తెలుగుదేశం పొత్తులతో ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసిందో తెలుసా?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఇప్పటి వరకు ఎన్నిసార్లు పొత్తులతో పోటీచేసింది? పొత్తు లేకుండా ఎన్నిసార్లు పోటీకి దిగింది? ఇప్పుడు భవితవ్యం ఏమిటి?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత మొదటిసారిగా 1983లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు మొదలు 2014 వరకు ప్రతిసారీ వేరే పార్టీలను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. పొత్తు లేకుండా కేవలం గత ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. 2024 ఎన్నికల్లో జనసేన, బిజెపి కూటమితో కలిసి పోటీకి దిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడమే తెలుగుదేశం పార్టీ పనిగా మారింది. మిగిలిన ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఇవ్వలేకపోతున్నాయి. అందువల్లే బావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి టీడీపీ ముందుకు సాగుతూ వచ్చింది. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ పొత్తుల చరిత్రను పరిశీలిద్దాం.
1983 మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులను కలుపుకుని పోటీ చేయాలని భావించింది. అయితే ఎన్టీ రామారావుకు ఇన్ని సీట్లు వస్తాయని భావించని కమ్యూనిస్టులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ దశలో కేంద్రంలోని మేనకా గాంధీ నాయకత్వాన ఉన్న సంజయ్ విచార్ మంచ్ పార్టీ నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ గుర్తైన సైకిల్ ను వారికి కేటాయించింది. వారు కూడా గెలిచారు. ముక్కు మొఖం తెలియకపోయినా వారిని జనం గెలిపించారంటే పరిస్థితి ఏమిటి? ఎందుకు కాంగ్రెస్ పై అంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి 201సీట్లు వచ్చాయి.
ఆ తరువాత 1985లో ఎన్నికలు జరిగాయి. సిపిఐ, సిపిఎం, బిజెపిని కలుపుకుని ఎన్నికల్లో పోటీచేసిన తెలుగుదేశం పార్టీకి 202 సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ కు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. మొదటి సారి రాష్ట్రంలో బిజెపితో పాటు టీడీపీతో కలిసి కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు. ఆ తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో బిజెపిని పక్కన బెట్టి సిపిఐ, సిపిఎంలతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అప్పుడు కాంగ్రెస్ కు 181 సీట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 74 సీట్లు వచ్చి ప్రతిపక్షానికే పరిమితమైంది. తిరిగి మరళా 1994లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎంలు కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశంకు 216 సీట్లు రాగా కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే వచ్చాయి.
ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం బిజెపిని కలుపుకుని పోటీ చేసింది. ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి 180 సీట్లు రాగా కాంగ్రెస్ కు 91 సీట్లు వచ్చాయి. 2004లోనూ తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు, టిఆర్ఎస్ ను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కు 185 సీట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 47 సీట్లు వచ్చాయి. తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో బిజెపిని వదిలేసి టిఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిపి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కూటమి ఓటమి పాలైంది. అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీ చేయడంతో ఆయనకు 18 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 156 సీట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 92 సీట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీకి 2009లో జరిగిన ఎన్నికలే చివరి ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారు. దీంతో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ పోటీకి దిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పటి లాగే పొత్తుకు ప్రయత్నించి బిజెపితో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 102 సీట్లు తెలుగుదేశం పార్టీకి రాగా వైఎస్సార్సీపీకి 67 సీట్లు వచ్చాయి. బిజెపికి నాలుగు సీట్లు దక్కాయి. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసింది. పొత్తులో ఎవ్వరినీ కలుపుకోలేదు. వైఎస్సార్సీపీకి 151 సీట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి. జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పిలు కలిసి కూటమిగా పోటీ చేసినా ప్రజలు తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన ఫార్టీ నుంచి ఒకరు గెలిచారు. పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
2024లో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపి, జనసేన పార్టీలను కలుపుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. మొత్తంగా ఒక్కసారి మినహా అంటే 2019లో మాత్రమే పొత్తులేకుండా టిడిపి పోటీచేసింది. ఆ ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. మూడు కేవలం సార్లు బిజెపి, ఒకసారి సంజయ్ విచార్ మంచ్, కమ్యూనిస్టులు, బిజెపితో కలిసి ఒకసారి, కేవలం కమ్యూనిస్టులతో కలిసి మూడు సార్లు టీడీపీ పోటీ చేసింది. 2024లో జరిగే ఎన్నికల్లో కొత్తగా బిజెపితో పాటు జనసేనను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్నికలు మొత్తం తొమ్మిసార్లు జరిగాయి. పొత్తులతో తెలుగుదేశం పార్టీ ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేసింది. ఒక్కసారి మాత్రమే స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కూటమి గెలుస్తుందా? వైఎస్సార్సీపీ గెలుస్తుందా అనేది సందిగ్ధంగా ఉంది.