ఈ తెలంగాణ పల్లె యూత్ చూపంతా సైన్యం మీదే
x
Kambalapally youth in Services

ఈ తెలంగాణ పల్లె యూత్ చూపంతా సైన్యం మీదే

గ్రామంనుండి ఏకంగా 80 మంది ప్రభుత్వ సర్వీసులో ఉండటం అందులో కూడా 43 మంది దాకా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులోనే పనిచేస్తుండటం చెప్పుకోదగ్గ విశేషమే.


అల్లిమధు ఇంటర్మీడియట్ చదివాడు...పబ్బీజు వెంకన్న డిగ్రీ, సంద భాస్కర్ బీఎస్సీ నర్సింగ్, సీహెచ్ నరేష్ డిగ్రీ, మహ్మద్ ఇంటర్మీడియట్ చదివాడు. వీళ్ళల్లో ఎవరికీ ఏ రూపంలోనూ సారూప్యతలేదు. అయినా సరే వీరంతా ఆర్మీలో చేరారు. ఆర్మీలో చేరటమే వీళ్ళమధ్య సారూప్యత అనుకుంటే పొరబాటే. అంతకుమించినది మరోటుంది. అదేమిటంటే వీళ్ళందరు మహబూబాబాద్ జిల్లా, మండల కేంద్రంలోని కంబాలపల్లి గ్రామస్తులు. అవును, వీళ్ళే కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కంబాలపల్లిలో. ఈ గ్రామానికి చెందిన వాళ్ళు చాలామంది త్రివిధ దళాల్లోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో చేరారు, రిటైర్ అయ్యారు, ఇఫుడు చేరటానికి రెడీ అవుతున్నారు. తెలంగాణలోని మరే గ్రామంలోను లేనివిధంగా ఒక్క కంబాలపల్లిలోనే ఇంతమంది యువత త్రివిధ దళాల్లో చేరటమే ఆశ్చర్యంగా ఉంది.

సుమారు 5 వేలమంది జనాభా ఉన్న ఈగ్రామంలో ప్రభుత్వ సర్వీసుల్లోనే 80 మంది పనిచేస్తున్నారు. ఏగ్రామంలో అయినా ఓ ఐదుమంది లేకపోతే పదిమంది ప్రభుత్వ సర్వీసులో ఉంటే గొప్పగా చెప్పుకోవాలి. అలాంటిది ఈ గ్రామంనుండి ఏకంగా 80 మంది ప్రభుత్వ సర్వీసులో ఉండటం అందులో కూడా 43 మంది దాకా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులోనే పనిచేస్తుండటం చెప్పుకోదగ్గ విశేషమే. త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవచేయటంలో కంబాలపల్లి యువత పోటీలుపడుతుంటమే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే సైన్యంలో చేరటానికి ఉత్తరాధి రాష్ట్రాలు పంజాబ్(Punjab), రాజస్ధాన్, హర్యానా(Haryn), పశ్చిమబెంగాల్, గుజరాత్(Gujarat) యువత ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారన్న విషయం తెలిసిందే.

ఎందుకంటే, పాకిస్తాన్(Pakistan) సరిహద్దుల్లో ఉన్న పైరాష్ట్రాల జనాలకు సైన్యంతో మానసిక బంధముంటుంది. తమ కుటుంబాల్లోని తాతలు, తండ్రులు కూడా సైన్యంలో చేరి వివిధ హాదాల్లో పనిచేయటం లేదా పనిచేస్తుండటంతో యువత కూడ వాళ్ళదోవలోనే ప్రయాణించాలని నిర్ణయించుకోవటంలో ఆశ్చర్యమేమీలేదు. ఉత్తరాధి రాష్ట్రాలతో పోల్చుకుంటే సైన్యంతో దక్షిణాధి రాష్ట్రాలకున్న మానసిక బంధం తక్కువనే చెప్పాలి. అలాగని సైన్యంలో దక్షిణాధి రాష్ట్రాల వాళ్ళు లేరని కాదు కాని ఉత్తరాధితో రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువనే చెప్పాలి. దక్షిణాధిలోని మిగిలిన రాష్ట్రాల్లాగే తెలంగాణ(Telangana)తో కూడా సైన్యంతో ఉన్న బంధం తక్కువే. అందుకనే తెలంగాణ నుండి సైన్యంలో పనిచేస్తున్న వారిసంఖ్య చాలా తక్కువ. అలాంటిది కంబాలపల్లి గ్రామంనుండే సుమారు 43 మంది సైన్యంలో పనిచేస్తున్నారంటే తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది సైన్యంలో కంబాలపల్లి గ్రామ యువత పనిచేస్తున్నారన్న విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు.

