వర్గీకరణపై సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తుంది.. వారికేం తెలుసు: కేంద్ర మాజీ మంత్రి
షెడ్యూల్డ్ కులాలు(ఎస్‌సీ) వర్గీకరణ అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్దమంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
షెడ్యూల్డ్ కులాలు(ఎస్‌సీ) వర్గీకరణ అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందంటే అనేక మంది మేధావులు సుప్రీంకోర్టుపై ప్రశంసలు కురిపిస్తునన సమయంలో చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు దేశ సమగ్రతకు విరుద్ధంగా ఉందని, భారత అఖండతను దెబ్బతీసేలా ఉందని ఆయన విమర్శించారు. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోనే ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుబట్టడం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. ఈ రోజు ఢిల్లీలో ఆయన ఈ తీర్పుపై స్పందించారు. భారతదేశ పౌరుడిగా తాను అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నానని ప్రకటించారు. దేశంలోని పేదరికం, కులాల గురించి న్యాయమూర్తులకు తెలియదంటూ వ్యాఖ్యానించారు.
‘న్యాయమూర్తులకేం తెలుసు!’
‘‘సుప్రీంకోర్టు ఉన్న న్యాయమూర్తులు సుసంపన్నులు. వారు పేద వర్గాల గుర్తించి తీర్పు ఇస్తారా? వాళ్లు ఎప్పుడైనా దళిత వాడల్లో తిరిగారా? అక్కడ దళితులు పడే కష్టాలను చూశారా?’’ అని ప్రశ్నించారాయన. ‘‘ఎస్సీ వర్గీకరణపై న్యాయస్థానం అనాలోచిత, తలతిక్క తీర్పు ఇచ్చింది. భారతదేశంలో వెయ్యికిపైగా ఉపకులాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఎలా వర్గీకరణ చేస్తారు. వర్గీకరణ అంశంపై కమిషన్ వేయాలి. అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో క్రిమిలేయర్ ఉందా? సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉంటే.. వారిలో దక్షిణ భారతదేశానికి చెందిన వారు ఐదుగురేనా? మిగిలిన వారంతా ఉత్తర భారతదేశం నుంచే వస్తారా?’’ అని అడిగారు.
ఇదేనా క్రిమిలేయర్ అంటే!
‘‘దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కలుపుకుని సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు ఐదుగురు. అదే ఢిల్లీ, ముంబై నుంచయితే 10 మంది న్యాయమూర్తులు ఉంటారా? ఇదేనా క్రిమిలేయర్ అంటే? ఇక్కడ వర్గీకరణ అనే దానికి తావు ఉండదా’’ అని విమర్శించారు. అనంతరం ప్రధాని మోదీపై కూడా విమర్శలు గుప్పించారు. దేశ సమైక్యతను దెబ్బతీసేలా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. ఇప్పటికే ఆయన రిజర్వేషన్ల జోలికి వెళ్లారని, ఇలానే కొనసాగితే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోదీ కూడా పడుతుందని అన్నారు. అలా జరగకూడదంటే రిజవర్వేషన్ల అంశంలో వేలు పెట్టకుండాలంటూ మోదీనిక సూచించారు.