
కోడలి చేతిలో హతమైన అత్త కనక మహాలక్ష్మి
ఇంట్లో ఈజీగా చంపడం ఎలా?
విశాఖలోని ఓ కోడలు తన అత్తను హతమార్చడం కోసం యూ నెట్‌లో శోధించి చంపేసింది.
అతివల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. వీరి అఘాయిత్యాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రియుళ్ల మోజులో పడి భర్తలను హతమారుస్తున్న భార్యలను చూస్తున్నాం. ఇప్పుడో కోడలు తన అత్తను చంపడానికి ఏకంగా నెట్‌లో బ్రౌజింగ్ చేసి చంపేసింది. ఆమె రక్తి కట్టించిన నాటకం వికటించి చివరకు పోలీసులకు చిక్కింది. ఈ అమానవీయ ఘటన విశాఖలో జరిగింది. అదేమిటో చూద్దాం!
అత్తను అంతం చేసిన కోడలు లలిత
దొంగా పోలీస్ ఆటగా నమ్మించి..
విశాఖలోని పెందుర్తి అప్పన్నపాలేనికి చెందిన జయంతి కనక మహాలక్ష్మి (66) తన కుమారుడు, కోడలితో కలిసి ఉంటోంది. కుమారుడు సుబ్రహ్మణ్యశర్మ పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. కొన్నాళ్లుగా అత్తతో కోడలు లలితకు పొసగడం లేదు. తరచూ ఇద్దరూ చిన్న చిన్న గొడవలు పడడం, మళ్లీ సర్దుబాటు చేసుకోవడం జరుగుతున్నాయి. చీటికీ మాటికీ అత్త తనను చికాకు పెడుతోందని, ఎలాగైనా ఆమెను హతమర్చాలని కోడలు నిర్ణయించుకుంది. అప్పట్నుంచి అత్తతో సామరస్యంగా నడుచుకుంటున్నట్టు నటిస్తూ వచ్చింది. ఆపై ఆత్తను ఎలా చంపాలని కొన్నాళ్లు ఆలోచించింది. చివరకు ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేస్తే తనకు ఆ ప్లాన్ దొరుకుతుందని భావించింది. ‘ఇంట్లోనే ఈజీగా చంపడం ఎలా’ అంటూ పలుమార్లు బ్రౌజింగ్ చేసింది. చివరకు ఆ బ్రౌజింగ్ సాయంతో అవగాహన పెంచుకుంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న అత్తను ‘అత్తమ్మ గారూ.. అత్తమ్మ గారూ..’అంటూ ఆప్యాయంగా పిలిచింది. ‘ఏమ్మా లలితా’ అంటూ ఆ అమాయక అత్త కోడలి వద్దకు వచ్చింది. మనిద్దరం దొంగా.. పోలీసు ఆటాడుకుందాం. మీరు కుర్చీలో కూర్చొండి.. నేను మీ కళ్లకు గంతలు కట్టేస్తాను. కాళ్లూ చేతులూ కూడా తాళ్లతో కడతాను’ అని నమ్మబలికింది. అందుకు ఆ అత్త ఆనందంతో సై అంది. అంతే తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం అత్తను కుర్చీలో కూర్చోబెట్టింది. తాళ్లతో కాళ్లూ చేతులను కట్టేసి, కళ్లకు గంతలనూ కట్టింది. కాసేపు దొంగా పోలీసు.. అంటూ నటించింది. ఇంట్లో అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న పెట్రోల్‌ను తెచ్చి అత్తపై పోసింది. ఆ వెంటనే ఇంట్లో దేవుడి గదిలో వెలుగుతున్న దీపాన్ని ఆమెపైకి విసిరేసింది. దీంతో అత్త కనక మహాలక్ష్మి మంటల్లో కాలిపోతూ అరుపులూ కేకలూ వేసింది. ఆమె తగులబడి పోతుండగా ఇంటి తలుపులు వేసి బయటకు వచ్చేసి ‘మా అత్తమ్మ మంటల్లో కాలిపోతోంది..’ అంటూ గట్టిగా ఏడుస్తూ అందరినీ నమ్మించింది లలిత. అక్కడి వారంతా అత్త కనకమహాలక్ష్మి ప్రమాద వశాత్తూ మంటల్లో చిక్కుకుందని భావించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కాసేపటికే అత్త పూర్తిగా కాలిపోయి మరణించింది.
నెట్‌లో ఆరుసార్లు బ్రౌజింగ్ చేసి..
తొలుత కోడలు లలితపై ఎవరికీ అనుమానం రాలేదు. దీంతో తొలుత పెందుర్తి పోలీసులు అగ్ని ప్రమాద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై ఓ కన్నేశారు. మరోవైపు భర్త సుబ్రహ్మణ్యశర్మకు కూడా తన భార్యపై ఒకింత అనుమానం వచ్చింది. అదే అనుమానాన్ని పోలీసుల చెవిలో వేశాడు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. తమదైన శైలిలో కోడలు లలితను విచారించడంతో అత్తను తానే హతమార్చినట్టు అంగీకరించడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఎలా చంపావు తల్లీ! అని ప్రశ్నించిన పోలీసులకు ఆమె మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ‘మా అత్తగారిని చంపడానికి.. ఇంట్లోనే ఈజీగా చంపడం ఎలా?’ అంటూ నెట్‌లో సెర్చ్ చేశాను. చివరకు దొంగా పోలీసు ఆటగా నమ్మించి కుర్చీకి కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, పెట్రోల్ పోసి చంపేసినట్టు వెల్లడించింది. దీంతో పోలీసులు ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలిస్తే.. అత్తను హతమార్చడానికి వీలుగా ఆరుసార్లు బ్రౌజింగ్ చేసినట్టు గుర్తించారు. నిందితురాలిని అరెస్టు చేశారు.
మనవరాలికి సైతం గాయాలు..
కోడలు లలిత అత్తను చంపే సమయంలో తన ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నాన్నమ్మ మంటల్లో కాలిపోతున్న సంగతి తెలుసుకుని మనవరాలు పరుగు పరుగున వచ్చి ఆర్పేందుకు ఆ చిన్నారి ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నంలో ఆ బాలిక కూడా స్వల్పంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విశాఖ నగరంలో ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
Next Story

