమయమైంది. అలివిగాని హామీలిచ్చారు. కేంద్రం నుంచి సాయం అంతంత మాత్రమే. నిధులు ఎలా తెస్తారు? ఎలా అమలు చేస్తారు?


సూపర్‌ సిక్స్‌ అంటూ డీబీటీ పద్దతి ద్వారా ప్రజలకు ఉచితంగా సాయం అందించే పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేసేందుకు హామీలిచ్చింది. అయితే ఈ సూపర్‌ సిక్స్‌ పథకాలు నేటికీ అమల్లోకి రాలేదు. గత ప్రభుత్వం ఇలాంటి ఉచిత నగదు పంపిణీ పథకాలతో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పథకాన్ని కూడా చేపట్ట లేక పోయింది. అలాంటి హామీలే ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత నగదు పంపిణీ పథకాలను ఎలా అమలు చేస్తుందనేది ప్రజల్లో చర్చకు దారి తీసింది. సక్సెస్‌ఫుల్‌గా పరిపాలన చేశారనిపించుకోవాలంటే ప్రజలకు నిత్యం అందుబాటులో పని ఉండాలి. సుఖ శాంతులతో జీవించాలి. అప్పుడే పాలనలో నాయకుడు సక్సెస్‌ అయినట్లుగా చెప్పొచ్చని రాజనీతిజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ సుమారు రూ. 2.50లక్షల కోట్లు. అయితే ఎన్నికలకు ముందు 2024–25 ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ. 2.86లక్షల కోట్లుగా చూపించారు. 2023–24 సాధారణ బడ్జెట్‌ 2.28లక్షల కోట్లు మాత్రమే ఉంది. కేవలం ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఇంత భారీగా పెంచాల్సి వచ్చిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి కూడా నెలకొంది. నాలుగు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జూలై ఆఖరుతో ఈ బడ్జెట్‌ కాలపరిమితి ముగుస్తుంది. సహజంగా ఏ ప్రభుత్వమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేటప్పుడు రాబడులు, ఖర్చులను దృష్టిలో పెట్టుకుంటుంది. రాబడులు ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.75లక్షల కోట్లకు మించడం లేదని, ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక శాఖ అధికారులు కూడా ఇదే విషయాన్ని దృవీకరిస్తున్నారు. అయినా భారీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా భారీ స్థాయిలో అప్పులు కూడా చేయొచ్చని పాలకులు స్పష్టం చేస్తున్నారు. అప్పులను కూడా రాబడుల రూపంలో చూపించి ఖర్చు చేయడం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పాలకులకే చెల్లింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తిపై రూ. 2లక్షలకు పైగా అప్పుల భారం ఉంది. ఆలోచించే వారు ఇదేమి పాలన అంటూ బాధను వ్యక్తం చేయడం తప్ప ఎవరికి ఏమీ చెప్పలేక పోతున్నారు. ఆ గోల మాకెందుకనుకునే వాళ్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా విషయంపై అసలు మాట్లేందుకు కూడా ఇష్టపడటం లేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు రూ. 86వేల కోట్లు వరకు జీత భత్యాల కింద ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో పెన్షనర్లు కూడా ఉన్నారు. గత ప్రభుత్వం డీబీడీ పద్దతి ద్వారా సుమారు రూ. 60వేల కోట్లు ఖర్చు చేసేందుకు అంచనా వేసింది. అయితే చివరకు ఖర్చు చేసింది రూ. 25వేల కోట్లు మాత్రమే. దీని కోసం ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. ప్రభుత్వానికి వస్తున్న రాబడిలో పన్నుల రూపేణ కేంద్రం వసూలు చేసిన జీఎస్టీ నుంచి సుమారు రూ. 80వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లెక్కలు చెబుతున్నాయి. ఇవే కాకుండా స్థానిక సంస్థల ద్వారా మిగిలిన పన్నులను వసూలు చేస్తుంది. అయినా ఉచిత పథకాలు అమలు చేయడం తలకు మించిన భారంగానే తయారైంది.
సంపద పెరిగితేనే..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలు అనుకున్న మేర అమలు కావాలంటే సంపద పెరగాలి. సంపద పెరగాలంటే నీటి పారుదల రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంపై ఎక్కువుగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆదాయ పెరుగుదల పథకాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నిరుద్యోగులకు అలాంటి పథకాలను ప్రవేశపెట్టి ఆదాయాన్ని పెంపుదల అయ్యే విధంగా చూడాలి. అప్పుడే సూపర్‌ సిక్స్‌ పథకాలకు కాస్త వెసులు బాటు వస్తుంది. ఇవి జరగాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఒక్క రోజులో సంపదను పెంచడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అమరావతిని నిర్మించడం ద్వారా సంపద పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా.. అది కూడా కనీసం 10 ఏళ్ల ప్రణాళిక. ఈ పదేళ్లల్లో రకరకాల సంస్థలను రప్పించి వాటి ద్వారా ఇన్‌కం జనరేషన్‌ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండా ముందు చూపు ఆలోచనలు చేయకుండా సూపర్‌ సిక్స్‌ పథకాలను ఎలా అమలు చేస్తారనే చర్చ రాష్ట్రంతో పాటు దేశంలోను జరుగుతుండటం విశేషం.
హోదా వస్తే సాధ్యమే
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చినా లేదా ప్రత్యేక ప్యాకేజీల రూపంలో భారీగా నిధులను కేంద్రం కేటాయించినా.. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు సాధ్యమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వోద్దని నీతి ఆయోగ్‌ చెప్పినట్లు దుష్ప్రచారం జరుగుతోంది. బీజేపీ అనుకుంటే ఎన్డీఏ కూటమి ద్వారా ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెద్ద పని కాదు. యుపి, బీహార్‌ల అభివృద్ధికి ఇప్పటికే రూ. 2లక్షల కోట్లను ప్రకటించింది కేంద్రం. సుమారు రూ. 50వేల కోట్ల విలువైన పనులు బీహార్‌లో చేపట్టేందుకు కేంద్ర బడ్జెట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15వేల కోట్లు అప్పుగా ఇప్పిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించి నిధుల్లేని హామీలు మరో మూడు ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పిందే తప్ప ఎంత మొత్తం అనేది ప్రకటించ లేదు. బుందేల్‌ఖండ్‌కు ఏ ప్యాకేజీ ఇస్తారో అలాంటి ప్యాకేజీనే ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇవ్వాలని ఇది వరకే నాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయినా ప్యాకేజీ ఏమిటో, వెనుకబడిన ప్రాంతాలను ఎలా డెవలప్‌ చేస్తారో స్పష్టం చేయలేదు. పులిపై ఎక్కాక స్వారీ చేయాల్సిందే తప్ప దిగితే అక్కడే ఆ పులి చంపేస్తుందన్న సామెతను పలువురు మేధావులు చెప్పుకోవడం విశేషం.
మేకప్‌ వేయాల్సిందే..
ఉచిత పథకాలను అమలు చేయాలంటే మేకప్‌ వేయాల్సిందే అని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం అన్నారు. ఉచిత పథకాలు అమలు చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పెట్టాల్సిందనని, వాటి వల్ల లబ్ధిదారుల ఎంపికలో ఫిల్టర్‌ అవుతుందని, దీంతో ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. గ్రాంట్ర్‌ రూపంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మేరకు నిధులు ఇస్తుందని, అయినా పథకాల అమలుకు నిధులు తక్కువైతే అప్పులు తెస్తారని అభిప్రాయపడ్డారు. ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు.
Read More
Next Story