
‘ప్రసాద్ పథకం’కు కేంద్రం నుంచి నిధులు ఎలా పొందాలి: మంత్రి ఆనం
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అంశాలపై మంత్రి ఆనం అధికారులతో సమీక్షించారు.
తీర్థయాత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాల పునరుజ్జీవనం–ఆధ్యాత్మిక అభవృద్ధి ప్రధాన లక్ష్యంగా నిర్థేశించిన ‘ప్రసాద్ పథకం’ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు పొందాలనే దానిపై ఏపీ దేవాదాయ శాఖ తర్జభర్జనలు పడుతోంది. ఈ అంశాలపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కనక దుర్గమ్మ ఆలయాభివృద్ధికి కూడా నిధులు కేంద్రం నుంచి ఎలా తీసుకొని రావాలనే దానిపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, కనక దుర్గ దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తదితర అధికారులతో చర్చంచారు. ప్రసాద్ పథకంకు సంబంధించి నియమ నిబంధనలు మారుతున్నాయని, దానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఎలా రూపొందించాలనే దానిపై చర్చించిన మంత్రి, అందుకు తగిన సూచనలు చేశారు.
ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారీ సమయంలో పర్యాటక శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అటు దేవాదాయ శాఖ, ఇటు పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో ప్రతిపాదనలు రూపొందిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం సులువు అవుతుందని సూచించారు. ఆ దిశగా ఇరు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సనాతన ధర్మాన్ని, వైదిక సంప్రదాయాలను, ఆగమ శాస్త్ర నియమాలను తుంగలో తొక్కాయన్నారు. కూటమి ప్రభుత్వంలో అవన్నీ సక్రమంగా అమలయ్యేదానికి చర్యలు తీసుకోవాలన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లల్లో నిలబడే పరిస్థితులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందుకు అనువుగా వెయిటింగ్ హాల్స్‌ను నిర్మించి అందుబాటులోకి తేవాన్నారు.