కంబాలపల్లి(Kambalapally youth) యువత ఆర్మీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్టిలరీ, బీఎస్ఎఫ్, ఎస్పీఎఫ్, మద్రాసు రెజిమెంట్, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు తెలంగాణ పోలీసు శాఖతో పాటు టీచర్లుగా పనిచేస్తున్నారు. ఈ గ్రామంనుండి 1980ల్లో మొదటిసారిగా మల్లికంటి కృష్ణయ్య సీఆర్పీఎఫ్ జవానుగా చేరారు. తర్వాత ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది సైన్యంలో చేరుతునే ఉన్నారు. గ్రామంనుండి ఎయిర్ ఫోర్సులో ఎంపికైన మొదటి వ్యక్తి నూకల నరేందర్ రెడ్డి. ఎయిర్ ఫోర్సులో నరేందరరెడ్డి సుమారు 36 ఏళ్ళు పనిచేసి ఫ్లైట్ కమాండర్ హోదాలో రిటైర్ అయ్యారు. ఎయిర్ ఫోర్సులో పనిచేసిన అనుభవంతో ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ పైలెట్ గా పనిచేస్తున్నారు. తన గ్రామంనుండి ఇంతమంది త్రివిధ దళాల్లో పనిచేస్తుండటం పట్ల రెడ్డి సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

కొలిశెట్టి సుధాకర్ ఆర్మీ(Indian Army)లో పనిచేస్తున్నారు. 2001లో సిపాయిగా చేరిన సుధాకర్ తర్వాత లాన్స్ నాయక్, నాయక్, హవాల్దార్ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్ బాధ్యతల్లో ఉన్నారు. 22 ఏళ్ళ క్రితం ఆర్మీలో చేరిన సంద భాస్కర్ ఇపుడు జూనియర్ కమాండెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. తండ్రి మల్లికంటి కృష్ణయ్యను ఆదర్శంగా తీసుకున్ చిన్న కొడుకు మల్లికంటి అవినాష్ కూడా ఆర్మీలోనే చేరి జమ్మూ-కాశ్మీర్ బార్డర్ లోని ఆర్టిలరీ విభాగంలో పనిచేస్తున్నాడు. మల్లికంటి రమేష్ కూడా ఆర్మీలోనే 16 ఏళ్ళ సర్వీసు చేసి రిటైర్ అయ్యాడు. ఇపుడు గంగారం మండలంలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఆర్మీలో హవల్దార్ గా రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

కంబాలపల్లి నుండే ఇంతమంది త్రివిధ దళాల్లో పనిచేయటంపై ‘తెలంగాణ ఫెడరల్’ తో రమేష్ మాట్లాడుతు ‘చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా కనబడని వాతావరణం తమ గ్రామంలోనే ఉంద’న్నారు. ‘సైన్యంలో చేరాలన్న ఆలోచన, పట్టుదల తమ యువతలో చాలా సంవత్సరాలుగా కనబడుతోంద’ని చెప్పారు. సైన్యంలో చేరటానికి 10వ తరగతి అర్హతతో పాటు శారీరక దృఢత్వం, ఎత్తు సరిపోతాయన్నారు. ‘తమ గ్రామంలో ఉన్న స్కూల్ కారణంగా తామంతా చిన్నప్పటి నుండే ఎక్కువగా ఆటలపై ఎక్కువ దృష్టిపెట్టి’నట్లు చెప్పారు. ‘చిన్నప్పటినుండి ఆటలపైన ఎక్కువ దృష్టి ఉండటం వల్ల శారీరక దృఢత్వం, చురుకుదనం తమ గ్రామంలోని యువతలో ఎక్కువగా ఉంటోంద’న్నారు. అలాగే స్కూల్లో టీచర్లు పాఠాలు బాగా చెబుతుండటంతో పాస్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. అందుకనే 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ అయిపోగానే యువత దృష్టి సైన్యంలో చేరటంపై మొదలవుతుందన్నారు.

