
'ఉప్పూ, కారం లేని ఆ సభకు వెళ్తే ఎంత? వెళ్లకపోతే ఎంత?'
చంద్రబాబో, జగనో.. అసెంబ్లీలో ఎవరో ఒకరు ఉంటారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఒకప్పుడైతే అస్త్రశస్త్రాలు సిద్ధం, కత్తులు నూరుతున్నారు, ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు, వ్యూహాలు ఖరారు.. వంటి వార్తలు, ముందస్తు కథనాలు పత్రికల్లో వచ్చేవి.. ఇప్పుడావసరం లేదు. అంతా ఏకపక్షమే. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ శాసనసభ్యుల మాత్రమే సభకు వస్తారు. మిగతా పార్టీలు సభలను బహిష్కరిస్తుండడం- విభజిత ఆంధ్రప్రదేశ్ లో మామూలైంది. ఈసారి కూడా అంతే జరగబోతోంది. సభలో చంద్రబాబుంటే జగన్ రాడు, జగన్ ఉంటే చంద్రబాబు రాడు అనేది రూఢీ అయింది.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత 16వ శాసనసభకు సంబంధించి 4వ సెషన్ ఇది. 18న ఉదయం 9గంటలకు ప్రారంభించేందుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అనుమతించారు. శాసనమండలి 48వ సెషన్ కూడా 18న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఓ వారం పాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆరు ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లుల్ని ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇవేకాకుండా మరికొన్ని బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశముంది.
ఈ బిల్లులు, తీర్మానాలు, ప్రత్యేక ప్రకటనలు ఎన్ని సభలో పెట్టినా వాటిపై ప్రత్యేకంగా చర్చ సాగేది ఏమీ ఉండదు. ప్రతిపక్షం సభకు రాదు గనుక అధికార పక్షం, దాని భాగస్వామ్య పక్షాల సభ్యులు- ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి దాన్నీ ఓకే చేస్తాయి. అభ్యంతరాలు వ్యక్తం చేయడానికో విమర్శలు చేయడానికో విపక్షం ఉండదు గనుక అంతా సాఫీగా, ఎటువంటి ఉరుములు మెరుపులు లేకుండానే సభ సాగిపోతుంది.
మిగతా ప్రజా సమస్యలంటారా.. అసెంబ్లీలో ఏనాడూ చర్చించిందీ లేదూ పరిష్కరించిందీ లేదూ.. అధికార పార్టీ ఏమనుకుంటే అదే ప్రజా సమస్య అనే నానుడి జనం నోళ్లలో నానడం చాలా కాలం కిందటే ప్రారంభమైంది.
సభలో ఏదైనా సమస్య వచ్చినా ఒకర్నొకరు దెప్పిపొడుచుకోవడమే లేక అడ్డమైన మాటలనుకుని సభ నుంచి వాకౌట్లు చేయడమో జరిగిన గతం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు.
ఏ రాష్ట్రంలో లేని విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. ఇక్కడున్నప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైసీపీ, జనసేన అన్నీ కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తుంటాయి. ఇక్కడ మాత్రం కత్తులు నూరుకుంటుంటాయి. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ కొద్దికాలం సభకు వెళ్లి ఆ తర్వాత గైర్హాజరు అయ్యారు. జగన్ పాదయాత్ర చేపట్టారు.
2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను, తన భార్యను అవమానించారంటూ టీడీపీ అధినేత, ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభను బహిష్కరించి ఇల్లూ లేదా పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లు పెట్టారే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభకు వస్తానని ప్రతిజ్ఞ చేసి పంతం చెల్లించుకున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 11 సీట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గత అనుభవాల దృష్ట్యా అసెంబ్లీకి పోయినా తన మాట నెగ్గదనుకున్నారో ఏమో గాని జగన్ ఓ కొత్త మెలిక పెట్టారు. 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి గనుక ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తా, లేకుంటే రానని భీష్మించుకూర్చున్నారు. ఈ వ్యవహారమై స్పీకర్ తేల్చాల్సిందే తప్ప తామేమీ చేయలేమని కోర్టు కూడా చేతులెత్తిన నేపథ్యంలో సభకు రావాలంటూ సీఎం చంద్రబాబు వైసీపీ నేత జగన్ కు సవాల్ విసిరారు.
స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు, డెప్యూటీ స్పీకరు కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సభకు రాకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజైతే ఓ అడుగు ముందుకేసి 60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుందన్నారు. చందమామ కోసం చంటి పిల్లాడు మారాం చేసినట్లు ప్రతిపక్ష హోదా కోసం జగన్ మారాం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ‘18 స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష హోదా అర్హత పొందుతారనే విషయం తెలిసి కూడా హోదా కావాలనడం విడ్డూరంగా ఉంది. శాసనసభకు రానంటూ జగన్ మారాం చేస్తే పులివెందులకు కూడా బైఎలక్షన్ వస్తుంది’ అని రాఘరామరాజు అన్నారు.
తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ పేర్కొంటూ వస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తామని జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. కూటమి ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. అదేమంటే రూల్స్ అంటోంది. కనుక జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తుందని గానీ జగన్ సభకు వెళతాడని గాని అసలు ఊహించలేం.
60 రోజులు రాకుంటే ఏమవుద్దీ?
అయితే వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుకావడానికి ఒక లిమిట్ ఉంది అని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు పోకుండా ఉండేందుకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశ దినాలు గైర్హాజరైతే, ఆ సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం శాసనసభకు ఉంటుంది. ఈ నిబంధన వర్తించకుండా ఉండాలంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కానీ...వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లి వస్తే సరిపోతుంది. లేదంటే ఓసారి సంతకం పెట్టి వచ్చినా సరిపోతుంది. గతంలో జరిగిందే ఇప్పుడూ జరుగుతుందని వైసీపీ నేతలే చెబుతున్నారు. సభకు పోనంత మాత్రాన శాసన సభ సభ్యత్వానికే దూరం అయ్యే ప్రమాదమేమీ లేదు. జీతభత్యాలకు వచ్చే ఢోకా కూడా ఏమీ ఉండదు.
ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా ఉప్పూ కారంలేని పప్పు మాదిరే ఉంటాయి. చంద్రబాబున్న సభకు జగన్ రాడు. ఎవరో ఒకరు మాత్రమే సభలో ఉంటారు. బహుశా ఇది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన తీర్పు ఫలితమేమో.. ఒకే పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ సీట్లు కట్టడం వల్ల జరుగుతున్న నష్టమేమోనని పాత తరం కమ్యూనిస్టు నాయకుడు జి.భద్రం అన్నారు. అధికార పార్టీకి ఏ 80, 85 సీట్లో వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా అని ఆయన చెప్పిన మాటలో అర్థం ఉందనే ప్రస్తుత పరిస్థితిని చూస్తే అనిపిస్తోంది.
అప్పటి వరకు సభకు రాని నాయకుడు తన పార్టీ కార్యాలయంలోనే నమూనా అసెంబ్లీ పెట్టుకుని తాను చెప్పదల్చుకున్నది చెప్తే సరిపోతుంది. అదే సభకు వెళ్లే నాయకులైతే అసెంబ్లీలోనే తాను చెప్పదల్చుకున్నది చెప్పవచ్చు. ఎవరూ మైకు కట్ చేయరు. ప్రజలకు కూడా నిజానిజాలు తెలుస్తాయని జి.భద్రం చమత్కరించారు.
Next Story