వైకుంఠ ద్వార దర్శనాలు: టోకెన్ల జారీ
x

వైకుంఠ ద్వార దర్శనాలు: టోకెన్ల జారీ

మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ


చివరి ఏడు రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వదర్శనం

మొదటి మూడు రోజుల్లో SED, శ్రీవాణి దర్శనాలు రద్దు
స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో SSD టోకెన్ల జారీ నిలిపివేత
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు వివరాలు ఇలా ఉన్నాయి.
ఎల‌క్ట్రానిక్‌ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ
వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎల‌క్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ స‌భ్యులంద‌రికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.
నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎల‌క్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం
మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎల‌క్ట్రానిక్‌ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎల‌క్ట్రానిక్‌ డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి.
వాట్సాప్ బాట్ లో నమోదు చేసుకునే విధానం
వాట్సాప్ బాట్ ద్వారా ఎల‌క్ట్రానిక్‌ డిప్ రిజిస్ట్రేష‌న్ న‌మోదు చేసుకునే భ‌క్తులు ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వీసెస్ నెంః 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంత‌రం ఇంగ్లీష్‌, తెలుగు భాష‌ల‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాలి.
అనంత‌రం మీరు ఎంచుకున్న భాష‌లో స‌ర్వీసెస్ విండో క‌నిపిస్తుంది. ఆ స‌ర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ స‌ర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. త‌ర్వాత టీటీడీ టెంపుల్ స‌ర్వీసెస్‌ ఓపెన్ చేయ‌గానే వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం (డిప్‌) రిజిస్ట్రేష‌న్ అనే ఆప్ష‌న్ వ‌స్తుంది. ఇక్క‌డ ఇంగ్లీష్‌, తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌లను ఎంపిక చేసుకుని క‌న్ఫ‌ర్మ్ చేయాలి. త‌ర్వాత చిరునామా, పిన్ కోడ్ న‌మోదు చేయాలి.
అనంత‌రం డిసెంబ‌ర్ 30, 31, జ‌న‌వ‌రి 1వ తేదిల్లో మీకు ద‌ర్శ‌నం కావాల్సిన రోజుల‌ను లేదా మూడు రోజుల‌ను ప్ర‌యారిటీగా ఎంపిక చేసుకోవ‌చ్చు. త‌ర్వాత భ‌క్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వ‌య‌స్సు, లింగం, ఆధార్ నంబ‌ర్, మొబైల్ నంబ‌ర్‌ న‌మోదు చేయాలి. ఆ త‌ర్వాత వివ‌రాల‌ను స‌రి చూసుకుని SUBMIT చేయాల్సి ఉంటుంది. ఒక‌సారి న‌మోదు చేసిన పేర్ల‌ను మార్చ‌డానికి వీలు ప‌డ‌దు.
ఆధార్ నంబ‌ర్‌, పిన్ కోడ్ ను త‌ప్పుగా న‌మోదు చేస్తే మార్చుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. భ‌క్తుల వివ‌రాలు విజ‌య‌వంతంగా SUBMIT చేయ‌గానే ACKNOWLODGEMENT మెసేజ్ వ‌స్తుంది. ఆ మెసేజ్ రిఫ‌రెన్సు నెంబ‌ర్ గా ప‌రిగ‌ణించ‌డం జ‌రుగుతుంది. మొబైల్ నెంబ‌ర్, ఆధార్ కార్డుకు ఒక‌సారి మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్ కు అవ‌కాశం ఉంటుంది.
మొదటి మూడు రోజులు SED, శ్రీవాణి దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో SED, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణి ద‌ర్శ‌న టికెట్లు జారీ చేయబడవు.
పది రోజుల పాటు తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత
వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది.
జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వ దర్శనం
వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేయడమైనది.
జనవరి 2 నుండి 8వ తేది వ‌ర‌కు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ
వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు దర్శనం
జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10 తేదిన ఆన్ లైన్ లో విడుదల చేయబడతాయి. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు.
స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం
వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడమైనది.
ఆన్ లైన్‌ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం
రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాత‌లు వారి కుటుంబ స‌భ్యుల‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు రోజుకు 125 మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. రూ.ల‌క్ష నుండి రూ.99 ల‌క్ష‌ల వ‌ర‌కు విరాళం ఇచ్చిన దాత‌ల‌కు డిసెంబ‌ర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి, జ‌న‌వ‌రి 1వ తేది నుండి 8వ తేది వ‌ర‌కు రోజుకు 2వేల మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. వీరు కూడా ఆన్ లైన్‌ అప్లికేష‌న్ లో డిసెంబ‌ర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్ల‌ను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాల‌ను గ‌మ‌నించి స‌హ‌క‌రించాల్సిందిగా భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.


Read More
Next Story