కుటుంబపరిస్ధితులు కూడా ఇందుకు దోహదపడుతోందన్నారు. ‘ఆర్ధికంగా పెద్దస్ధితిలో లేని కుటుంబాల్లోని యువత సైన్యంలో చేరటానికి మొగ్గుచూపుతు’న్నట్లు అభిప్రాయపడ్డారు. సైన్యంలో చేరిన వాళ్ళకు ప్రారంభంలోనే నెలకు సుమారు 26 వేల జీతం అందుతుందన్నారు. ‘సైన్యంలో చేరితే బస, వసతి, యూనిఫారమ్ అంతా సైన్యమే చూసుకుంటుంది కాబట్టి చేతికి అందే జీతంలో కొంత తమ దగ్గరే ఉంచుకుని మిగిలింది ఇళ్ళకు పంపుతుంటార’ని రమేష్ చెప్పారు. ‘ఒకవైపు దేశానికి సేవచేస్తునే మరోవైపు కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశ్యంతోనే తమ గ్రామంలోని యువత ఎక్కువగా సైన్యంలో చేరటానికి మొగ్గుచూపుతున్న’ట్లు రమేష్ అభిప్రాయపడ్డారు. తాను సైన్యంలో ఉన్నపుడు మద్రాస్ రెజిమెంట్, యూరి, అస్సాం, డెహ్రాడూన్ తో పాటు సరిహద్దుల్లో కూడా పనిచేసినట్లు చెప్పారు.

ఎస్పీఎస్ లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత బేగంపేట ఎయిర్ పోర్టులో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న దిడ్డి మహేందర్ మాట్లాడుతు ‘కార్గిల్ యుద్ధం తర్వాత సైన్యంలో చేరేందుకు తమ గ్రామంలోని యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నా’రని చెప్పారు. ‘4 ఏళ్ళ సర్వీసు మాత్రమే ఉండే అగ్నిపథ్ లో చేరటంపై ఎక్కువ ఆసక్తిచూపటం లేదని సైన్యంలో చేరటానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్న’ట్లు మహేందర్ చెప్పారు. ‘ప్రతిఏడాది నిర్వహించే సెలక్షన్స్ లో 20కి తక్కువకాకుండా తమ గ్రామంలోని యువత పరీక్షలకు హాజరవుతార’ని చెప్పారు.

అందుబాటులోని సమాచారం ప్రకారం 38 మంది ఆర్మీలో, ఇద్దరు నేవీలో, ముగ్గురు ఎయిర్ ఫోర్సులో పనిచేస్తుండగా పదిమంది పోలీసుడిపార్ట్ మెంటులో కానిస్టేబుళ్ళుగా, ఆరుగురు తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలోను, ఇద్దరు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లోను, ఐదుగురు వీవీఐపీలకు గన్ మెన్లుగా పనిచేస్తున్నారు. త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన అశోక్ కూడా స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. గ్రామంలో మొత్తం 15 మంది టీచర్లుండగా ఇందులో ఆరుగురు మహిళలున్నారు. ఐదువేల జనాభా ఉన్న గ్రామంలో 80 శాతం వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. మిగిలిన వారు ఇతర వృత్తులు, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నారు. కార్గిల్ యుద్ధం స్పూర్తితో సైన్యంలో చేరే యువత సంఖ్య ఒక్కసారిగా కంబాలపల్లిలో పెరిగిపోతే తాజా ఆపరేషన్ సిందూర్ తర్వాత తొందరలో జరగబోయే సెలక్షన్స్ లో ఎంతమంది యువత సైన్యంలో చేరటానికి ఆసక్తిచూపుతారో చూడాలి.

Read More
Next Story