ఎన్నికల దాడుల్లో ఎవరి పాపం ఎంత?
x

ఎన్నికల దాడుల్లో ఎవరి పాపం ఎంత?

అధికార పక్షానికి ఎంత పాపం ఉందో ఎన్నికల హింసలో ప్రతిపక్షానికి కూడా అంతే పాపం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు కూడా ఇందుకు పూర్తి బాధ్యత వహించాలి.


ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా నివ్వెర పోయేలా చేశాయని సాక్షాత్తు హైకోర్టు వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. వినుకొండకు చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హింసకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై జడ్జిలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లా మాచర్ల, నర్సరావుపేట, గురజాల, తిరుపతి జిల్లా తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పలువురు అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్లు గాయాల పాలయ్యారు. ప్రాణ హాని జరగకపోయినా కత్తులు, గొడ్డళ్లు, కర్రలు, బాంబులు, పెట్రోల్ బాంబులు, రాళ్లు రువ్వుకోవడాలు వంటి సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో జరిగిన సంఘటనలు మరింత కక్షలు పెంచాయి.

సిట్ ఏమి సాధిస్తుంది?

ఘర్షణలకు బాధ్యులైన ముగ్గరు ఎస్పిలు, ఒక కలెక్టర్ ను ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. వీరు కాకుండా ముగ్గరు డిఎస్పిలపై చర్యలు తీసుకుంది. మరో 12 మంది సబార్డినేట్స్ పైనా చర్యలు తీసుకుంది. ఎక్కువ మంది పోలీసులపై ఈ చర్యలు సీఈసీ తీసుకుంది. ప్రధానంగా దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. మాచర్ల, తాడిపత్రి, నర్సరావుపేట, గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టడం వల్లనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయనేది పోలీసుల అనుమానం. ప్రధానంగా ఎన్నికల కమిషన్ అనుమానం. అనుమానం ఏదైనా ఎవరిది తప్పు, ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయమై ఆలోచించిన చీఫ్ ఎన్నికల అధికారులు బాధ్యులపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ ను ఉన్నతాధికారులతో అంటే ఐపిఎస్ లతో ఏర్పాటు చేసేందుకు సిఎస్, డిజిపిలు నిర్ణయించారు. కసరత్తు జరుగుతోంది. శుక్రవారం రాత్రికి సిట్ బ్రుందాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన ఆలోచనల్లో ఉన్నతాధికారులు ఉన్నారు.

ప్రోత్సహించిన వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు

అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఉన్న వారే ఈ దాడులకు పాల్పడ్డారు. తాడిపత్రిలో మాత్రం తెలుగుదేశం, వైఎస్సార్సీపీ వర్గాల వారు రెండు వైపుల నిలబడి రాళ్లు రువ్వుకున్నారు. మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలతో పాటు తిరుగుతున్న వారు రెచ్చిపోయి దాడులు చేశారు. సంఘటనలు జరిగిన రోజు పెద్దగా పట్టించుకోని పోలీస్ ఉన్నతాధికారులు ఈసీ కొరఢా ఝుళిపించడంతో చర్యలకు పూనుకోక తప్పలేదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వారిని హెచ్చరిస్తూ సంఘటనలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని, బాధ్యులను శిక్షించేలా చర్యలు ఉండాలని ఆదేశించడం రాష్ట్ర చరిత్రలో ప్రథమమని పలువురు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్మడు కలిసి అజ్నాతంలోకి వెళ్లినట్లు సమాచారం. తమను రావొద్దని వెళ్లిపోయారంటూ గన్ మెన్ లు పోలీస్ ఉన్నతాధికారుకు సమాచారం అందించారు.

పట్టీపట్టనట్లు వ్యవహరించిన పోలీసులు, కలెక్టర్లు, ఇతర అధికారులు కూడా ఇందుకు మూల్యం చెల్లించాల్సిందే. అందుకే వారిపై కఠినమైన చర్యలు ఉంటే భవిష్యత్ లో ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉంటాయి. జడ్జిలు సైతం హింసపై నేరుగా కోర్టులోనే వ్యాఖ్యలు చేశారంటే ఎన్నికల అధికారుల తీరును తప్పుపట్టినట్లుగానే చెప్పొచ్చు.

Read More
Next Story